సరికొత్త పరిణామం.. ముస్లిం నేత హిందూ మతంలోకి మారారు

Update: 2021-12-07 04:27 GMT
అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లో కొద్ది కాలంగా ముస్లిం నేతలకు.. మత పెద్దలకు తన చర్యలతో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్న యూపీ షియా వక్ఫ్ బోర్డు మాజీ ఛైర్మన్ వసీమ్ రిజ్వి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయన హిందూ మతంలోకి మారారు.

దీనికి సంబంధించిన క్రతవు కూడా భారీగా నిర్వహించారు. ఇప్పటివరకు ఉన్న తన రిజ్వీ పేరును జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగిగా ఆయన మార్చుకున్నట్లుగా ప్రకటించారు. ముస్లింలు తనను మతం నుంచి బహిష్కరించారని.. తన ఇష్టం వచ్చిన మతం స్వీకరించే స్వేచ్ఛ.. స్వతంత్య్రం తనకు ఉందని ఆయన పేర్కొన్నారు.

సోమవారం ఆయన ఘజియాబాద్ లోని దాస్నాదేవి ఆలయంలోని ఆలయ పూజారి యతి నర్సింగానంద్ సరస్వతితో కలిసి మత మార్పిడి క్రతువును పూర్తి చేశారు. తాను మతం మారిన సందర్భంగా మాట్లాడిన ఆయన.. తన కుటుంబ సభ్యులకు తమకు నచ్చిన మతాన్ని అనుసరించొచ్చు అని చెప్పారు.

డిసెంబరు ఆరున వివాదాస్పద కట్టడాన్ని ధ్వంసం చేసిన పవిత్ర దినాన తాను హిందువుగా మారినట్లు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను సనాతన ధర్మంగా భావించే హిందూ మతంలోకి మారినట్లుగా చెప్పిన ఆయన.. ‘‘ఈ రోజు నుంచి హిందూ మతం కోసం పని చేస్తాను. ముస్లింల ఓట్లు ఏ పార్టీకి పడవు. హిందువులను ఓడించేందుకు మాత్రమే వారు తమ ఓట్లను వేశారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. వారు హిందువులను చంపుతూ.. వారి ఇళ్లకు నిప్పు పెడుతున్నారు. అలాంటి వారికి హిందువులు దూరంగా ఉండాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

నిజానికి రిజ్వీ అలియాస్ జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగి వ్యవహరశైలిని చూస్తే.. ఆయన తగత నెలలో మహమ్మద్ అనే గ్రంధాన్ని విడుదల చేసి పెను కలకలాన్ని రేపారు. యూపీలోని చాలామంది మత పెద్దలతో పాటు ఇతరుల మనోభావాల్ని దెబ్బ తీసేలా ఒక ముఖచిత్రం ఉన్న పుస్తకాన్ని విడుదల చేశారు.

ఈ పుస్తకంలో మహ్మద్ ప్రవక్త మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా షియా పర్సనల్ లా బోర్డుతో సహా కొన్ని మతపరమైన సంస్థలు ఆయనకు నోటీసులు పంపాయి. అంతేకాదు.. ఆయనపై కేసు పెట్టాలని.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశాయి.

ఈ వివాదాస్పద పుస్తకాన్ని నవంబరు నాలుగున ఘజియాబాద్ లోని దాస్నా దేవి ఆలయంలో నర్సింహానంద్ సరస్వతి సమక్షంలో విడుదల చేశారు. అనంతరం నవంబరు 15న ఆయన తన ఫేస్ బుక్ పేజీ కవర్ పేజీ ఇమేజ్ ను.. ఈ వివాదాస్పద పుస్తకాన్ని కొనుగోలు చేయటానికి అనువుగా లింకును పోస్టు చేయటం ఈ ఇష్యూ మరింత తీవ్రరూపం దాల్చింది. ఇదిలా ఉంటే.. తాను మరణించిన తర్వాత హిందూ మత ఆచారాల ప్రకారం తనను దహనం చేయాలే తప్పించి ఖననం చేయకూడదని కోరారు.

అంతేకాదు.. తన అంత్యక్రియల్లో భాగంగా తన చితిని ఘజియాబాద్ లోని దాస్నా దేవాలయానికి చెందిన హిందూ ధర్మకర్త నరసింహ ఆనంద సరావతి నిప్పు అంటించాలని కోరారు. ఇంతటి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆయన.. సుప్రీంకోర్టును వివాదాస్పద అంశాన్ని ప్రస్తావిస్తూ పిటిషన్ దాఖలు చేశారు.

తన తలను నరికేయాలంటూ కొందరు పిలుపునిచ్చారని.. తనకు ప్రాణహాని ఉందని కోరారు. అయితే.. అత్యున్నత న్యాయస్థానం ఆయన పిటిషన్ ను స్వీకరించలేదు. అంతేకాదు రూ.50వేల జరిమానాను విధించింది. ఇదిలా ఉంటే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆయనపై ఫిర్యాదు చేశారు. మహ్మద్ ప్రవర్తను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఇలా ఆయన ఇప్పటికే పలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. తాజాగా మతం మారిన ఆయన ఇప్పుడు మరో సంచలనంగా మారారు.


Tags:    

Similar News