కేసీఆర్ సర్కార్ వారి బుల్డోజర్ బయటకు..అతడి భవనాన్ని కూల్చేశారు

Update: 2022-11-14 04:42 GMT
ఇంతకాలం యూపీలోని యోగి సర్కారు వారి బుల్డోజర్ చేసిన సంచలనాల్ని చూశాం. ఇప్పుడు అదే బాటలో నడిచే కేసీఆర్ సర్కారు వారి పింక్ బుల్డోజర్ ను బయటకు తీశారు. తాజాగా ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడిగా వ్యవహరిస్తున్న నందకుమార్ కు చెందిన హోటల్ వద్ద ఉన్న అక్రమ నిర్మాణాల్ని పోలీసులు.. జీహెచ్ఎంసీ అధికారులు కలిసి కూల్చేసిన వైనం ఆసక్తికరంగా మారింది.

జూబ్లీ హిల్స్ లోని ఫిలింనగర్ మొదట్లో ఉండే దక్కన్ కిచెన్ పేరుతో ఒక హోటల్ ను నిర్వహిస్తున్నారు. దీన్ని తన పార్టనర్ తో కలిసి నందకుమార్ నిర్వహిస్తున్నారు. ఇటీవల శంకర్ పల్లిలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫాంహౌస్ లో టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు ఎర వేయటం.. ఆ విషయాన్ని సదరు గులాబీ ఎమ్మెల్యేలు పోలీసులకు సమాచారం అందించటంతో వారు రంగంలోకి దిగటం.. బీజేపీ మధ్యవర్తులుగా వచ్చిన ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు పంపటం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. ఈ ఉదంతంపై విచారణకు హైదరాబాద్ సీపీ ఆనంద్ నేత్రత్వంలో సిట్ ను ఏర్పాటు చేశారు. సిట్ పని చేయటం మొదలైన రరెండు రోజుల వ్యవధిలోనే దక్కన్ కిచెన్ హోటల్ లో సోదాలు నిర్వహించారు. ఆ తర్వాతి రోజే.. హోటల్ ముందు ఉన్న అక్రమ నిర్మాణల్ని జీహెచ్ఎంసీ కూల్చేసింది. దీన్నినందకుమార్ కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేయగా..పోలీసులు వారిని కొద్దిసేపు అదుపులోకి తీసుకొని వదిలేశారు.

అక్రమ నిర్మాణానికి సంబంధించి తమకు ఇప్పటికే ఫిర్యాదు అందిందని.. పలుమార్లు టీఎస్ బీపాస్ నిబంధనలకు అనుగుణంగా నోటీసులు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. అక్రమ నిర్మాణానికి సంబంధించిన పనులు నిలిపివేయాలని తాము నోటీసులు ఇచ్చినా.. రాత్రి వేళ.. పనులు చేయటం.. ఒక షాపును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న వేళ.. జీహెచ్ఎంసీ అధికారులు ఒళ్లు విరుచుకున్నారు. బుల్డోజర్ ను తెప్పించి.. కూల్చేశారు. అక్రమ నిర్మాణాన్ని సీజ్ చేశామని.. అయినా తిరిగి అందులో నిర్మాణం చేపట్టినట్లుగా చెబుతున్నారు.

ఈ కారణంతోనే చర్యల కత్తిని ఝుళిపించారు. వాస్తవానికి ఎంతో అత్యవసరం అయితే తప్పించి ఆదివారం వేళలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టరు. కానీ.. దక్కన్ కిచెన్ అక్రమ నిర్మాణాల్నిఆగమేఘాల మీద కూల్చేయటం చూస్తే.. ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించి నిందితుల విషయంలో కేసీఆర్ సర్కారు ఏ తీరులో ఉండనుందన్న విషయాన్ని చాటి చెప్పేలా తాజా పరిణామాలు ఉన్నాయని చెప్పక తప్పదు. ఇప్పటికే యూపీలోని యోగి సర్కారు ప్రయోగిస్తున్న బుల్డెజర్ సర్కారుపై పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. చూస్తుంటే.. కేసీఆర్ సీసర్కారు కూడా తమ రాజకీయ ప్రత్యర్థుల విషయంలో అలాంటి తీరునే ప్రదర్శించేందుకు సిద్ధమవుతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఇక్కడే మరో విషయాన్ని చెప్పాలి. ఈ స్థలం వాస్తవానికి ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు.. ఆయన సోదరుడు కమ్ అగ్ర హీరోల్ల ఒకరుగా పేరున్న వెంకటేశ్ లకు చెందిన ల్యాండ్. అయితే.. దీన్ని దగ్గుబాటి సోదరులు ఇద్దరు నందూకు లీజ్ కు ఇచ్చారు. తాము చేసుకున్న ఒప్పందానికి భిన్నంగా అక్రమ నిర్మాణాన్ని నిర్మిస్తుండటంతో.. దీనిపై సురేశ్ బాబు కోర్టుకు వెళ్లటం.. అక్కడ నుంచి ఆర్డర్ తీసుకొని అక్రమ నిర్మాణాల్ని కూల్చేందుకు ప్రయత్నించినట్లుగా చెబుతారు. కానీ.. అప్పట్లో సాధ్యం కానిది.. ఎమ్మెల్యేల ఎర ఎపిసోడ్ లో వ్యవస్థలు వాయు వేగంతో కదిలి.. కూల్చే వరకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News