విశాఖ మీద పవన్ ఫోకస్...ఈసారి కెవ్వుకేకే మరి

Update: 2022-10-10 17:30 GMT
విశాఖ ఉమ్మడి జిల్లాలో మూడవ పార్టీకి ఎంతవరకు అవకాశాలు ఉంటాయన్నది ఆలోచిస్తే ప్రజారాజ్యం ఎపిసోడ్ ని గుర్తు చేసుకోవాలి. అప్పట్లో విశాఖలో ఏకంగా నాలుగు సీట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరచింది. అయితే అదే ఊపుని జనసేన 2019 ఎన్నికల్లో కంటిన్యూ చేయలేకపోయింది. కానీ 2024లో మాత్రం అలా ఉండదని బలంగా నమ్ముతోంది.

విశాఖలో జనసేనకు గట్టి పట్టు ఉన్న సీట్లు కొన్ని ఉన్నాయి. అవి భీమిలి, విశాఖ నార్త్, పెందుర్తి, గాజువాక, అనకాపల్లి. యలమంచిలి, చోడవరం గా ఆ పార్టీ గుర్తించింది. ఇక కష్టపడితే విశాఖ తూర్పు పాయకరావుపేటలలో కూడా జెండా ఎత్తగలమని నమ్ముతోంది.

అయితే పొత్తులు కనుక ఉంటే జనసేనకు ఈ సీట్లు ఇస్తారా అన్నదే చర్చగా ఉంది. వచ్చే ఎన్నికల్లో పోత్తులు లేకుండానే పోటీ చేస్తామని స్థానిక జనసేన నాయకులు చెబుతున్నప్పటికీ చివరి నిముషంలో అయినా పొత్తులు ఖాయమనే అంటున్నారు. ఆ విధంగా ఆలోచిస్తే పది సీట్లలో పట్టున్న జనసేన కచ్చితంగా అరడజన్ కి తక్కువ లేకుండా సీట్లను తీసుకుంటుంది అని అంటున్నారు. ఈ విషయంలో ఎలాంటి మొహమాటం పడదని చెబుతున్నారు.

అంతే కాదు విశాఖ ఎంపీ సీటు మీద కూడా జనసేన కన్ను ఉంది అని అంటున్నారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన జనసేన 2 లక్షల ఎనభై వేల దాకా ఓట్లను కొల్లగొట్టింది. దాంతో ఈ సీటుని పొత్తులు ఉంటే కచ్చితంగా అడిగి తీరుతుంది అని అంటున్నారు. జనసేనలో ఉన్న మేధావి వర్గానికి చెందిన మాజీ ప్రభుత్వ అధికారి ఒకరి ఈ సీటు మీద కన్నేశారని చెబుతున్నారు.

ఇక విశాఖకు త్వరలోనే  పవన్ కళ్యాణ్ వస్తున్నారు. ఆయన జనవాణి కార్యక్రమాన్ని ఈసారి విశాఖలో నిర్వహిస్తున్నారు అని అంటున్నారు. దాని కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖ సిటీలోని ఒక కీలకమైన నియోజకవర్గంలోనే పవన్ జనసేన  జరుగుతుంది అని చెబుతున్నారు. విశాఖ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టిన పవన్ జనవాణి సందర్భంగా విశాఖ గురించి తన మనసులోని మాటలను అదే వేదిక మీద చెబుతారు అని అంటున్నారు.

ఇక ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా ఇపుడు ప్రచారంలో ఉంది. పవన్ విశాఖ నుంచి పోటీకి దిగుతారు అని. ఎటూ గోదావరి జిల్లాలలో జనసేనకు బాగా బలం ఉందని, పవన్ కనుక విశాఖ నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం శ్రీకాకుళం జిల్లా దాకా పడి ఉత్తరాంధ్రాలో కొన్ని సీట్లు ఎక్కువగా గెలుచుకునే చాన్స్ ఉందని జనసేన నేతలు భావిస్తున్నారు. మొత్తానికి పవన్ విశాఖ మీద ఫోకస్ పెట్టి తన రాజకీయాన్ని రక్తి కట్టించనున్నారని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News