సొంత మేలు కోసం ‘కన్నా’కు కీ ఇప్పిచ్చిన చిన్నమ్మ?

Update: 2018-05-15 06:37 GMT
సొంత లాభం కొంత మెరుగు.. ఈ సామెత ఇప్పుడు బీజేపీకి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఎందుకంటే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఎంపిక ఆ పార్టీలో విభేదాలకు కారణమవుతోంది. ఏపీలో బీజేపీ రెండు విడిపోవడానికి ఆస్కారం కల్పించింది. చంద్రబాబుపై ఒంటికాలిపై లేస్తున్న సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియామకం అవుతారని మొదటినుంచి అంతా అనుకున్నారు. ఇక గద్దెనెక్కడమే తరువాయి అనుకుంటున్న టైంలో కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ పగ్గాలు అప్పజెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజానికి కన్నాకు పదవి దక్కడానికి.. సోము వీర్రాజుకు పదవి దూరమవడానికి కీలక పాత్ర పోషించింది చిన్నమ్మ పురంధేశ్వరీ అన్నది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

సోము వీర్రాజులోని ఆవేశం - ఆయనకు లేని ప్రజాదరణ కన్నా.. కన్నానే మేలు అని పురంధేశ్వరీ బీజేపీ అధ్యక్షుడి చెవిలో చెప్పినట్టు సమాచారం. చంద్రబాబును ధీటుగా ఎదుర్కోవాలంటే కాకలు తీరిన కన్నానే మేలు అని పురంధేశ్వరీ లెక్కలతో సహా చెప్పినట్టు సమాచారం. ఇటీవల ఢీల్లీలో జరిగిన పదాధికారులు - పార్టీ అధ్యక్షులు - కీలక నాయకుల సమావేశానికి ఏపీ నుంచి పురంధేశ్వరీ మాత్రమే హాజరయ్యారు. బీజేపీ జాతీయకార్యవర్గ సభ్యుడు హరిబాబును కూడా ఈ సమావేశానికి పిలవలేదు. దీంతో పురంధేశ్వరీ అక్కడే కన్నాకు పదవి వరించేందుకు పావులు కదిపినట్టు సమాచారం.

కన్నాకు పదవి దక్కడం వెనుక చిన్నమ్మకు సొంత లాభం కూడా ఉంది. గడిచిన ఎన్నికల్లో రాయలసీమలోని రాజంపేట నుంచి పురంధేశ్వరీ పోటీచేశారు. అక్కడ ఓడిపోయారు. తనకు పట్టులేని రాయలసీమ కన్నా.. ఆంధ్రా నుంచి టిక్కెట్ రావాలని ఆమె ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లో కలిసి పనిచేసిన కన్నా అయితేనే తనకు వచ్చే ఎన్నికల్లో న్యాయం జరుగుతుందని భావించిన పురంధేశ్వరీ ఈ మేరకు చక్రం తిప్పినట్టు విశ్వసనీయ సమాచారం. అందుకే సోము వీర్రాజుకు అందినట్టే అంది బీజేపీ అధ్యక్ష పదవి దూరమైంది.

Tags:    

Similar News