వచ్చే ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన చేసిన చంద్రబాబు

Update: 2022-03-30 04:11 GMT
ఒకే వ్యక్తి నోటి నుంచి ఒకే అంశానికి సంబంధించి విరుద్ధమైన మాటలు మాట్లాడటం కొందరిలో చూస్తుంటాం. అదే తీరులో అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. పవర్ పోయిన తర్వాత మరోలా వ్యవహరించే తీరు తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబులో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. పవర్ లో ఉన్నప్పుడు అధికారులు.. వారితో నిర్వహించే రివ్యూలతో కాలాన్ని గడిపేసే చంద్రబాబు.. పార్టీ చేతి నుంచి పవర్ చేజారిన వేళలో మాత్రం.. కార్యకర్తలు గుర్తుకు వస్తుంటారు. తొమ్మిదిన్నరేళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వేళలో చంద్రబాబు పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు.. ద్వితీయ శ్రేణి నాయకులకు ఏమేం చేశారో అందరికి తెలిసిందే.

అన్నింటికి మించి.. విపక్షంలో ఉన్న వేళలో.. చంద్రబాబు నోటి నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయన్న విషయం అందరికి తెలిసిందే. అందుకు తగ్గట్లే తాజాగా ఆయన నోటి నుంచి కీలక వ్యాఖ్య ఒకటి బయటకు వచ్చింది. 2014కు ముందు విపక్షంలో ఉన్న వేళలో.. బీసీలకు యాభై శాతం టికెట్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు.. ఎన్నికల వేళ ఎలాంటి ఫార్ములాను పాటించారో అందరికి తెలిసిందే.

ఎన్నికలకు ముందు బాబు మాటలు ఒకలా.. తీరా ఎన్నికలు ముంచుకు వచ్చిన వేళలో చంద్రబాబు చేతలు మరోలా ఉండటం అందరికి తెలిసిందే. నిజానికి బాబులో మారాల్సిన విషయాలకు వస్తే.. అనవసరమైన హామీల్ని ఇచ్చే కంటే.. చేసే వాటి గురించి మాట్లాడితేనే బాగుంటుందని చెప్పాలి. పార్టీ 40వ ఆవిర్బావ దినోత్సవ వేడుకుల వేళ.. చంద్రబాబు మాట్లాడుతూ.. కీలక ప్రకటన చేశారు. సుత్తి కొట్టకుండా సూటిగా విషయాన్ని చెప్పేసిన చంద్రబాబు.. ఈసారి ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు కేటాయిస్తామని తేల్చేశారు.

నిజానికి చంద్రబాబు నోటి నుంచి తాజాగా వచ్చిన మాటను యథాతధంగా అమలు చేస్తే మాత్రం.. అదో పెను సంచలనంగా మాటమే కాదు.. రాష్ట్ర రాజకీయాల్ని అమితంగా ప్రభావితం చేస్తుందని చెప్పక తప్పదు. యువత ముందుకువచ్చి న్యాయం కోసం పోరాడాలన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో తాము 40 శాతం సీట్లు ఇస్తామని ప్రకటించారు.

రాజకీయాల్లో గాడ్ ఫాదర్ లేడని భయమొద్దని.. సమాజ హితం.. రాజకీయాల్లో మార్పు తేవాలనుకునే వారు రాజకీయాల్లోకి రావాలన్నారు. టీడీపీ ఘన చరిత్ర గురించి.. గడిచిన 40 ఏళ్ల ప్రయాణం గురించి చెప్పిన చంద్రబాబు.. తాను చెప్పినట్లే ఎన్నికల సమయానికి 40 శాతం సీట్లను యువతకు కేటాయిస్తారా? అన్నది అసలు ప్రశ్న. దానికి కాలమే సరైన సమాదానం చెప్పగలదు.
Tags:    

Similar News