ఈబేలో సేల్ కోసం దాయాది ప్రధాని

Update: 2016-04-15 04:35 GMT
ఊహించని పరాభవం పాక్ ప్రధాని నవాజ్ కు ఎదురైంది. ఆయన్ను వ్యతిరేకించే వారు చేసిన పనికి ఆయనిప్పుడు మరోలా ఫేమస్ అయ్యారు. ఈ-కామర్స్ సైట్ అయిన ‘ఈబే’లో పాక్ ప్రధానిని అమ్మకానికి పెట్టేశారు. ‘‘కొత్త బ్రాండ్.. ఇంతవరకూ వాడని సరికొత్త వస్తువు’’గా పేర్కొంటూ ఆయన్ను సేల్ కింద పెట్టేశారు. ఈ సందర్భంగా ఆయనకు ధర కూడా డిసైడ్ చేశారు. మన రూపాయిల్లో అయితే షరీఫ్ ధర సుమారు రూ.62లుగా నిర్ణయించారు.

ఈబే బ్రిటన్ పేజీలో కనిపించిన ఈ యాడ్ కు స్పందన కూడా రావటం గమనార్హం. పోస్ట్ పెట్టిన కాసేపటికే షరీఫ్ ను కొనుగోలు చేసేందుకు వంద బిడ్లు  వచ్చాయి. పాక్ ప్రధానిని సేల్ కింద పెట్టటమే కాదు.. వస్తువుకు సంబంధించిన వివరాల్ని వెల్లడించిన చోట.. షరీఫ్ మీద ఉన్న ఆగ్రహం మొత్తాన్ని ప్రదర్శించటం గమనార్హం.

సదరు వస్తువుకు పుట్టుకలోనే జన్యుపరమైన లోపం ఉందని.. వ్యాపారాలు.. ఆస్తులన్నీ లండన్ లో ఉన్నా.. ఆయన మాత్రం పాక్ ప్రధానిగా ఉండేందుకు ఇష్టపడతారని పేర్కొన్నారు. పాక్ ప్రధాని అయినప్పటికీ ఇంగ్లండ్.. అమెరికా.. టర్కీ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తారని.. ఆయన్ను ఇప్పటివరకూ ఎవరూ వాడలేదంటూ ఎక్కెసంగా పోస్ట్ చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో హడావుడి చేయటంతో.. ఈబే ఈ ‘సేల్’ పేజీని తొలగించింది. అప్పటికే నవాజ్ షరీఫ్ కు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.
Tags:    

Similar News