అన్న‌య్య మ‌న‌స్సును గాయ‌ప‌రిచా..రాజీ ప‌డ‌ను

Update: 2015-08-23 10:12 GMT
ప్ర‌జ‌ల కోసం తండ్రి త‌ర్వాత తండ్రి లాంటి సొంత అన్న‌య్య‌నే వ‌దులుకున్నాన‌ని...అలాంటిది ప్ర‌జ‌ల సంక్షేమం కోసం తాను టీడీపీ, బీజేపీతో రాజీప‌డ‌న‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. ఆదివారం రాజ‌ధాని ప్రాంత‌మైన గుంటూరు జిల్లా పెనుమాక ప‌ర్య‌ట‌న‌లో ప‌వ‌న్ మాట్లాడుతూ గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ+బీజేపీ కూట‌మి అధికారంలోకి వ‌స్తే ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని న‌మ్మే తాను అన్న‌య్య చిరంజీవి మ‌న‌స్సును గాయ‌ప‌రిచి మ‌రీ టీడీపీకి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేశాన‌ని చెప్పారు.

రాష్ర్ట విభ‌జ‌న‌తో ఏపీ పూర్తిగా న‌ష్ట‌పోయింద‌ని..ఆ టైంలో వైకాపా అధినేత జ‌గ‌న్ క‌న్నా ఎంతో అనుభ‌వ‌జ్ఞుడైన నారా చంద్ర‌బాబు నాయుడు పాల‌న బాగుంటుంద‌నే తాను టీడీపీకి స‌పోర్ట్ చేశాన‌న్నారు. అలాగే హైటెక్ సిటీని నిర్మించ‌డంతో పాటు అమెరికా అధ్య‌క్షుడిని రాష్ర్టానికి తీసుకొచ్చి...ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నో దేశాల అధినేత‌ల‌తో సంబంధాలున్న అపార‌ అనుభ‌వ‌జ్ఞుడు చంద్ర‌బాబు అని.. రైతుల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ప్ర‌త్యామ్నాయ ప‌ద్ధ‌తుల్లో భూసేక‌ర‌ణ చేసే శ‌క్తి సామ‌ర్థ్యాలు కూడా ఆయ‌న‌కు ఉన్నాయ‌న్నారు.

వ్యక్తిగతంగా తాను ఏ పార్టీకి, ఏ వ్యక్తికీ అనుకూలం కాదని, వైసీపీ కూడా తనకు శత్రువు కాదని పవన్ తెలిపారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే వాడినైతే టీడీపీకి ఎందుకు మద్దతిస్తాన‌ని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. టీడీపీకి మద్దతు ప్రకటించిన సమయంలో తానేమీ ఎమ్మెల్యే, ఎంపీ పదవులు కావాలని అడగలేదని..విభ‌జ‌న వ‌ల్ల న‌ష్ట‌పోయిన సీమాంధ్ర‌కు ప్ర‌త్యేక హోదా కావాల‌ని అడిగిన‌ట్టు ఆయ‌న స్పష్టం చేశారు. తాను అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నానని కొందరు టీడీపీ నేతలు అంటున్నారని...వారు ఏం చేసినా చూస్తూ ఊరుకుంటే మంచివాడినా? లోపాలను ఎత్తి చూపితే అభివృద్ధికి ఆటంకం క‌లిగించిన వాడినా అని ఆ పార్టీ నేత‌ల తీరును దుయ్య‌బ‌ట్టారు.
Tags:    

Similar News