రాధేమా అంత పని చేసేసింది

Update: 2016-10-17 07:26 GMT
వివాదాస్పద మాత రాధేమా గుర్తుందా? ఫ్యాన్సీ దుస్తులు ధరించి.. మిగిలిన మాతలకు భిన్నంగా వ్యవహరిస్తూ.. డ్యాన్సులతో అధ్యాత్మికతను పండించే మాత‌... గుర్తుకు వచ్చారా? ఆ మధ్యన దేశ వ్యాప్తంగా తన చేష్టలతో వార్తల్లో నిలిచిన ఆమె.. గడిచిన కొన్నాళ్లుగా వార్తలకు దూరంగా ఉన్నారు. వివాదాలతో సహజీవనం చేసేలా ఉండే ఆమె ధోరణి తాజాగా మరో వివాదానికి కారణమైంది.

మోడ్రన్ దుస్తులతో.. విలాసవంత సౌకర్యాల మధ్య దర్శనమిచ్చే రాధేమా తాజాగా హరిద్వార్ వచ్చారు. ఈ సందర్భంగా గంగానది తీరంలో ఉన్న హరీ కీ పౌరీ ఆలయానికి వచ్చి పూజలు చేశారు. ఈ సందర్భంగా రాధేమా వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారటమే కాదు.. ఆమె చేసిన దానిపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి షూ వేసుకొని వచ్చి.. వాటిని విడవకుండా పూజలు చేసిన తీరును తప్పు పడుతున్నారు.  

ఆలయ నిబంధనల ప్రకారం ఆలయంలోకి చెప్పులు.. షూ లాంటివి ధరించి లోపలకు రాకూడదు. ఎర్రటి వస్త్రాలతో ఆలయానికి వచ్చిన ఆమె అదే కలర్ షూతో వచ్చారు. అక్కడి పూజారులు ఆమె షూ వేసుకున్న విషయాన్ని గుర్తించి.. అభ్యంతరం వ్యక్తం చేసే లోపలే అమ్మగారు చేయాల్సిన పని చేసేసి వెళ్లిపోయారు. పవిత్రంగా భావించే దేవాలయంలోకి షూ వేసుకురావటంపై అక్కడి వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆలయ సంప్రదాయాలకు భిన్నంగా షూ వేసుకొచ్చి పూజలు చేసిన రాధేమాను భవిష్యత్తులో హర్ కీ పౌరీలోకి అనుమతించే ప్రసక్తే లేదని అక్కడి యువ తీర్థ్ పురోహిత్ మహాసభ తీర్మానం చేసింది. గతంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన పర్యటనలో భాగంగా ఈ ఆలయానికి వచ్చిన సందర్భంలోనూ.. చెప్పులు వదిలి మరీ దర్శనం చేసుకున్న వైనాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అనుకుంటాం కానీ గుడి దాకా ఎందుకు.. ఏదైనా షాపుకు వెళ్లిన సందర్భంలో కొంతమంది షాపుల వారు చెప్పులతో లోపలికి అనుమతించేందుకే అస్సలు ఒప్పుకోరు. వస్తువు అమ్ముకోవటానికి ఉన్న షాపులోళ్లే చెప్పులు వేసుకురావటాన్ని అనుమతించని ఉదంతాలు చూసినప్పుడు.. దేవాలయంలోకి షూ వేసుకోవాలన్న ఆలోచనే పెద్దతప్పుగా చెప్పక తప్పదు. ఎదుటి వారి మనోభావాల్ని గౌరవించని వారు మాతలుగా మర్యాద పొందే అవకాశం ఉందా..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News