పార్టీ వీడే ముందు ఇలాంటి పనులేంటి రేవంత్?

Update: 2017-10-24 09:47 GMT
తెలుగుదేశం పార్టీ  తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి సొంత పార్టీ నేత‌ల‌పైనే చేసిన విమ‌ర్శ‌ల క‌ల‌క‌లం ఇంకా స‌ద్దుమ‌ణ‌గ‌డం లేదు. తెలంగాణ ముఖ్య‌మంత్రితో ఏపీకి చెందిన మంత్రుల కుటుంబ స‌భ్యులకు సంబంధాలు ఉన్నాయంటూ రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఎమ్మెల్సీ ప‌య్యావుల మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. దీనికి కొన‌సాగింపుగా తాజాగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి - హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సైతం రేవంత్ తీరును త‌ప్పుప‌ట్టారు.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామివారిని దర్శించుకున్న చినరాజప్ప అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ  పయ్యావుల కేశవ్ - పరిటాల సునీత కుటుంబ సభ్యుల వ్యక్తిగత వ్యవహారాలపై రేవంత్ వ్యాఖ్యానించడం సరికాదని మంత్రి చినరాజప్ప అన్నారు. పార్టీని వీడేవారే బురదజల్లుతారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అండతో రేవంత్‌ రెడ్డి ఉన్నత స్థాయికి ఎదిగారన్న సంగతి మరిచిపోయారన్నారు. పార్టీలో ఇబ్బందులు ఉండవచ్చునని, ఇష్టం లేకపోతే వెళ్తానని చెప్పాలి కానీ మంత్రులకు కెసిఆర్‌ తో సంబంధాలు ఉన్నాయని అనడం సమంజసం కాదన్నారు. తమ పార్టీ అధినేత - ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే పార్టీలోని నాయకులు - కార్యకర్తలు - మంత్రులు పనిచేస్తారన్నారు. ఎమ్మెల్యే చింత‌మనేని ప్ర‌భాక‌ర్ వివాదంపై ముఖ్య‌మంత్రి స్పందిస్తార‌ని అన్నారు.

ఈ సంద‌ర్భంగా ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌పై హోంమంత్రి మండిప‌డ్డారు. వైఎస్ జగన్ కులాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ఈ విధానం మార్చుకోవాల‌న్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులను బీసీల్లో చేరుస్తామని పున‌రుద్ఘాటించారు. ఈ డిసెంబరులోగా మంజునాథ కమిషన్ నివేదిక వస్తుందని చెప్పారు. వివాదాల్లో చిక్కుకుంటున్న పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హెచ్చరించారు.
Tags:    

Similar News