సారుతో యూరేనియం పోరుకు పవన్ రెఢీనా?

Update: 2019-09-12 08:15 GMT
నల్లమలలో యురేనియం వెలికితీత కోసం ప్రయత్నాలు ముమ్మరం కావటంపై తెలంగాణ సమాజం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. యురేనియం వెలికితీతకు సంబంధించిన టెస్టులు నిర్వహించే అధికారుల్ని వెనక్కి పంపారు అక్కడి స్థానికులు. ఇదిలా ఉంటే.. ఈ అంశంపై గళం విప్పాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సీనియర్ తెలంగాణ కాంగ్రెస్ నేత వీహెచ్ హనుమంతరావు కోరటం.. అందుకు తగ్గట్లే పవన్ గళం విప్పటం తెలిసిందే.

బంగారు తెలంగాణ స్థానే భావితరాలకు కాలుష్యకారక తెలంగాణ ఇద్దామా? అంటూ ప్రశ్నిస్తున్న ఆయన.. ఈ అంశంపై త్వరలో తాను రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భావి తరాలకు బంగారు తెలంగాణ ఇస్తామా? యురేనియం కాలుష్యాన్ని తెలంగాణకు ఇస్తామా? అన్నది చూడాలని కోరుతున్నారు పవన్. అంతేకాదు.. ఈ అంశం మీద అన్ని ప్రజాసంఘాలు.. రాజకీయ పక్షాలు ఆలోచన చేయాలని కోరుతున్నారు. దీనికి సంబందించి ఇప్పటికే ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు పవన్.

1852లో అమెరికాలోని అప్పటి ప్రభుత్వం నివాస ప్రాంతాల కోసం అడవుల్ని కొనేందుకు ప్రయత్నించినప్పుడు సియాటిల్ ప్రాంత ముఖ్య అధికారికి రాసిన లేఖను ఆయన ఉటంకించారు. మనిషి కోసం భూమి కాదు.. భూమి మీద మనిషి పుట్టాడంటూ ప్రారంభమయ్యే ఆ లేఖను ఆయన పోస్ట్ చేశారు. 

సేవ్ నల్లమల పేరుతో మొదలైన పవన్ క్యాంపైన్ ఎక్కడి వరకూ వెళుతుంది? తెలంగాణలో ఆయన ఏ మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీన్ని తీసుకెళతారు? అన్నది ఇప్పుడు ఆసక్తకిరంగా మారింది. సేవ్ నల్లమలకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన పవన్.. నాగర్ కర్నూలు పరిధిలోని నల్లమలలో యురేనియం తవ్వకాలు జరగకుండా చూసేందుకు పోరాటం చేస్తామన్న మాటను చెబుతున్నారు.

భావితరాలకు బంగారు తెలంగాణ ఇస్తామా? యురేనియం కాలుష్య తెలంగాణ ఇస్తామా? అని సూటిగా ప్రశ్నిస్తున్న ఆయన.. ఈ ఉద్యమాన్ని ఎక్కడివరకూ తీసుకెళ్లనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. సామాజిక అంశాల మీద పోరాటం చేసే విషయంలో పట్టుదలగా ఉండే పవన్.. తాజా అంశంలో తెలంగాణ ప్రభుత్వం మీద కూడా పోరాటం చేస్తారా? అన్నది మరోప్రశ్న.

సేవ్ నల్లమల క్యాంపైన్ లో తెలంగాణ ప్రభుత్వంపై ఆయన ఎంతవరకు ఒత్తిడి పెట్టగలుగుతారన్నది మరో ప్రశ్న. నల్లమలలో యురేనియం ప్రాజెక్టును నిలిపివేయటంలో పవన్ కానీ సక్సెస్ అయిన పక్షంలో 48 గ్రామాలు.. 70వేల మంది ప్రజల్ని రక్షించిన వారు అవుతారు. అంతేకాదు.. యురేనియం తవ్వకాల్ని వెలికితీత కారణంగా కోట్లాదిమంది కాలుష్యం బారినపడే ప్రమాదం ఉంది. దీన్ని అడ్డుకోగలిగితే.. భారీ మైలేజీ మూటగట్టుకోవటం ఖాయమని చెప్పకతప్పదు.



Tags:    

Similar News