లాల్ కు ప‌ద్మ‌భూష‌ణ్, సిరివెన్నెల‌కు ప‌ద్మ‌శ్రీ

Update: 2019-01-26 04:10 GMT
``విరించినై విర‌చించితిని ఈ క‌వ‌నం
విపంచినై వినిపించితిని ఈ గానం..``

``నాతో నేను అనుగ‌మిస్తూ ...నాతో నేనే ర‌మిస్తూ
ఒంట‌రినై అన‌వ‌ర‌తం కంటున్నాను నిరంత‌రం
క‌ల‌ల‌ని.. క‌థ‌ల‌ని.. మాట‌ల్ని, పాట‌ల‌ని..
రంగుల్నీ..రంగ‌వ‌ల్లులని..కావ్య క‌న్య‌ల‌ని..``

ఇలాంటి హ‌త్తుకునే ప‌ద‌జాలం ఉప‌యోగించ‌గ‌ల ఏకైక ర‌చ‌యిత ఎవ‌రు? అంటే సిరివెన్నెల గుర్తుకు రావాల్సిందే. పాట‌ల రచ‌యిత‌గా సుదీర్ఘ అనుభ‌వం ఉన్న సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి  పండిత‌, పామ‌ర భాష‌ను పాట‌కు ఉప‌యోగించ‌గ‌ల స‌మ‌ర్ధుడిగా ఖ్యాతి ఘ‌డించారు. అందుకే ద‌శాబ్ధాలు గ‌డిచినా ఆయ‌న క్రేజు ఏమాత్రం చెక్కు చెద‌ర‌లేదు. వంద‌లాది పాట‌లు రాశారాయ‌న‌. ఇప్ప‌టికీ అద్భుత‌మైన పాట‌లు రాస్తూ శ్రోత‌ల మెప్పు పొందుతున్నారు. ద‌శాబ్ధాల పాటు పాట‌కు, సినీరంగానికి ఆయ‌న అందించిన సేవ‌ల‌కు త‌గ్గ స‌ముచిత గౌర‌వం ద‌క్కిందా? అంటే అవున‌ని అన‌లేని ప‌రిస్థితి.

ఇన్నేళ్ల‌లో జాతీయ అవార్డు అందుకున్నారు. ఎన్నో నందులు అందుకున్నారు. కానీ ప‌ద్మ‌శ్రీ అంద‌ని మావి అయ్యింది. అయితే ఆ క‌ల ఇంత‌కాలానికి నెర‌వేరుస్తూ భార‌త ప్ర‌భుత్వం ఆయ‌న‌కు ప‌ద్మ‌శ్రీ పురస్కారాన్ని ప్ర‌క‌టించింది. సూప‌ర్‌స్టార్ మోహ‌న్ లాల్ కి ప‌ద్మ భూష‌ణ్ పుర‌స్కారం ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప్ర‌ముఖ లిరిసిస్ట్ సిరివెన్నెల‌,మ‌నోజ్ భాజ్ పాయ్, ఆల్ రౌండ‌ర్ ప్ర‌భుదేవా, శంక‌ర మ‌హ‌దేవ‌న్, శివ‌మ‌ని పద్మ‌శ్రీ పుర‌స్కారాల‌కు ఎంపిక‌య్యారు. 112 ప‌ద్మ అవార్డులు ప్ర‌క‌టిస్తే అందులో తెలుగు వారికి నాలుగు పుర‌స్కారాలు ద‌క్కాయి.

సిరివెన్నెల‌కు పుర‌స్కారం ద‌క్క‌గానే వెంట‌నే అభిమానులు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు చెబుతూ సామాజిక మాధ్య‌మాల్లో హోరెత్తించారు. సెల‌బ్రిటీలు ఆయ‌న‌కు విషెస్ తెలియజేశారు. వివేక్ కూచిభొట్ల‌, మారుతి స‌హా మ‌హేష్, ఎన్టీఆర్, చ‌ర‌ణ్ అభిమానులు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.
    

Tags:    

Similar News