చిరంజీవ... చిరంజీవ...వైసీపీ కొత్త జపం

Update: 2022-09-20 02:30 GMT
ఏపీలో వైసీపీ రాజకీయ ఎత్తుగడలు కొత్త రూట్లో వెళ్తున్నాయి. ఏపీని శాసిస్తున్న కుల రాజకీయాల్లో నెగ్గి తమ వైపునకు ఓటు రాబట్టుకోవాలంటే చాలా రాజకీయ  విన్యాసాలు చేయాలి. ఏపీలో చూస్తే టీడీపీ వైసీపీ ఇప్పటిదాకా రాజకీయాలను చెరో వైపు నిలబడి సవాల్ చేసుకుంటూ వచ్చాయి. కానీ 2024లో సీన్ అలా ఉండదు, జనసేన కూడా పోటీలో ఉంటోంది. ఆ పార్టీ తానుగా అద్భుతాలు సృష్టించలేకపోవచ్చు కానీ ఇతర పార్టీల విజయావకాశాలు దెబ్బతీసే స్తోమత కలిగి ఉందని విశ్లేషణలు అయితే బలంగా ఉన్నాయి.

ఏపీలో బలమైన సామాజికవర్గంగా ఉన్న కాపులలో అత్యధికులు  జనసేన వైపు ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా అయితే జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. అదే టైం లో కాపుల మద్దతు ఎంతో కొంత టీడీపీకి ఉంది. మరి అధికార వైసీపీ సంగతేంటి. పవన్ టీడీపీకి మిత్రుడిగా ఉన్నా లేకపోయినా ఆ పార్టీని ఆయన ఏమీ అనడంలేదు. ఆ విధంగా కాపులలో టీడీపీ పట్ల నెగిటివిటీ అయితే పెద్దగా కనిపించదు. కానీ పవన్ టార్గెట్ వైసీపీ కాబట్టి కాపులలో కూడా ఆ వ్యతిరేకత చాలానే ఉండే చాన్స్ ఉంది.

పైగా పవన్ కి కౌంటర్ ఇచ్చే క్రమంలో వైసీపీ నుంచి కూడా హాట్ కామెంట్స్ పడుతూంటాయి. దాని వల్ల కూడా కాపు సమాజం హర్ట్ అయ్యే సీన్ ఉంది. దాంతో ఇపుడు వైసీపీ కొత్త ప్లాన్ లో ముందుకు సాగుతోంది. తమకు అసలు సిసలు ప్రత్యర్ధిగా ఉన్న పవన్ని గట్టిగా తూలనాడాలి. ఆయన రాజకీయాన్ని ఎండగట్టాలి. అదే టైం లో ఆ బాణాలు కాపు సమాజానికి నేరుగా తగలకుండా చూసుకోవాలి. ఈ రకమైన కొత్త ఎత్తుగడలతో వైసీపీ మధ్యలోకి సినిమాల్లో ఉన్న మెగాస్టార్  చిరంజీవిని తెస్తోంది.

పూర్తిగా చిరంజీవి కొమ్ము కాస్తూ ఆయన మంచివాడు, గట్స్ ఉన్న వారు రాజకీయాల్లో నిఖార్సు అయిన నేత అని వైసీపీ అదే పనిగా కీర్తిస్తోంది. ఇక జగన్ అయితే చిరంజీవిని అన్నా అంటూ ఆదరిస్తూ వస్తున్నారు. ఒక విధంగా మెగాస్టార్ రాజకీయాల్లో లేకపోయినప్పటికీ ఆయన మద్దతు తమకు ఉందని చెప్పుకోవడానికి వైసీపీ ఆయన పేరుని వాడుకుంటోంది. తమ్ముడు చెడ్డవాడు అన్న మంచివాడు ఈ రకమైన విభజనతో వైసీపీ కొత్త ఆట మొదలెట్టింది.

పవన్ని రాజకీయంగా ఎందుకు కొరగాని వానిగా మాజీ మంత్రి పేర్ని నాని చిత్రీకరిస్తూనే చిరంజీవిని బహు మొనగాడు అని ఆకాశానికి ఎత్తేశారు. చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీని పెట్టారు. దమ్ముగా 294 అసెంబ్లీ సీట్లకు అభ్యర్ధులను నిలబెట్టారు. తాను గెలవడంతో పాటుగా 17 మందిని కూడా తనతో గెలిపించుకున్నారు. ఆయన కొన్నాళ్ళు పార్టీని నడిపి ప్రజా ఉద్యమాలు కూడా చేశారు.

ఆ మీదట ఆయన కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసి కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇక హుందాగా రాజకీయాల నుంచి తప్పుకుని ఆయన తన సినిమాలు తాను చేసుకుంటూ వస్తున్నారు. దటీజ్ చిరంజీవి అని పేర్ని నాని ఒక లెవెల్ లో ఆయన్ని పొగిడేశారు. అదే పవన్ 2014లో జనసేన పార్టీ పెట్టి పోటీ చేయకుండా చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తూ ఆయన కోసం రాజకీయం చేస్తున్నారు అని నిందించారు. పవన్ 2009 ఎన్నికల్లో చంద్రబాబును నయవంచకుడు అని విమర్శించి ఆ తరువాత మద్దతు ఇవ్వడం ఏ రకమైన రాజకీయం అని పేర్ని నాని ప్రశ్నించారు.

మొత్తానికి చిరంజీవి  దక్షత కలిగిన నాయకుడు, ఆయన ప్రజారాజ్యం పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారు తమ్ముడు  పవన్ అంటూ పేర్ని నాని ఏక‌డం వెనక మెగాభిమానులను ఎంతో కొంత తమ వైపు తిప్పుకునే ఎత్తుగడ ఉంది అంటున్నారు. సొంత అన్న చిరంజీవి తప్పులు చేశారు అని పవన్ విమర్శలు చేయడం కంటే దారుణం ఉండదని కూడా పేర్ని కౌంటర్లు వేశారు. చిరంజీవి లేకపోతే పవన్ ఎక్కడ అని నిలదీశారు. నాడు ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కాకుండా ఎందుకు ఆపలేదు, పార్టీ ఓడగానే ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ పవన్ మీద విమర్శలు కురిపించారు.

మొత్తానికి చిరంజీవి చాలా గ్రేట్  అని పేర్ని నాని తెగ పొగుడుతున్నారు. పవన్ కి సాలిడ్ గా సొంత సామాజికవర్గం ఓట్లు పడకుండా వైసీపీ వేస్తున్న ఎత్తుగడ ఇది అని అంటున్నారు. అయితే కాపుల్లో నిజానికి ఆ రకమైన మెగా  విభజన ఉందా అన్నది ఒక చర్చ. పైగా చిరంజీవి ఎంత కాదన్నా పవన్ కి అన్న. వారిద్దరి మధ్యన ఆ బంధం గొప్పది, గట్టిది. దాంతో చిరంజీవిని ఎంత సొంతం చేసుకోవాలన్నా వైసీపీకి కుదిరే పని కాదు అనే అంటున్నారు. ఇక చిరంజీవి ప్రభావం రాజకీయంగా ఎంత ఉంటుంది అన్నది కూడా తెలియదు. దాంతో వైసీపీ కొత్త ఎత్తు వృధా ప్రయాసగానే మిగులుతుందా లేక గోదావరి జిల్లాలో ఎంతో కొంత ప్రయోజనం సమకూర్చుతుందా అన్నదే చర్చగా ఉందిపుడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News