బొత్స కుమారుడి ఎంగేజ్మెంట్ లో కులాలు, పార్టీలుగా విడిపోయారా... ?

Update: 2021-12-13 13:06 GMT
కాదేదీ కవితకు అనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అయితే వర్తమాన సమాజంలో జరుగుతున్న చాలా వాటిని చూసాక దాన్నే మార్చుకుని ఎన్నో చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎక్కడకు వెళ్ళినా కుల రాజకీయ సమూహాలు కాని సంబరమేముంది అని కూడా అనాల్సి ఉంటుంది. ఆఖరుకు అతి పవిత్రమైన కార్తీక సమారాధనలు కూడా కుల సమావేశాలుగా మారిపోతున్న రోజులివి. చివరికి వివాహ వేడుకలు, నిశ్చితార్ధాలు ఇతర విశేష కార్యక్రమాలు కూడా రాజకీయ సందడికి లోటు లేకుండా సాగిపోతున్నాయి.

ఇదంతా ఎందుకంటే ఈ మధ్యనే వైసీపీలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయ‌ణ ఇంట్లో వివాహ నిశ్చితార్ధ కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ లో ఒక హొటల్ లో బొత్స ఏకైక కుమారుడు డాక్టర్ సందీప్ కి జరిగిన ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో వివిధ వర్గాలకు చెందిన అతిధులు వెల్లువలా తరలివచ్చారు. అలా వచ్చిన వారు అంతా ఎంతో గొప్పవారు, సినీ, రాజకీయాల్లో దిగ్గజాలు, సీనియర్ మోస్ట్ నేతలు.

దాంతో వారంతా అక్కడ చేరి పెట్టిన ముచ్చట్లు చేసిన హడావుడి తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బొత్స కుమారుడి ఎంగేజ్మెంట్ కి కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ నేత అయిన కేవీపీ రామచంద్రరావుతో పాటు మెగాస్టార్ చిరంజీవి వంటి వారు హాజరయ్యారు. ఇక ఒక వైపు చూస్తే కేవీపీ చుట్టూ రాజకీయ సందడి వాతావరణం కనిపించింది.

అంతే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు అంతా కేవీపీ దగ్గర చేరి మీటింగులే పెట్టేశారు. అదే విధంగా చిరంజీవి చుట్టూ ఒక బలమైన కులానికి చెందిన నాయకులు చేరి హడావుడి చేశారు. వీరంతా కూడా పోటీలు పడి మరీ సెల్ఫీలు తీసుకుంటూ సంతోషంలో మునిగి తేలారు.

నిజానికి అది వివాహానికి సంబంధించిన నిశ్చితార్ధ కార్యక్రమం. దానికి వెళ్ళిన వారు ఇలా కుల వేదికలుగా చేసుకోవడం, రాజకీయ కోలహలం కనిపించడం మాత్రం ఆసక్తికరంగానే ఉంది. సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన ఫోటోలు ఒక్క లెక్కన వైరల్ కావడంతో నెటిజన్లు వీటి మీద సీరియస్ గానే చర్చించుకుంటున్నారు.

ఏపీలో రాజకీయ పరిణామాలను కూడా కలుపుకుని ఈ చర్చలు సాగుతూండడం విశేషం. వైసీపీకి చెందిన మెజారిటీ మంత్రులు అంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. దాంతో పాటు పాత కాంగ్రెస్ నాయకులు, తెలంగాణాకు చెందిన కాంగ్రెస్ వారు కూడా అక్కడికి రావడంతో దేని గురించి వీరంతా చర్చలు జరిపి ఉంటారు అన్న ఆలోచనలతో పాటు విశ్లేషణలు కూడా అనేకం వస్తున్నాయి.

గతంలో ఇలాంటివి పెద్దగా ఎవరూ ఎరగరు అన్నది నిజం. పెళ్ళి అయినా మరే వేడుక అయినా అక్కడకి వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోవడమే తప్ప ఇలాంటి ముచ్చట్లు పెద్దగా జరిగిన దాఖలాలు లేవు. కానీ బొత్స వంటి పొలిటికల్ బిగ్ షాట్ ఇంట్లో వేడుకకు మాత్రం ఇలా నేతలు అతి ఉత్సాహాం చేయడం, రాజకీయ జోరు ఎక్కువగా కనిపించడంతో దీని మీద నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. మరి ఇది సాధారణంగా తీసుకోవాలా లేక దీని వెనక విశేషాలూ వింతలూ ఏమైనా ఉన్నాయా అన్నది రాబోయే కాలమే చెప్పాలేమో.
Tags:    

Similar News