ఎమ్మెల్యేల్ని బస్సు ఎక్కించిన చిన్నమ్మ

Update: 2017-02-08 11:32 GMT
తమిళనాట కొత్త తరహా రాజకీయాలకు తెర లేచినట్లే. నిన్నటివరకూ అధికారంలో ఎవరుంటే వారే మొనగాళ్లు అన్న పరిస్థితి. కానీ.. అమ్మ పుణ్యమా అని పరిస్థితి మొత్తం మారిపోయింది. పార్టీ చీఫ్ గా చేతిలో అధికారం ఉన్నప్పటికీ పార్టీ మీద పట్టు ఎంతన్న నమ్మకం చిన్నమ్మకు లేని పరిస్థితి. పన్నీరు సెల్వం తిరుగుబాటు బావుటాతో.. ఈ రోజు ఉదయం బలప్రదర్శనను చేసిన ఆమె.. తన సత్తా ఏమిటో చాటింది.

పార్టీకి చెందిన 134 మంది ఎమ్మెల్యేల్లో 130 మంది ఎమ్మెల్యేలు చిన్నమ్మతో ఉన్న విషయం.. పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంతో తేలినట్లైంది. ఈ సందర్భంగా పార్టీ నేతలతో మాట్లాడిన చిన్నమ్మ పన్నీర్ సెల్వంపై నిప్పులు చెరిగారు. ద్రోహి అన్న మాటను అనేయటమే కాదు.. తన నెచ్చెలి అమ్మతో కలిసి ఇలాంటి కుట్రలు తాను చాలానే చూశానని.. ఇలాంటివేమీ తనను ఏమీ చేయలేదని తేల్చేశారు.

పన్నీర్ ను ఎలా డీల్ చేయాలో తనకు తెలుసన్నట్లుగా చెప్పిన ఆమె.. పార్టీ కార్యాలయంలో ప్రదర్శించిన బలాన్ని.. చేజారకుండా ఉండేందుకు వీలుగా పక్కా వ్యూహాన్ని సిద్ధం చేశారు. తన పక్షాన ఉన్న పార్టీ ఎమ్మెల్యేల్ని బస్సులెక్కించిన ఆమె.. రహస్యప్రాంతానికి తరలించారు. ఇన్ ఛార్జ్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న సీహెచ్ విద్యాసాగర్ రావు చెన్నైకి రాకుండా ముంబయిలోనే ఉండిపోవటంతో.. ఆయన వచ్చే వరకూ ఎమ్మెల్యేల్ని ఇంతే కట్టుగా ఉంచటం కష్టమని అనుకున్నారేమో కానీ.. వారందరిని కలిపి హోటల్ కు తరలించారు.

గవర్నర్ ఎదుట అవసరమైన సమయంలో తన బలాన్నిప్రదర్శించేందుకు వీలుగా ఆమె వ్యవహరిస్తున్నారని చెప్పాలి. అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఉన్న చిన్నమ్మపై ఉన్న కేసులు మరో వారంలో తీర్పు రాబోతుందన్నమాటను సుప్రీం చెప్పటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు తర్వాత చిన్నమ్మ చేత ప్రమాణస్వీకారం చేయించాలన్న ఆలోచనలో గవర్నర్ ఉన్నట్లుగా చెబుతున్నారు. అప్పటివరకూ ఎమ్మెల్యేల్ని తన పక్షాన నిలుపుకునే విషయంలో చిన్నమ్మకు సందేహాలు ఉన్నట్లుగా తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి. మరోవైపు.. తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం ఈ రోజు ముంబయికి పయనమవుతున్నారు.

తన చేత బలవంతంగా రాజీనామా చేయించారని.. ప్రజలు.. పార్టీ ఎమ్మెల్యేలు కోరుకుంటే తన రాజీనామానువెనక్కి తీసుకుంటానని చెప్పిన పన్నీర్.. తాజాగా ముంబయి బయలుదేరి.. గవర్నర్ ను కలుసుకోవాలని నిర్ణయించటం ఆసక్తికరంగా మారింది. ముంబయి వెళ్లే పన్నీర్ కు గవర్నర్ విద్యాసాగర్ రావు అపాయింట్ మెంట్ ఇస్తారా? ఒకవేళ ఇస్తే.. పన్నీర్  వాదనకు ఆయన ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News