షూటింగ్ కి నో చెప్పి మరీ.. పవన్ ‘అధ్యయనం’

Update: 2016-10-17 04:31 GMT
విషయం ఏదైనా కానీ ఒకసారి తన దృష్టికి వచ్చాక.. ఆ అంశం మీద తనకున్న నెట్ వర్క్ ద్వారా వివిధ కోణాల్లో సమాచారం తెప్పించుకుంటారన్న మాట పవర్ స్టార్ కమ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో వినిపిస్తుంటుంది. ఇందుకు తగ్గట్లే తాజాగా ఆయన దృష్టికి వచ్చిన పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న మెగా అక్వాఫుడ్ పార్క్ విషయంలోనూ ఇలాంటిదే చోటు చేసుకుందన్న విషయం బయటకు వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశం మీద గళం విప్పిన పవన్ కల్యాణ్.. తిరుపతి..కాకినాడ సభల తర్వాత కామ్ అయిపోవటం.. వరుస సినిమాల్ని ఒప్పుకోవటం.. షూటింగ్ లో బిజీబిజీగా ఉండటం తెలిసిందే.

అలాంటి పవన్ ఉన్నట్లుండి శనివారం సాయంత్రం ఒక్కసారి మీడియా ముందుకు రావటం.. మెగా అక్వా ఫుడ్ పార్క్ పై ఆందోళన చేస్తున్న వారికి మద్దతు పలికి.. ఈ అంశాన్ని ఏపీ సర్కారు దృష్టికి తీసుకురావటం.. ఏం చేయాలన్న విషయాన్ని చెప్పకనే చెప్పేయటం తెలిసిందే. పైకి చూస్తే.. అక్వా ఫుడ్ పార్క్ విషయంలో పవన్ రియాక్ట్ అయినట్లు మాత్రమే కనిపించినా.. దాని బ్యాక్ గ్రౌండ్ లో చాలానే కసరత్తు జరిగిందని చెబుతున్నారు. గడిచిన ఏడాదిగా ఈ అంశంపై ఆందోళన జరుగుతున్నా.. ఇటీవల సీపీఎం నేత మధును అరెస్ట్ చేయటం ద్వారా పవన్ కన్ను.. అక్వాఫుడ్ పార్క్ అంశంపై పడిందని చెబుతున్నారు. అక్కడేం జరుగుతుందన్న విషయంపై ఆరా తీయటం.. అక్వా పుడ్ పార్క్ కు సంబంధించిన తెర మీద కనిపించే అంశాలతో పాటు.. తెర వెనుక జరిగిన విషయాలపై పక్కా ఫీడ్ బ్యాక్ తీసుకోవటం.. దాన్నిక్రాస్ చెక్ చేసుకున్నాక.. అక్వాఫుడ్ పార్క్ బాధితులకు అండగా నిలవాలని పవన్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ అంశంపై అధ్యయనం మొదలెట్టిన పవన్.. దీనికి సంబంధించిన సమాచారం తెప్పించుకోవటం.. వాటిని కుణ్ణంగా చదివి.. తనకున్న సందేహాల్ని తీర్చుకునేందుకు వివిధ వర్గాలకు చెందిన వారి అభిప్రాయాల్ని సేకరించటం కోసం దాదాపు మూడు నాలుగు రోజుల పాటు షూటింగ్ కు ప్యాకప్ చెప్పేసినట్లు తెలుస్తోంది. కొత్త అంశంపై అవగాహన తెచ్చుకోవటం.. భిన్న వర్గాలకు సంబంధించిన వాదనల్ని వినటం.. అందులో నిజానిజాల గురించి పక్కా అవగాహన కోసం షూటింగ్ కు సైతం నో చెప్పేసినట్లుగా చెబుతున్నారు. విషయం ఏదైనా.. ఒక్కసారి ఎంట్రీ ఇస్తే అందుకు సంబంధించిన పూర్తి వివరాలపై పట్టు ఉండాలని తపించే పవన్.. మెగా అక్వాఫుడ్ పార్క్ ఇష్యూపై పెద్ద ఎత్తున సమాచారాన్ని సేకరించినట్లుగా ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మాట్లాడటం అంటే మాట్లాడటం కాకుండా.. తాను మాట్లాడే అంశంపై పూర్తిస్థాయి అవగాహన తెచ్చుకున్నాక మాట్లాడటం.. అందుకోసం శరవేగంగా సాగుతున్న షూటింగ్ పనుల్ని పక్కన పడేయటం చూసినప్పుడు అక్వా ఫుడ్ పార్క్ ఇష్యూ మీద పవన్ కమిట్ మెంట్ తెలుస్తున్నట్లుగా చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News