ప‌వ‌న్ సార్ మ‌ళ్లీ వాయిదా వేశాడుగా!

Update: 2018-08-22 08:01 GMT
ఏదైనా ప‌ని మొద‌లు పెడితే దాని సంగ‌తి చూసే వ‌ర‌కూ నిద్ర పోకూడ‌దు. ఎప్పుడూ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంగ‌తే చూద్దాం. ఆయ‌న ఏదైనా ప‌ని అనుకుంటే.. అది పూర్తి అయ్యే వ‌ర‌కూ దాని మీద‌నే నిలుచుంటారు. ఆ ప‌ని ఒక కొలిక్కి వ‌చ్చే వ‌ర‌కూ వ‌దిలిపెట్టరు. పెట్టుబ‌డి సాయం ప‌థ‌కాన్ని డిజైన్ చేసి.. దాన్ని నెల‌ల వ్య‌వ‌ధిలో అమ‌లు చేయ‌టం అంటే మాట‌లా? 

అది కేసీఆర్ కు మాత్ర‌మే సాధ్యం. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌ర‌న్న విమ‌ర్శ కంటే కూడా.. ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని గెలుచుకునే ప‌థ‌కాల‌ను ప్లాన్ చేసి.. వాటితో ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యే స‌త్తా కేసీఆర్ లో కొండంత ఉంది. నిజానికి అదే ఆయ‌నకు బ‌లం కూడా.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కానీ.. విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇద్ద‌రూ ఏదైనా విష‌యం అనుకుంటే దాని మీద‌నే కూర్చుంటారు. అందుకోసం ఎంత శారీర‌క క‌ష్టానికైనా వెనుకాడ‌రు. ఏపీ హోదా కోసం వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన నిర‌స‌న దీక్ష‌లు గుర్తుకు తెచ్చుకుంటే.. రోజుల త‌ర‌బ‌డి ఆయ‌న చేసే క‌ఠిన‌మైన దీక్ష‌లకు వైద్యులు సైతం ఆశ్చ‌ర్యానికి గురి కావ‌ట‌మే కాదు.. ఇలా చేసుకుంటే పోతే.. హెల్త్ ఇష్యూస్ వ‌స్తాయంటూ సున్నిత‌మైన హెచ్చ‌రిక‌ను చేయ‌టం మ‌ర్చిపోకూడ‌దు.

కానీ.. ఇందుకు భిన్న‌మైన వైఖ‌రిని ప్ర‌ద‌ర్శించే నేత‌లు లేక‌పోలేదు. అప్ప‌ట్లో ప్ర‌జారాజ్యం పేరుతో పార్టీ పెట్టిన మెగాస్టార్ చిరంజీవి సంగ‌తే చూస్తే.. ఆయ‌న ఒక ప్రాంతంలో ప‌ర్య‌టించి.. మ‌రో ప్రాంతంలో ప‌ర్య‌టించ‌టానికి చాలా గ్యాప్ తీసుకునే వారు. ఏక‌బిగిన నెల రోజుల పాటు రెస్ట్ లేకుండా ప‌ర్య‌ట‌న‌లు చేసిన తీరు ఎక్క‌డా క‌నిపించ‌దు. కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా ఆయ‌న మ‌ధ్య మ‌ధ్య‌లో రెస్ట్ తీసుకునేవారు.

అన్న‌కు త‌గ్గ త‌మ్ముడిలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.  పార్టీ పెట్టి.. దాన్ని యాక్టివ్ గా న‌డిపించ‌టానికి నాలుగేళ్ల‌కు పైనే పెట్టిన ఆయ‌న‌.. కొన్ని నెల‌లుగా త‌ర‌చూ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నారు. అయితే.. ఆయ‌న మొద‌ట ప్ర‌క‌టించే షెడ్యూల్స్ కు.. త‌ర్వాత జ‌రిగే వాటికి ఏ మాత్రం పోలిక ఉండ‌ని ప‌రిస్థితి. ఒక ప్రాంతంలో ప‌ర్య‌టించిన వెంట‌నే బ్రేక్ తీసుకోవ‌టం.. ఆ త‌ర్వాతి షెడ్యూల్ ను వాయిదా వేయ‌టం ప‌వ‌న్ లో త‌ర‌చూ క‌నిపించే గుణం.

సినిమా నేప‌థ్యంలో నుంచి రావ‌టం వ‌ల్ల‌నేమో కానీ.. షాట్ షాట్ కి మ‌ధ్య గ్యాప్ లో క్యారవాన్ లో  సేద తీర‌టం.. మూడ్ బాగోకుంటే షూటింగ్ క్యాన్సిల్ చేసినంత సింపుల్ గా త‌న ప‌ర్య‌ట‌న‌ల్ని త‌ర‌చూ వాయిదా వేసుకోవ‌టం ప‌వ‌న్ లో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించే అంశం. తాజాగా ఆయ‌న గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముందుగా ప్ర‌క‌టించిన‌ షెడ్యూల్ ప్ర‌కారం చూస్తే.. ఆగ‌స్టు 23 నుంచి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టించాల్సి ఉంది. అయితే.. ఇప్పుడు కురుస్తున్న భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో త‌న ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

త‌న రాక కార‌ణంగా ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌తార‌ని ప‌వ‌న్ చెబుతున్నారు. అవ‌స‌రం ఉన్నా లేకున్నా త‌న చుట్టూ భ‌ద్ర‌తా బ‌ల‌గాల్ని భారీగా మొహ‌రించుకునే ప‌వ‌న్‌.. చిన్న‌పాటి చికాకుకి ఇష్ట‌ప‌డ‌ర‌ని చెబుతారు.  ప్ర‌జ‌లు క‌ష్టంలో ఉన్న‌ప్పుడు వారి క‌ష్టాల్లో పాలు పంచుకొని.. వారికి ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్య‌త ప్ర‌జా నాయ‌కుడిగా ఉంటుంది. కానీ.. ప‌వ‌న్ మాత్రం త‌న సెల‌బ్రిటీ స్టేట‌స్ ను వ‌దిలిపెట్ట‌టానికి ఇష్ట‌ప‌డ‌రు.

త‌మిళ‌నాడు వ‌ర్షాలతో ఉక్కిరిబిక్కిరి అయిన‌ప్పుడు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు లుంగీలు క‌ట్టుకొని వ‌ర‌ద స‌హాయ‌క కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌టం.. వారిని చూస్తే సామాన్యుల మాదిరే క‌నిపించారే త‌ప్పించి వారు ప్ర‌ముఖ న‌టులుగా వ్య‌వ‌హ‌రించ‌లేదు. అంత‌దాకా ఎందుకు కేర‌ళ‌ను ముంచెత్తిన వ‌ర‌ద‌ల్లో బాధితుల్ని ఆదుకునే క్ర‌మంలో ఒక ఐఏఎస్ అధికారి బుర‌ద‌లో దిగి మ‌రీ ప‌ని చేసిన తీరు అంద‌రిని క‌ద‌లించింది. ప్ర‌జ‌ల ప‌ట్ల మ‌మ‌కారం.. వారి బాధ‌ల ప‌ట్ల సానుభూతి ఉన్న వారు.. వారిని ఆదుకునే విష‌యాన్ని ఆలోచిస్తారే త‌ప్పించి.. త‌న‌కున్న స్టార్ డ‌మ్ ను అస్స‌లు గుర్తు చేసుకోరు.కానీ.. ప‌వ‌న్ మాత్రం త‌ర‌చూ త‌న సెల‌బ్రిటీ స్టేట‌స్ ను గుర్తు చేసుకుంటూ.. వాయిదాల మీద వాయిదాలు వేసుకోవ‌టం క‌నిపిస్తుంది. చూస్తుంటే.. ప‌వ‌న్ రాజ‌కీయ నాయ‌కుడి క‌న్నా.. వాయిదాల నేత‌గా మారుతున్నాడ‌న్న భావ‌న‌ను ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.


Tags:    

Similar News