ఆర్ఎస్ఎస్ అగ్రనేతతో మోడీషా కీలక చర్చలు?

Update: 2021-05-24 05:30 GMT
ఒకప్పుడు బీజేపీకి కర్త కర్మ క్రియ ఆర్ఎస్ఎస్. వాళ్లు చెప్పిన వారే దేశంలో బీజేపీని లీడ్ చేసేవారు.. ప్రధానులు, ముఖ్యమంత్రులు అయ్యేవారు. అలా వచ్చిన వారే మోడీ. కానీ తన సొంత ఇమేజ్ తో బీజేపీని గద్దెనెక్కించాక అస్సలు ఆర్ఎస్ఎస్ ను పక్కనపెట్టారన్న చర్చ సాగింది. అంతా మోడీ స్వామ్యంగా మార్చేశారన్న విమర్శలు వినిపించాయి. అయితే ఇప్పుడు బీజేపీ చేతులు కాలాయి. రాష్ట్రాలు చేజారుతున్నాయి. దేశంలో కరోనా కల్లోలం లాక్ డౌన్ ను డీల్ చేయలేక బీజేపీ సర్కార్ ఆపసోపాలు పడుతోంది. బీజేపీ గ్రాఫ్ పడిపోతున్న వేళ మోడీ షాలకు మళ్లీ ఆర్ఎస్ఎస్ గుర్తుకు రావడం విశేషం.

ఆర్ఎస్ఎస్ కార్యవాహ్ దత్తాత్రేయ హోస్ బళే, బీజేపీ అగ్ర నేతలు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ మంత్రి సునీల్ మధ్య కీలక చర్చలు జరగడం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

2022లో జరగబోయే యూపీ ఎన్నికల చుట్టే ఈ చర్చలు జరిగినట్టు భోగట్టా. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఎంపీ సీట్లే కారణం. అందుకే యూపీపై బీజేపీ స్పెషల్ నజర్ పెట్టింది.

రెండు రోజులుగా యూపీ మంత్రి సునీల్ బన్సల్ ఢిల్లీలోనే మకాం వేశారు. గత ఎన్నికల్లో సునీల్ తెరవెనుక కీలక పాత్ర పోషించి యూపీలో బీజేపీని అధికారపీఠం ఎక్కించారు. యూపీలో బీజేపీకి ఎదురుగాలి దృష్ట్యా రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించే ఈ చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

యూపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం దృష్ట్యానే బీజేపీ కేంద్ర అధిష్టానం దీనిపై దృష్టిసారించే వచ్చే ఎన్నికల్లో ఓడిపోకుండా యూపీ లో గెలుపు కోసం వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. అతివిశ్వాసమే యూపీలో బీజేపీ కొంప ముంచిందని తేల్చారు. ఆర్ఎస్ఎస్ అగ్రనేత దృష్టికి దీన్ని తీసుకెళ్లి యూపీలో గెలుపు కోసం సంఘ్ సాయం కోరినట్టు సమాచారం.
Tags:    

Similar News