వచ్చేది సెప్టెంబర్... ఎవరికి డేంజర్...?

Update: 2022-08-28 23:30 GMT
తెలుగు రాజకీయాల్లో ఆగస్ట్ నెలకు ఒక విశిష్టత ఉంది. ఈ నెల అంటే టీడీపీ భయపడుతుంది. 1984, 1995లలో వెన్నుపోటు ఎపిసోడ్ ఇదే నెలలో ఇక చంద్రబాబు కు బాగా బ్యాడ్ తెచ్చిన విద్యుత్ కాల్పులు కూడా ఇదే నెలలో జరిగాయి. దాని ఫలితంగానే కేసీయార్ పార్టీని 2000లో వీడిపోయి ఏకంగా టీడీపీకే గట్టి దెబ్బ కొట్టారు. అలా టీడీపీకి  ఆగస్ట్ గండం అని కూడా రాజకీయాల్లో ఎపుడూ వినిపించే మాట.

అయితే  చూడబోతే ఈసారి ఆగస్ట్ నెల తెలుగుదేశానికి గండం కాదు పండుగగా మారింది అని అంటున్నారు. ఇదే అగస్ట్ నెల మొదట్లో ఆజాదీ కా అమృతోత్సవ్ పేరిట ఢిల్లీలో మీటింగ్ పెడితే చంద్రబాబు స్వయంగా వెళ్ళి మూడేళ్ల విరామం తరువాత మోడీతో ముచ్చట్లు పెట్టారు. అది టీడీపీకి ఎంతో ఊపిరి పోసినట్లుగా అనిపించింది.

ఇక ఇదే ఆగస్టులో కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణా టూర్ కి వచ్చి టీడీపీకి పూర్తి అనుకూలమని భావించే ఒక మీడియా దిగ్గజంతో కీలక భేటీ నిర్వహించి పరిస్థితిని మరింత సానుకూలం చేశారు. ఇలా ఆగస్ట్ గండం కాదు వేడుక అని టీడీపీకి అనిపించేలా చేశాయి. అదే టైమ్ లో ఏపీలో అధికార వైసీపీకి మాత్రం ఆగస్ట్ నెలలో జరిగిన పరిణామాలు పెద్దగా రుచించినట్లుగా లేవు అని అంటున్నారు.

ఇక వచ్చేది సెప్టెంబర్ నెల. ఈ నెలలోనే తెలుగు నాట మరిన్ని నాటకీయ రాజకీయ పరిణామాలు జరుగుతాయని అంటున్నారు. ఈ విషయాన్ని చిన్న టీజర్ వదిలినట్లుగా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. ముందు ముందు చూడబోయేది సినిమాయే. ఊహకందదు అని బీజేపీ నేతలు అంటున్నారు. మరి ఆ సినిమా ఏంటి ఎవరికి అనుకూలంగా ఉంటుంది. అందులో ఎవరు హీరోగా ఉంటరు, విలన్ గా ఎవరు కష్టాలు పడతారు అన్నది కూడా అంతుపట్టని వ్యవహారంగా ఉంది.

ఇక సెప్టెంబర్ అంటే ఒక విషయం కూడా ముందుకు వస్తోంది. జగన్ మీద ఉన్న సీబీఐ కేసులను ఇక రోజువారీగా చేపడతారు అని తెలుస్తోంది. అంటే జగన్ కేసుల విషయం మీద ఒక క్లారిటీ ఏదో ఈ నెల వెళ్ళిపోయేలోగా చెబుతుంది అని అనుకోవాల్సి ఉంటుందేమో. ఇక ఇదే నెలలో చంద్రబాబు ఢిల్లీ టూర్ ఉంటుంది అని అంటున్నారు. బాబు అన్ని విషయాలు కేంద్రం దృష్టికి తెచ్చేందుకు బాగా ప్రిపేర్ అవుతున్నారు. అలాగే ఆయన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు.

బాబును ఎన్డీయేలోకి తీసుకునేందుకు రంగం సిద్ధం అవుతోంది. మరి బాబు ఊరకే చేరరు కదా. ఆయన కొన్ని కీలకమైన డిమాండ్లే పెడతారు అని అంటున్నారు. ముఖ్యంగా జగన్ బెయిల్ మీద కూడా టీడీపీ ఇప్పటికే గురి పెట్టి ఉంది. కేంద్రంతో ఈ విషయం మీదనే చర్చిస్తుందా అన్న చర్చ కూడా ఉంది. అలాగే ఏపీలో జగన్ని వీక్ చేస్తేనే తప్ప బీజేపీ టీడీపీ కూటమి బలపడదు, అధికారంలోకి రాదు, ఆ విధంగా చూస్తే బాబు వద్ద బోలేడు వ్యూహాలు ఉన్నాయి. మరి వాటిని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన పవర్ తో అమలు చేయాల్సినవి కూడా ఉన్నాయని అంటున్నారు.

మొత్తానికి చూస్తే సెప్టెంబర్ నెల నుంచి బాబు ఢిల్లీ టూర్లు ఎక్కువ అవుతాయని తెలుస్తోంది. అదే సమయంలో జగన్ ఇక మీదట ఢిల్లీ వెళ్ళి ఆయాసపడే శ్రమ కూడా పెద్దగా ఉండబోదు అని అంటున్నారు. ఇక్కడ ఒక కీలక విషయం ఏంటి అంటే బీజేపీ టీడీపీ మళ్ళీ కలవబోతున్నారు అన్న సంగతి పూర్తిగా వైసీపీకి తెలుసు. అయినా సరే వద్దు అంటూ వైసీపీ తన వంతుగా లాబీయింగ్ చేసింది.

కానీ  అప్పటికే బీజేపీ పెద్దలు బాబు మీద మోజు పెంచుకున్నారని ఆర్ధమవుతోంది. మరి ఏపీలో పూర్వపు పొత్తులు పొడిస్తే ఇబ్బందులు డేంజర్లు అన్నీ వైసీపీకే ఒకేసారి ముంచుకుని వస్తాయన్నది తెలిసిందే. మరి ఏ రూపంలో వస్తాయి. ఎలా వస్తాయి అన్నదే చూడాలి. ఆ బిగ్ ట్రబుల్స్ కి సెప్టెంబర్ నెల స్వాగతం పలుకుతుందా అన్నదే చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News