సుష్మా మాట‌!... పాక్‌ తో క్రికెట్ లేదంతే!

Update: 2018-01-01 11:02 GMT
క్రికెట్ మేనియా ఇప్పుడు క్రీడా లోకాన్ని ఊపేస్తోంద‌నే చెప్పాలి. గ‌తంలో వేళ్ల మీద లెక్క‌పెట్టే స్థాయిలో చాలా త‌క్కువ దేశాలే ఈ క్రీడ‌ను ఆడుతుండ‌గా... ఇప్పుడు అమెరికా స‌హా ప‌లు దేశాలు కూడా ఈ క్రీడలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఎన్ని దేశాలు క్రికెట్ ఆడినా... ఏ దేశం జ‌ట్టు ఇంకే దేశం జ‌ట్టుతో క్రికెట్ ఆడినా... అంత పెద్ద ఆస‌క్తి ఏమీ ఉండ‌దు గానీ... చిర‌కాల ప్ర‌త్య‌ర్థులుగా కొన‌సాగుతున్న భార‌త్‌ - పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ అంటే... విశ్వ‌వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు టీవీల‌కు అతుక్కుపోతారు. ఏమాత్రం వీలున్నా ఆ రెండు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌ ను ప్ర‌త్య‌క్షంగా చూసేందుకు ఉత్సాహం చూప‌ని క్రీడాభిమాని ఉండ‌డంటే అతిశ‌యోక్తి కాదేమో. దాయాదీ పోరుగా ప్ర‌సిద్ధికెక్కిన ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ అంటే ఇరు దేశాల ప్ర‌జ‌ల‌తో పాటు విశ్వ‌వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ల‌వ‌ర్స్ రోమాలు నిక్క‌బొడుచుకుంటాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అయితే ఇరు దేశాల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌తల కార‌ణంగా చాలా కాలంగా ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య క్రికెట్ మ్యాచ్‌ లు లేవు. వ‌ర‌ల్డ్ క‌ప్‌ - చాంపియ‌న్స్ ట్రోపీ - ఆసియా క‌ప్ వంటి సిరీస్‌ ల‌లో ఏదో అనుకోని ప‌రిస్థితుల్లో ఇరు జ‌ట్లు సెమీస్‌ కో - ఫైనల్‌ కో వ‌స్తే త‌ప్పించి ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్‌ లు ఉండ‌టం లేదు. ఇందుకు పాకిస్థాన్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరే కార‌ణ‌మ‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. ఉగ్ర‌వాదుల‌కు కేంద్రంగా మారిన పాక్‌... ఉద్దేశ‌పూర్వ‌కంగానే భార‌త్‌లో అల్ల‌క‌ల్లోలం సృష్టించేందుకు చేయ‌ని య‌త్నం లేదంటూ మ‌న ర‌క్ష‌ణ శాఖ చెబుతోంది. ఆ వాద‌న నిజ‌మేన‌న్న‌ట్లుగా పాకిస్థాన్ రేంజర్లు నిత్యం ఇరు దేశాల స‌రిహ‌ద్దును దాటేసి మ‌న సైనిక పోస్టుల‌పై కాల్పుల‌కు తెగ‌బ‌డుతున్న వైనం మ‌న‌కు తెలియ‌నిదేమీ కాదు. మొన్న‌టి ప‌ఠాన్‌ కోట్ ఎయిర్ బేస్‌ పై ఉగ్ర‌వాదుల దాడికి ముందు ఇరు దేశాల మ‌ధ్య నిలిచిపోయిన ద్వైపాక్షిక సిరీస్‌ లకు రంగం సిద్ధ‌మైపోతున్న త‌రుణంలో ఆ దాడి జ‌ర‌గ‌డంతో అస‌లు ఇరు దేశాల మ‌ధ్య క్రికెట్ ఇక క‌లేన‌ని భార‌త్ తేల్చి చెప్పింది.

అయితే ద్వైపాక్షిక సిరీస్‌ లు జ‌ర‌గ‌కున్నా... వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర‌హా సిరీస్‌ ల‌లో ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్‌ లు జ‌రిగే అవ‌కాశాలు వ‌స్తే... వాటిని అడ్డుకునే ప‌రిస్థితి ఉండేది కాదు. కానీ కుల్‌ భూష‌ణ్ జాద‌వ్ విష‌యంలో పాక్ వ్య‌వ‌హ‌రించిన తీరుతో విదేశాంగ శాఖ చాలా క‌ఠిన వైఖ‌రిని తీసుకుంది. ఇక‌పై ఇరు దేశాల క్రికెట్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్‌ లు జ‌ర‌గ‌బోవ‌ని భార‌త విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వ‌రాజ్ తేల్చి చెప్పారు. పాక్ క్రికెట్ జ‌ట్టుతో టీమిండియా మ్యాచ్ ఆడే ప్ర‌సక్తే లేద‌ని కూడా సుష్మా చాలా క్లిష్ట‌ర్ క్లియ‌ర్‌ గా చెప్పేశారు. త‌ట‌స్థ వేదిక మీద కూడా ఇక‌పై ఇరు జ‌ట్ల మ‌ద్య మ్యాచ్‌ లు జ‌ర‌గ‌వ‌ని కూడా ఆమె పేర్కొన్నారు. వెర‌సి దాయాదీ పోరు ఇక గ‌త చ‌రిత్ర‌గానే మారిపోవ‌డం ఖాయ‌మేన‌న్న మాట‌.

Tags:    

Similar News