మోదీతో ఓపీఎస్ ఏం మాట్లాడారంటే!

Update: 2017-08-14 10:58 GMT
త‌మిళ‌నాడులోని అధికార పార్టీ అన్నాడీఎంకేలో చోటుచేసుకున్న గ్రూపు త‌గాదాలు దాదాపుగా స‌మ‌సిపోయిన‌ట్లుగానే క‌నిపిస్తోంది. ఎందుకంటే... మొన్న వెంక‌య్య‌నాయుడు భార‌త ఉప‌రాష్ట్రప‌తిగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేసిన సంద‌ర్భంగా ఢిల్లీ వెళ్లిన  త‌మిళ‌నాడు సీఎం ఎడ‌ప్ప‌డి ప‌ళ‌నిసామి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఆ త‌ర్వాత త‌న పార్టీ ఎంపీల‌ను తీసుకుని ఆయ‌న వెంక‌య్య‌నాయుడును కూడా క‌లిశారు. ఆ సంద‌ర్భంగా ఈపీఎస్ చెప్పిన‌ట్లుగా పార్టీలోని వ‌ర్గాల విలీనానికి సంబంధించి రోడ్ మ్యాప్‌ను రూపొందించే క్ర‌మంలో... ముందుగా మాజీ సీఎం ఓ ప‌న్నీర్ సెల్వంకు ఇచ్చిన అపాయింట్ మెంట్‌ను మోదీ ర‌ద్దు చేసుకున్నారు.

అయితే నిన్న అనూహ్యంగా ఢిల్లీకి రావాలంటూ చెన్నైలో ఉన్న ఓపీఎస్‌కు వ‌ర్త‌మానం అందింది. ఈ పిలుపు కోస‌మే క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురుచూస్తూ ఉన్న ఓపీఎస్ నిన్న రాత్రే ఢిల్లీ బ‌య‌లుదేరి వెళ్లిపోయారు. నేటి మ‌ధ్యాహ్నం మోదీతో ఆయ‌న భేటీ అయ్యారు. త‌న వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రు ఎంపీల‌ను వెంట‌బెట్టుకుని మోదీ వ‌ద్దకు వెళ్లిన ఓపీఎస్‌... దాదాపు అర‌గంట‌కు పైగానే ప్ర‌ధానితో చ‌ర్చ‌లు జ‌రిపారు. చ‌ర్చ‌లు ముగిసిన త‌ర్వాత న‌వ్వు ముఖంతో బ‌య‌ట‌కు వ‌చ్చిన ఓపీఎస్ కారెక్కి వెళ్లిపోగా... ఆయ‌న వెంట ప్ర‌ధానితో చ‌ర్చ‌ల కోసం వెళ్లిన పార్టీ ఎంపీ మైత్రేయ‌న్ భేటీ వివ‌రాల‌ను మీడియాకు తెలిపారు.

మైత్రేయ‌న్ తెలిపిన వివ‌రాల మేర‌కు... అన్నాడీఎంకేలోని ఓపీఎస్‌, ఈపీఎస్ వ‌ర్గాల విలీనంపైనే ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగింద‌ట‌. ప‌లు అంశాల‌కు సంబంధించి ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఉన్న విభేదాల‌ను ప‌రిష్క‌రించే విష‌యంలో మోదీ ప‌లు స‌ల‌హాలు సూచ‌న‌లు చేశార‌ట‌. వాట‌న్నింటికీ త‌లాడించిన ఓపీఎస్‌... ఈపీఎస్‌తో క‌లిసి ముందుకు సాగేందుకు త‌న‌కు ఎలాంటి ఇబ్బంది లేద‌ని చెప్పార‌ట‌. అదే స‌మ‌యంలో తాను ఈపీఎస్‌తో జ‌ట్టు క‌ట్టి ముందుకు సాగితే... త‌న‌కు ద‌క్కాల్సిన ప‌ద‌వులు, ప్రాధాన్యంపైనా ఓపీఎస్ మోదీని అడిగార‌ట‌. ఈ విష‌యంలో ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని, గ‌తంలోనే ఈపీఎస్ ఇచ్చిన హామీ మేర‌కు ప‌ద‌వులు, పార్టీలో ప్రాధాన్యం ద‌క్కి తీరుతుంద‌ని, ముందుగా అభిప్రాయ భేదాలు ప‌క్క‌న‌బెట్టి క‌లిసి ముందుకు సాగాల‌ని మోదీ దిశానిర్దేశం చేసిన‌ట్లు స‌మాచారం.

మోదీ హామీతో సంతృప్తి వ్య‌క్తం చేసిన ఓపీఎస్‌... స‌మ‌స్య స‌ద్దుమ‌ణిగిన‌ట్లేన‌న్న ధీమాతో బ‌య‌ట‌కు వ‌చ్చేశార‌ట‌. ఈ భావ‌న‌తోనే ఆయ‌న ముఖం వెలిగిపోయింద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఈ వార్త‌ల‌న్నీ నిజ‌మే అయితే... రేపో, మాపో ఈపీఎస్ కేబినెట్ లో ఓపీఎస్ డిప్యూటీ సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో పాటుగా అన్నాడీఎంకేలోని అత్యంత ప్ర‌ధాన‌మైన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పోస్టులోనూ కూర్చుంటార‌న్న మాట‌.
Tags:    

Similar News