అమరావతి గ్రామాల్లో నిరసనలకు పూర్తిస్థాయిలో నో

Update: 2019-12-26 04:38 GMT
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మూడు రాజధానుల మాటకు రాయలసీమ.. ఉత్తరాంధ్రకు చెందిన వారు హ్యాపీగా ఫీలవుతుంటే.. అమరావతి ప్రాంతానికి చెందిన గ్రామాల వారు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తామంటూ సాగుతున్న ప్రచారంపై సీరియస్ గా ఉన్న అక్కడి రైతులు కొద్ది రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఇప్పటివరకూ ఏపీ రాజధానిని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్న అంశంపై అధికారికంగా నిర్ణయం తీసుకున్నది లేదు. దీనికి సంబంధించిన చర్చను ఈ నెల 27న నిర్వహించే కాబినెట్ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించనున్నారు. రాజధాని అధ్యయనానికి నియమించిన జీఎన్ రావు కమిటీ సిఫార్సుల మీదా మంత్రివర్గ సమావేశంలో పూర్తిస్థాయిలో చర్చ జరగనుంది.

ఒకవిధంగా చెప్పాలంటే రాజధాని తరలింపుపై క్లారిటీతో పాటు..నిర్ణయాలకు అమరావతి వేదికగా మారనుంది. ఈ నేపథ్యంలో అమరావతికి చెందిన గ్రామాల్లో ప్రత్యేక నిషేధాల్ని పోలీసులు ప్రకటించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన బాట పడుతున్న వేళ.. దాన్ని అడ్డుకునేందుకు వీలుగా ఏపీ పోలీసులు స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేశారు. ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగే సమయంలో మంత్రుల వాహనాలు ప్రయాణించే రోడ్ల మీదకు ఎవరూ నిరసనలకు పాల్పడకూడదని స్పష్టం చేశారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే వారిపై కేసులు నమోదు చేయనున్నారు.

రాజధాని ప్రాంతమైన మందడం.. వెలగపూడి తదితర గ్రామాల్లో శుక్రవారం ఎలాంటి నిరసన కార్యక్రమాలకు వీల్లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అంతే కాదు ఈ ప్రాంతంలో రేపు (శుక్రవారం) రోడ్ల మీదకు వచ్చి నిరసనలు నిర్వహించటానికి ఎలాంటి అనుమతులు లేవని తేల్చారు.  అంతేకాదు.. ఆయా గ్రామాల్లోని ఇళ్లల్లో కొత్త వారు ఉండటాన్ని ఊరుకునేది లేదన్నారు. ఎవరింట్లో అయినా గ్రామస్తులు కాకుండా వేరే వారు ఎవరైనా ఉంటే.. ఆ విషయాల్ని ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు.

ఒకవేళ నిబంధనల్ని ఉల్లంఘించేలా వ్యవహరిస్తే మాత్రం.. అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.  గ్రామాల్లో గ్రామస్తులు కాకుండా వేరే వారు ఉంటే.. వారిపై కేసులు పెడతామని స్పష్టం చేస్తున్నారు. శాంతిభద్రతల్ని కాపాడే విషయంలో రాజీ పడేది లేదంటున్న ఏపీ పోలీసులు మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. పెద్ద ఎత్తున ఆంక్షల్ని విధిస్తున్న వేళ పోలీసుల తీరు కీలకం కానుంది.


Tags:    

Similar News