చింత‌మ‌నేని ఒక రౌడీ షీట‌ర్: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

Update: 2018-09-25 10:47 GMT
2014లో చంద్ర‌బాబు న‌వ్యాంధ్ర సీఎంగా ప‌ద‌వి చేప‌ట్టాక రాష్ట్రంలో అవినీతి - అక్ర‌మాలు - దౌర్జ‌న్యాలు పెరిగిపోయాయ‌ని ప్ర‌జ‌లు - ప్ర‌తిప‌క్షాలు గ‌గ్గోలు పెడుతోన్న సంగ‌తి తెలిసిందే. కొంద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు....అధికార ద‌ర్పంతో ప్ర‌భుత్వాధికారుల‌పై చేయి చేసుకున్న ఘ‌ట‌న‌లు క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఇసుక అక్ర‌మ ర‌వాణాకు అడ్డుప‌డిన కార‌ణంగా ఎమ్మార్వో వ‌న‌జాక్షిపై  దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ దాడి చేసిన ఘ‌ట‌న అప్ప‌ట్లో  సంచ‌ల‌నం రేపింది. అయితే, తాజాగా కూడా చింత‌మ‌నేని...జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ పై జ‌న‌సేన అధ్యక్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చింత‌మ‌నేని ఒక ఎమ్మెల్యే కాద‌ని, ఆయ‌నో రౌడీషీట‌ర్ లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప‌వ‌న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జ‌న‌సేన కార్య‌కర్త‌ల‌పై ఆయ‌న దాడులు చేస్తూ రాజ్యాంగేత‌ర శ‌క్తిగా ఎదుగుతున్నారని...ఆయ‌న‌పై సీఎం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌వ‌న్ కోరారు. చింత‌మ‌నేనిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఈ వ్య‌వ‌హారంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు - ఏపీ డీజీపీ - సీఎస్ - ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా క‌లెక్ట‌ర్ దృష్టి సారించాల‌ని కోరారు.

చంద్ర‌బాబుకు పాల‌నా అనుభ‌వం ఉంద‌ని, లా అండ్ ఆర్డ‌ర్ బ‌లంగా ఉంచుతాన‌ని ఆయ‌న 2014లో త‌న‌కు మాటిచ్చార‌ని, అందుకే టీడీపీకి మ‌ద్ద‌తిచ్చాన‌ని ప‌వ‌న్ అన్నారు. కానీ, చింత‌మ‌నేని ....ఓ ఎమ్మార్వో - ఇన్ స్పెక్ట‌ర్ పై దాడి చేశార‌ని...ఇపుడు జ‌న‌సేక కార్య‌కర్త‌ల‌ను ఇంటికి పిలిపించి కొట్టార‌ని.....ఓ రౌడీ షీట‌ర్ లా చింత‌మ‌నేని వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప‌వ‌న్ అన్నారు. ఆయ‌న‌పై ఇప్ప‌టికే 37 కేసులున్నాయ‌ని, వెంట‌నే ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోకుంటే క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు మారే అవ‌కాశాలుంటాయ‌ని ప‌వ‌న్ హెచ్చ‌రించారు. ఇది ఫ్యూడ‌లిస్టిక్ వ్య‌వ‌స్థ కాద‌ని, మారుతున్న త‌రాన్ని బ‌ట్టి ఎమ్మెల్యేలు మారాల‌ని ప‌వ‌న్ అన్నారు. ఇప్ప‌టిదాకా స‌హ‌నంతో ఓపిక ప‌డుతున్నామ‌ని, చింత‌మ‌నేనిని సీఎం క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్ట‌కుంటే ప్ర‌జ‌లు పెట్టాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. ప‌రిస్థితి ప్ర‌జ‌ల చేతిలోకి వెళ్లాక లా అండ్ ఆర్డ‌ర్ సిట్యుయేష‌న్ క్రియేట్ అయితే ప్ర‌భుత్వానిదే బాధ్య‌త అని అన్నారు.


Tags:    

Similar News