అంతా సినిమాటిక్; నర్సింగ్ డోపీ కాదు

Update: 2016-08-02 05:02 GMT
సినిమాటిక్ సన్నివేశాలు నిజజీవితంలో అప్పుడప్పడు జరుగుతుంటాయి. తాజాగా అలాంటి సన్నివేశం చోటు చేసుకోవటమే కాదు.. సంచలనంగా మారాయి. ఒలంపిక్స్ కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పై డోపింగ్ ఆరోపణలు రావటం.. ఆయనపై వేటువేయటం లాంటివి తెలిసిందే. అయితే.. తనను కుట్రపూరితంగానే ఈ వ్యవహారంలో ఇరికించారంటూనర్సింగ్ ఆరోపించటం.. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు బయటకు రావటంతో భారత డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) డోప్ కేసు నుంచి నర్సింగ్ ను విముక్తి చేసింది. దీంతో.. అతడు 74 కేజీల విభాగంలో రియో ఒలంపిక్స్ కు వెళ్లటానికి మార్గం సుగమమైంది.

తాను నిషేధిత డ్రగ్స్ ఏమీ వాడలేదని.. తాను ఆటలో వక్రమార్గాన్ని ఎంచుకోలేదంటూ నర్సింగ్ చేసిన వాదనను వినిపించిన నర్సింగ్ యాదవ్ మాటల్లోని నిజాన్ని క్రమశిక్షణ కమిటీ గుర్తించటమే కాదు.. నర్సింగ్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. చట్టంలో ఉన్నఒక అవకాశాన్ని వినియోగించుకున్న నర్సింగ్ తాను ఏ తప్పు చేయలేదన్న విషయాన్ని నిరూపించుకోవటంలో సక్సెస్ అయ్యారు.

గతంలో నర్సింగ్ పై డోపింగ్ మచ్చ లేకపోవటం కలిసి వచ్చింది. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ‘కుట్ర’ కోణం తెర మీదకురావటంతో ఈ అంశంపై తిరిగి విచారణ మొదలు పెట్టారు. నర్సింగ్ తాగే పానీయాన్ని ఉద్దేశ పూర్వకంగా నిషేధిత డ్రగ్స్ ను వినియోగించటంతో అతడి శాంపిల్స్ తేడా వచ్చిన అంశాన్ని గుర్తించిన నాడా.. సుదీర్ఘ విచారణ తర్వాత అతనిపై వేసిన వేటును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. సినిమాటిక్ గా సాగిన ఈ ఉదంతానికి కొసమెరుపు ఏమిటంటే.. నర్సింగ్ కు ఆల్ ద బెస్ట్ చెబుతూ సుశీల్ కుమార్ ఓ ట్వీట్ చేశారు. సంతోషకరమైన వార్తను తాను విన్నట్లుగా పేర్కొన్న సుశీల్.. నర్సింగ్ కు తన పూర్తి మద్దతు ఉంటుందని.. భవిష్యత్ లోనూ కంటిన్యూ అవుతుందని.. రియోకి వెళ్లి పతకాన్ని గెలవాలని.. అది దేశం కోసమే కాదు తన కోసం కూడా అని ముక్తాయించారు. తనపై పడిన వేటును విజయవంతంగా తొలగించుకోవటంలో సక్సెస్ అయిన నర్సింగ్.. రియోకి వెళ్లేందుకు అడ్డుగా ఉన్న సాంకేతికాంశాల్ని సైతం అధిగమిస్తారని ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్ నర్సింగ్.
Tags:    

Similar News