నమస్తే ఇండియా..ఇంట్రెస్టింగ్ గా ఉందే!

Update: 2020-04-19 14:03 GMT
కరోనా వైరస్.. కోవిడ్-19.. ఈ రెండిటిలో ఏ పేరు విన్నా ప్రపంచం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడుతోంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించాయి. భారతదేశంలో కూడా దాదాపు నెల రోజుల నుంచి లాక్ డౌన్ అమలులో ఉంది. ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప మిగతా వ్యాపారాలన్నీ మూతపడ్డాయి. అయితే ఈ సమయంలో భారతీయులు ప్రదర్శిస్తున్న పరిణతి.. ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇప్పటికే కరోనా వైరస్ పై అవగాహన పెంచేందుకు ఎంతోమంది బాణీలు కట్టి పాటలు పాడారు. తాజాగా ఇదే కోవలో 'నమస్తే ఇండియా- ఈ బౌ ది డివైన్ ఇన్ యూ' అంటూ సాగే ఒక వీడియో రిలీజ్ అయింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ స్వరపరిచిన వందేమాతరం పాటను నేపథ్యంగా ఎంచుకుని ప్రస్తుతం భారతదేశం కరోనాను ఎలా ఎదుర్కొంటుందో విజువల్స్ లో చూపిస్తూ.. భారత దేశంలోని పవిత్రతకు తలవంచి సలాం చెప్తూ ఈ వీడియో ఆసక్తికరంగా సాగింది. లాక్ డౌన్ ప్రకటించిన సమయంలో ప్రధాని మోడీ "భారతదేశాన్ని రక్షించుకోవడానికి ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావడంపై నియంత్రణలు విధిస్తున్నాము" అంటూ చేసిన లాక్ డౌన్ ప్రకటనను ఈ వీడియో చూపించారు.

హెల్త్ కేర్ వర్కర్స్ తమ ప్రాణాలను పణంగా కరోనా పేషెంట్లకు సేవలు చేస్తూ ఉండే విజువల్స్ ను ఇందులో పొందుపరిచారు. అంతేకాకుండా లాక్ డౌన్ సమర్థంగా అమలు పరచడానికి నిద్రాహారాలు మాని పని చేస్తున్న పోలీసులను కూడా ఇందులో చూపించారు.  ఇండియాలో మొదటి కోవిడ్-19 టెస్ట్ కిట్ ను తయారుచేసిన ప్రముఖ వైరాలజిస్ట్ మీనాల్ దఖావే భోంస్లే కి కృతజ్ఞతలు కూడా తెలిపారు.

ఇక మోడీ గారి చప్పట్ల పిలుపుకు ప్రజలు అద్భుత స్పందన వ్యక్తం కావడం.. దీపాలు వెలిగించడం లాంటివి కూడా ఈ వీడియోలో ఉన్నాయి. ప్రపంచంలోని పలు దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రం సరఫరా చేయడానికి ముందుకు రావడం కూడా ఇందులో ఉంది. ఫైనల్ గా మాతృభూమికి కృతజ్ఞతలు అని స్లైడ్ తో ముగించడం అద్భుతమనే చెప్పాలి. ఎప్పుడూ అది లేదు.. ఇది లేదు.. ఆవకాయ బద్ద లేదు.. అవినీతి ఉంది అంటూ ఏడుపుగొట్టు ఆలోచనలు కాకుండా..ఇలాంటి కఠిన సమస్య ఎదురైనప్పుడు భారతదేశం అంతా ఒక్క తాటిపై నిలిచి ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంలో ఇలాంటి వీడియోలు ప్రజలకు మరింత స్ఫూర్తిని ఇస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా ఆలస్యం ఎందుకు.. ఒక్కసారి పాటపై లుక్కేయండి.


Full View

Tags:    

Similar News