రోజా ఎఫెక్ట్!... ఆనంకు అరెస్ట్ వారెంట్లు!

Update: 2018-02-03 10:18 GMT
ఆనం బ్ర‌ద‌ర్స్‌ లో పెద్ద వారైన ఆనం వివేకానంద రెడ్డి ఓ విచిత్ర‌మైన పొలిటీషియ‌న్ అనే చెప్పాలి. ఎమ్మెల్యేగా ప‌లుమార్లు అసెంబ్లీలో స‌భ్యుడిగా వ్య‌వ‌హ‌రించిన ఆనం.. రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్‌ తో త‌ల బొప్పి క‌ట్టేసిన‌ట్లుగా గెలుపు కాదు క‌దా... క‌నీసం డిపాజిట్ కూడా ద‌క్కించుకునేందుకు నానా తిప్ప‌లు ప‌డ్డార‌నే చెప్పాలి. ఆనం సోద‌రుడు, మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డిది కూడా ఇదే ప‌రిస్థితి. అయితే వివేకా కంటే రామ‌నారాయ‌ణ‌రెడ్డి కాస్తంత బెట‌ర‌నే చెప్పాలి. సౌమ్యుడిగా - త‌న‌కు సంబంధం లేని విష‌యంలో త‌ల దూర్చ‌కుండా... ఒక‌వేళ విప‌క్షాల‌పై మాట్లాడాల్సి వ‌చ్చినా... ఎక్క‌డ కూడా క‌ట్టు త‌ప్ప‌కుండా వ్య‌వ‌హ‌రించ‌డంలో రామ‌నారాయ‌ణ రెడ్డి జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. అయితే త‌మ్ముడిగా వివాదాల‌కు దూరంగా ఉండ‌ట‌మంటే వివేకాకు న‌చ్చ‌దేమో. అందుకే ఎప్పుడు మీడియా ముందుకు వ‌చ్చినా... త‌న‌దైన నోటి దురుసును ప్ర‌ద‌ర్శించే వివేకా వివాదాల‌ను కొని తెచ్చుకుంటార‌నే చెప్పాలి. తాను రాజ‌కీయ నాయ‌కుడిన‌ని, త‌న‌ను ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌న్న ధీమాతో క‌నిపించే వివేకా... ఏ విష‌యంలోనైనా ఇదే రీతిన వ్య‌వ‌హ‌రిస్తారని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఓ ప్ర‌జా ప్ర‌తినిధిగా ఉన్న వివేకా బ‌హిరంగంగానే సిగ‌రెట్లు తాగ‌డం - స‌ద‌రు పొగ‌తో మ‌హిళ‌లు ఇబ్బందులు ప‌డుతున్నా... త‌న‌కేమీ ప‌ట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే కాకుండా.. ఆ ఇబ్బందులను గ‌మ‌నించిన త‌ర్వాత స‌ర్దుకోవాల్సింది పోయి మ‌రింత‌గా రెచ్చిపోయే వివేకా తీరు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా వేదిక‌గా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంద‌నే చెప్పాలి.

అయినా ఇప్పుడు వివేకా గురించి ఇంత ఉపోద్ఘాత‌మెందుకంటే... త‌న వ్య‌వ‌హార స‌ర‌ళితో వివేకా కోర్టుకు కూడా కోపం తెప్పించేశారు. ఏకంగా త‌న‌పై అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యేలా చేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివ‌రాల్లోకి వ‌స్తే... 2016, ఫిబ్రవరి 29న మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా వివేకానందరెడ్డి... వైసీపీ ఫైర్ బ్రాండ్‌ - చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే రోజాను కించపరిచేలా - ఆమె పరువుకు భంగం కలిగేలా పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్య‌లపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన రోజా... త‌న ప‌రువు భంగం క‌లిగించేలా వ్యాఖ్య‌లు చేసిన వివేకా త‌క్ష‌ణ‌మే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని, లేదంటే కోర్టును ఆశ్ర‌యించాల్సి వ‌స్తుంద‌ని ప్ర‌తిస్పందించారు. అయితే ఈ రోజా స్పంద‌న‌తో త‌న త‌ప్పును స‌రిదిద్దుకోవాల్సిన ఆనం... అందుకు విరుద్ధంగా ఆమెపై మ‌రింత ప‌రుష ప‌ద‌జాలంతో కూడిన వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఇక స‌హ‌నం ప‌నికి రాద‌ని భావించిన రోజా... వివేకాపై ప‌రువు న‌ష్టం దావా కేసు వేశారు.

రోజా పిటిష‌న్‌ను ప‌రిశీలించిన నాంప‌ల్లి కోర్టు... కేసు విచార‌ణ‌కు స్వీక‌రించింది. అంతేకాకుండా త‌న స్పంద‌న‌ను తెలియ‌జేయాల‌ని ఆనంకు నోటీసులు జారీ చేసింది. అయితే ఆనం కోర్టును కూడా లెక్క చేయ‌లేద‌నే చెప్పాలి. ప‌లుమార్లు పంపిన నోటీసుల‌కు స్పందించ‌ని వివేకా... అస‌లు కోర్టుకు తాను వెళ్లే స‌మ‌స్యే లేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో నేటి ఉద‌యం ఈ కేసు విచార‌ణ మ‌రోమారు జ‌ర‌గ‌గా... కోర్టు న్యాయ‌మూర్తి... వివేకా తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఓ ప్ర‌జా ప్ర‌తినిధిపై అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డ‌మే కాకుండా... కోర్టు అందించిన నోటీసుల‌ను కూడా లెక్క చేయ‌ని వివేకాను అరెస్ట్ చేయాలంటూ అప్ప‌టిక‌ప్పుడే అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. మొత్తంగా త‌న నిర్ల‌క్ష్య వైఖ‌రి కార‌ణంగా కోర్టు ఆగ్ర‌హానికి వివేకా గురైన‌ట్లుగా తెలుస్తోంది.


Tags:    

Similar News