జ‌గ‌న్‌ కు లేని వ‌ర్షం ఇబ్బంది ప‌వ‌న్ కు ఎందుకో?

Update: 2018-07-17 10:21 GMT
నాయ‌కుడ‌న్న త‌ర్వాత క‌మిట్ మెంట్ ఉండాలి. ఒక‌సారి ఒక మాట చెప్పిన త‌ర్వాత‌.. ఆ మాట‌ను నిల‌బెట్టుకోవ‌టానికి ఎంత‌కైనా సిద్ధ‌ప‌డాలి. ఎన్ని క‌ష్టాల‌కైనా తట్టుకొని నిల‌బ‌డాల్సిందే. కానీ.. అలాంటివేమీ త‌న‌లో లేవ‌న్న విష‌యాన్ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టికే ప‌లుమార్లు స్ప‌ష్టం చేశారని చెప్పాలి.

జ‌న‌సేన ఆరంభం నుంచి సింగిల్ మ్యాన్ షోగా న‌డిపిస్తున్న ప‌వ‌న్‌.. ఇప్పుడు గుప్పెడు మందిని వెంట‌పెట్టుకొని కొత్త త‌ర‌హా రాజ‌కీయాలంటూ యాత్ర‌లు చేస్తున్నారు. అయితే.. ఈ యాత్ర‌లు షెడ్యూల్ ప్ర‌కారం సాగ‌కుండా.. ఏదో ఒక కార‌ణంతో వాయిదా ప‌డుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. త‌న‌తో ప‌లు వ‌ర్గాలు స‌మావేశ‌మైన సంద‌ర్భంగా నోటికి వ‌చ్చిన హ‌మీలు ఇచ్చేసే ప‌వ‌న్.. ఆ త‌ర్వాత వాటిని ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న విమ‌ర్శ ఉంది.

అప్పుడెప్పుడో అనంత‌పురం క‌రవు మీద పాద‌యాత్ర చేస్తాన‌ని మాట ఇవ్వ‌టం తెలిసిందే. కానీ.. ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న ఆ మాట‌ను నిల‌బెట్టుకున్న‌ది లేదు. ఈ మ‌ద్య‌న ఉత్త‌రాంధ్ర మీద ఫోక‌స్ పెంచిన ప‌వ‌న్‌.. మూడు నెల‌ల పాటు త‌న యాత్ర ఉంటుంద‌ని చెప్పారు.

రంజాన్ పండ‌గ‌ని కొన్ని రోజులు.. ఆ త‌ర్వాత ఆరోగ్య కార‌ణాల మీద మ‌రికొన్ని రోజులే కాదు.. నాన్ స్టాప్ ప‌ర్య‌ట‌న‌లు చేయ‌కుండా వాయిదాల ప‌ద్ధ‌తిలో చేయ‌టం.. మ‌ధ్య మ‌ధ్య‌లో ఒక‌ట్రెండు రోజులు రెస్ట్ తీసుకోవ‌టం జ‌న‌సేన పార్టీ వ‌ర్గాల‌కు చిరాకు తెప్పిస్తుంద‌ని చెబుతున్నారు. గోదావ‌రి జిల్లాలో ఉన్న‌ట్లుండి ఆయ‌న ప‌ర్య‌ట‌న మ‌ధ్య‌లో ఆగిపోవ‌టం.. మ‌ళ్లీ ఎప్పుడు మొద‌ల‌వుతుందో అర్థంకాని ప‌రిస్థితి నెల‌కొంది.

ఇదిలా ఉంటే.. తాజాగా పార్టీ జిల్లా ఇన్ చార్జ్ క‌ల‌వ‌కొల‌ను తుల‌సి మాట్లాడుతూ.. వ‌ర్షాల కార‌ణంగా ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింద‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. వ‌ర్షాలు విస్తారంగా ప‌డుతున్న‌కార‌ణంగా వ్య‌వ‌సాయ ప‌నుల్లోరైతులు నిమ‌గ్న‌మై ఉంటార‌ని.. అందుకే మ‌ధ్య‌లో కాస్తంత బ్రేక్ ఇచ్చిన‌ట్లుగా పేర్కొన్నారు. ఈ నెల మూడో వారం నుంచి ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న ఉంద‌ని చెబుతున్నారు.

ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న ఆగ‌టానికి చూపించిన కార‌ణాల‌పై విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇవే అంశాలు ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ కు కూడా వ‌ర్తిస్తాయ‌న్న విష‌యాన్ని ఎలా మ‌ర్చిపోతార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. జోరున ప‌డుతున్న వ‌ర్షాల్లోనూ  ఆప‌కుండా త‌న పాద‌యాత్ర‌ను సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇబ్బంది ఉంటే అంద‌రికి ఉండాలి. అదేంటో.. వ‌ర్షం.. పండ‌గ‌.. ఇంకేదో అన్ని క‌ష్టాలు ప‌వ‌న్ కే అన్న‌ట్లు ఉందే!
Tags:    

Similar News