ఎన్టీఆర్ మామ ప్ర‌స్తుతానికి ఏం లేన‌ట్టేనట‌!

Update: 2020-01-29 23:30 GMT
ఎన్నిక‌ల ముందు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో నార్నె శ్రీనివాస‌రావు ఒక‌రు. ఈయ‌న మామూలుగా అయితే ఒక క‌మ్మ పారిశ్రామిక వేత్త మాత్ర‌మే. అయితే అంత‌కు మించి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కు స్వ‌యానా పిల్ల‌నిచ్చిన మామ‌. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడుకు బంధువు కూడా. ఆ బంధుత్వంతోనే.. ఎన్టీఆర్ కు నార్నె కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేందుకు అప్ప‌ట్లో చంద్ర‌బాబు నాయుడు మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించాడ‌ని అంటారు.

ఆ త‌ర్వాత చాలా కాలం పాటు నార్నె తెలుగుదేశం పార్టీకే సేవ చేశారు. ఒక మీడియా సంస్థను పెట్టి.. అప్ప‌ట్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా బాకా ఊదారు. ఆ సంస్థ‌కు లోకేష్ సీఈవోగా కూడా వ్య‌వ‌హ‌రించార‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చేవి. ఆ త‌ర్వాత ఏమైందో ఏమో కానీ.. నార్నెకు చంద్ర‌బాబుతో దూరం పెరిగింది. అది ఆయ‌న వైసీపీలో చేరేంత వ‌ర‌కూ వ‌చ్చింది.

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఒక వైసీపీ నేత ద్వారా నార్నె ఆ పార్టీ అధినేత‌ను క‌లిసి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నార‌ని తెలుస్తోంది. అప్ప‌ట్లో నార్నెకు ప్ర‌త్యేకంగా ఎలాంటి హామీ ఇవ్వ‌లేద‌ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఆయ‌న ఎమ్మెల్సీ కానీ, అమ‌రావ‌తిలో రియ‌లెస్టేట్ వ్యాపారానికి స‌హ‌క‌రించ‌డం కానీ చేయాల‌ని ఆశించార‌ట‌. అయితే ఇప్పుడు అమరావ‌తికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్రాధాన్య‌త త‌గ్గించింది. ఇక అక్క‌డ భారీగా రియ‌లెస్టేట్ వ్యాపారం ఉండ‌క‌పోవ‌చ్చు. మ‌రోవైపు మండ‌లి ర‌ద్దు అయ్యింది. ఇలాంటి నేఫ‌థ్యంలో నార్నె ఆశించిన‌వి రెండూ  చేజారిన‌ట్టే అని సోష‌ల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి.

ప్ర‌స్తుతానికి నార్నెకు అధికారికంగా ఏం ద‌క్కేది ఉండ‌ద‌ని స్ప‌ష్టం అవుతోంద‌ట‌, నార్నెను వైసీపీలో చేర్చిన నేత కూడా త‌ను ఇప్పుడు ఏం చేయాల‌నేని అంటున్న‌ట్టుగా భోగ‌ట్టా.
Tags:    

Similar News