జ‌గ‌న్ గూటికి చిన్న‌మ్మ‌.. ముహుర్తం ఖ‌రారు?

Update: 2019-01-12 07:57 GMT
ఏపీ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. మ‌రో మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి. సుదీర్ఘ పాద‌యాత్ర‌ను ముగించిన జ‌గ‌న్ ఎన్నిక‌ల క‌స‌ర‌త్తు మీద దృష్టి సారించ‌టంతో పాటు.. బాబుకు చుక్క‌లు చూపించే వ్యూహాన్ని సిద్ధం చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

పాద‌యాత్ర‌తో జ‌నాభిమానాన్ని సంపాదించుకోవ‌టంతో పాటు.. అధికార‌ప‌క్షం గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తించిన జ‌గ‌న్.. ఇప్పుడు మ‌రిన్ని పావులు క‌ద‌ప‌నున్నారు. పార్టీలో చేరేందుకు ఆస‌క్తి చూపుతున్న ప‌లువురు నేత‌ల‌కు ప‌చ్చ జెండా ఊపేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఎన్టీఆర్ కుమార్తెగా.. అంద‌రికి చిన్న‌మ్మ‌గా సుప‌రిచితురాలైన మాజీ కేంద్ర మంత్రి ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి కుటుంబం యావ‌త్తు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మైన‌ట్లుగా చెబుతున్నారు.

2004 ఎన్నిక‌ల వేళ అనూహ్యంగా కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసిన ఆమె.. అన‌తి కాలంలోనే త‌న స‌త్తాను చాట‌టంతో పాటు.. త‌న ముద్ర‌ను వేయ‌గ‌లిగారు. రెండు ద‌ఫాలు ఎంపీగా విజ‌యం సాధించిన ఆమె రెండు సంద‌ర్భాల్లోనూ కేంద్ర‌మంత్రి ప‌ద‌విని చేప‌ట్టారు.

విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఆమె.. త‌ర్వాత బీజేపీలో చేరారు. 2014లో క‌డ‌ప జిల్లా రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓట‌మి పాలైన ఆమె.. నేటికి బీజేపీలో కొన‌సాగుతున్నారు. ఏపీకి ఇవ్వాల్సిన ప్ర‌త్యేక హోదా విష‌యంలో పార్టీ అనుస‌రిస్తున్న విధానాల‌పై అసంతృప్తితో ఉన్న ఆమె.. తాజాగా జ‌గ‌న్ పార్టీలో చేరేందుకు స‌ముఖుంగా ఉన్నారు. దీనికి సంబంధించిన స‌మాచారాన్ని జ‌గ‌న్ వ‌ద్ద‌కు పంపారు.

మొద‌ట్నించి ఎన్టీఆర్ మీద సానుకూల‌త‌ను వ్య‌క్తం చేస్తూ.. త‌న ల‌క్ష్య‌మంతా బాబు అవినీతి మీద మాత్ర‌మేన‌ని చెప్పే జ‌గ‌న్‌.. ఎన్టీఆర్ కుమార్తె పార్టీలోకి వ‌స్తాన‌న్న దానిపై సానుకూలంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు చెబుతున్నారు. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈ నెల‌21న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చిన్న‌మ్మ ఫ్యామిలీ చేర‌టం ఖాయ‌మంటున్నారు. చిన్న‌మ్మ రాక‌తో జ‌గ‌న్ కు నైతిక బ‌లం మ‌రింత పెర‌గ‌టం ఖాయం. చిన్న‌మ్మ ఎంట్రీతో ఏపీ రాజ‌కీయాల్లో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గంగా గుర్తింపు పొందిన ఒక వ‌ర్గం జ‌గ‌న్ కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించే వీలుంది.

త‌న గురి మొత్తం చంద్ర‌బాబు.. ఆయ‌న స‌న్నిహితుల మీద‌నే త‌ప్పించి ఎన్టీఆర్ మీద ఎప్పుడూ విమ‌ర్శ‌లు చేయ‌ని జ‌గ‌న్ పార్టీలోకి చేర‌టం ద్వారా త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు మేలు జ‌రుగుతుంద‌న్న ఆలోచ‌న‌లో చిన్న‌మ్మ ఉన్న‌ట్లు చెబుతున్నారు. అయితే.. పార్టీలో చేర‌టానికి ఆమె రెండు హామీలు కోరిన‌ట్లుగా తెలుస్తోంది.

త‌న కుమారుడు హితేశ్ కు ప‌ర్చురు టికెట్ ఇవ్వ‌టం.. త‌న‌కు గుంటూరు.. న‌ర‌స‌రావుపేట ఎంపీ స్థానాల్లో ఒక‌టి కేటాయించాల‌ని కోరిన‌ట్లు చెబుతున్నారు. అయితే.. చిన్న‌మ్మ కుమారుడు హితేశ్ కు టికెట్ ఇచ్చే విష‌యంలో జ‌గ‌న్ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే పార్టీ స‌మ‌న్వ‌య క‌ర్త‌ను ప్ర‌క‌టించి ఉండ‌టంతో.. ప‌రిస్థితి చిక్కుముడిగా మారింది. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌ర్చూరు పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ను పిలిపించి మాట్లాడే వీలుందంటున్నారు. మొత్తంగా చూస్తే.. చిన్న‌మ్మ పార్టీ ఎంట్రీ మ‌రికొద్ది రోజుల్లో ఖాయంగా జ‌రుగుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.


Full View

Tags:    

Similar News