ఫ్లాష్ న్యూస్ ..రాత్రి గం.8 లకి మోదీ ప్రసంగం !

Update: 2020-05-12 07:27 GMT
భారత్ ప్రధాని నరేంద్ర మోదీ గారు మరోసారి ఈ రోజు రాత్రి 8 గంటలకి  జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో మహమ్మారి కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ ‌డౌన్‌ 3.0 కొనసాగుతోంది.. కేంద్రం ప్రకటించిన ప్రకారం ఈ నెల 17తో లాక్‌ డౌన్ ముగిసిపోనుంది. ఈ తరుణంలో  ప్రధాని మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. సోమవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో మోదీ ఐదోసారి చర్చించారు. కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రులతో 5వ సారి సాగిన సమావేశంలో అనేక కీలక అంశాలు చర్చకు వచ్చాయి.

లాక్ ‌డౌన్ పొడిగింపు, రైళ్ల రాకపోకలు, ఆర్థిక పరిస్థితి, కరోనా కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చ జరిగింది. కొన్ని రాష్ట్రాల సీఎంలు లాక్‌ డౌన్‌ ను పొడిగించాలని ప్రధానికి సూచించగా.. మరికొందరు సీఎంలు లాక్‌ డౌన్‌ ను కంటైన్మెంట్ జోన్లకే పరిమితం చేయాలని.. లేనిపక్షంలో ఆర్థికంగా నిలదొక్కుకోవడం కష్టమని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. దీనితో  ఆర్ధిక కార్యకలాపాల పునఃప్రారంభానికి సడలింపులతో కూడిన పలు నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధం అవుతోంది కేంద్రం. తాజాగా జరిగిన సమావేశంలో మెజారిటీ సీఎంలు లాక్ ‌డౌన్ కొనసాగించాలని కోరారు. దీంతో మరోసారి లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ రోజు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించడంతో సర్వత్రా ఉత్కంఠత మొదలైంది. చూడాలి మరి మోదీ ఈసారి ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారో ..
Tags:    

Similar News