అదే మాట అన్నిసార్లు చెబితే ఇబ్బందే పవన్

Update: 2023-06-30 17:35 GMT
రాజకీయాల్లో ఆచితూచి వ్యాఖ్యలు చాలా అవసరం. ప్రతి మాటకు ఒక లెక్క ఉంటుంది. నోటి నుంచి అదాటుగా వచ్చే కొన్ని మాటలు.. తర్వాతి రోజుల్లో తెగ ఇబ్బంది పెట్టటమే కాదు.. తర్వాతి రోజుల్లో గతంలో తాము మాట్లాడిన మాటలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. దీనికో చక్కటి ఉదాహరణగా.. గ్రేటర్ హైదరాబాద్ కు జరిగిన ఎన్నికల వేళ మంత్రి కేటీఆర్ మాటల్ని చెప్పాలి.

తాము వందకు తగ్గకుండా స్థానాల్లో విజయం సాధిస్తామంటూ ఆయన చాలానే కోతలు కోశారు. తీరా.. గ్రేటర్ ఎన్నికల ఫలితాల్ని చూస్తే.. చావు తప్పి కన్నులొట్ట పోయిన చందమన్న పరిస్థితి ఎదురైంది. సొంతంగా మేయర్ ను ఎంపిక చేసకునేంత మెజార్టీ సొంతమైనా.. ఎన్నికల ప్రచార వేళ వందకు పైగా సీట్లు తమకు తగ్గవంటూ బడాయి మాటల కారణంగా సీట్లు తగ్గినప్పటికీ విజయానందం లేకుండా చేశాయి. చివరకు గెలిచి ఓడిన పరిస్థితి నెలకొంది.

ఎందుకంటే.. వంద సీట్లలో ఖాయంగా తమ పార్టీ గెలుస్తుందన్న దానికి భిన్నంగా 55 సీట్లకు ఆగిపోవటంతో గెలిచి ఓడిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు కూడా రాబోయే రోజుల్లో అలాంటి అనుభవాన్నే మిగులుస్తాయన్న మాట వినిపిస్తోంది. ఉమ్మడి గోదావరి జిల్లాలో మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏపీలోని మొత్తం 175 స్థానాల్లో చూస్తే.. ఉమ్మడి గోదావరి జిల్లాల అసెంబ్లీ స్థానాల సంఖ్య దగ్గర దగ్గరగా 20 శాతం.

2019 ఎన్నికల ఫలితాల్ని చూస్తే.. తూర్పుగోదావరి జిల్లాలోని 19 స్థానాలకు వైపీపీ 14 స్థానాల్లో విజయం సాధిస్తే.. టీడీపీకి నాలుగు.. జనసేనకు ఒక స్థానం లభించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 స్థానాలకు వైసీపీకి 13 స్థానాల్లో విజయం సాధిస్తే.. టీడీపీ 2 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.

తాజాగా పవన్ జరుపుతున్న వారాహి విజయయాత్రలో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్కస్థానంలో కూడా గెలవకూడదని అదే పనిగా చెబుతున్నారు. చాలా అరుదైన సందర్భాల్లో తప్పించి.. ఇలాంటి పరిస్థితి ఉండదు. అందునా 2019లో 151 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ.. మరో తొమ్మిది నెలల్లో జరిగే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాల్ని నమోదు చేస్తుందన్నది కాలమే చెబుతుంది.

అయితే.. గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన 27 స్థానాల్లో ఒక్క స్థానం కూడా గెలవకూడదన్నది అత్యాశే అవుతుందని చెబుతున్నారు. గతంతో పోలిస్తే.. అధికారపక్షంగా కొంత వ్యతిరేకత ఉంటుంది కానీ.. మొత్తంగా తన పట్టును మిస్ అయ్యే అవకాశం ఉండదు. అలాంటిది జరిగినప్పుడు..పవన్ కోరుకున్న దానికి భిన్నంగా ఫలితాలు వస్తే.. పవన్ ఏమని సమాధానం ఇస్తారు.

గతం కంటే స్థానాలు తగ్గిన వేళలో వచ్చే ఆనందానికి.. ఒక్క స్థానంలో విజయం సాధించకూడదన్న మాటలు రాబోయే రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలకు సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉంటాయన్న విషయాన్ని పవన్ గుర్తిస్తే మంచిది. చెప్పిన మాటను.. అదే పనిగా చెప్పటం వల్ల ప్రయోజనం ఉండదు సరికదా.. తర్వాతి రోజుల్లో తన మాటలు ఎలాంటి ప్రభావం చూపలేదన్నది ఆయన పొలిటికల్ కెరీర్ మీద ప్రభావాన్ని చూపుతుందన్నది మర్చిపోకూడదు. ఇప్పటికైనా పవన్ తన తీరు మార్చుకుంటారో లేదో చూడాలి.

Similar News