రఘువీరా బ్లాక్‌ మ్యాజిక్‌ వర్కవుట్‌ అవుతుందా?

Update: 2015-10-14 04:09 GMT
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అస్తిత్వాన్ని కాపాడడానికి పాపం.. టీపీసీసీ చీఫ్‌ హోదాలో రఘువీరారెడ్డి నానా పాట్లు పడుతూనే ఉన్నారు. శాసనసభలో కనీసం ప్రాతినిధ్యం లేని పార్టీకి నాయకుడిగా ఆయన పడుతునన అవస్థలు వర్ణనాతీతం. చాన్సు దొరికితే చాలు.. తనను ఈ పదవీ భారం నుంచి తప్పించాలని ఆయన అధిష్ఠానానికి విన్నవించుకుంటున్నారు. కానీ.. పదేపదే అడుగుతున్నా సరే.. ఆ పదవిని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఒక్క నాయకుడు కూడా లేకపోవడంతో ఆయనకు తప్పడంలేదు.

అయితే తాజాగా రఘువీరారెడ్డి ఇటీవలి రోజుల్లో చేసిన సవాలు ఒకటి ఇప్పుడు చర్చకు వస్తోంది. ప్రత్యేకహోదా కోసం తమ పార్టీ కూడా వీలైనంత పోరాడుతున్నట్లుగా బిల్డప్‌ ఇస్తున్న రఘువీరారెడ్డి.. అందుకోసం గాంధీజయంతి రోజున రాజమహేంద్రవరంలో ఆయన సత్యాగ్రహం కూడా నిర్వహించారు. ఆరోజున నరేంద్ర మోడీకి ఆయన ఒక హెచ్చరిక చేశారు. రాజధాని శంకుస్థాపనకు 22వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ కు వచ్చేలోగా, ప్రధాని రాష్ట్రానికి ప్రత్యేకహోదాను ప్రకటించేయాలని లేకపోతే ఆయనకు తమ పార్టీ తరఫున నల్లజెండాలతో నిరసలను తెలియజేస్తాం అని.. అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసనలు ఉంటాయని ఆయన వెల్లడించారు.

అయితే నల్లజెండాల్తో నిరసన అంటూ 'బ్లాక్‌ మ్యాజిక్‌' చేస్తాననే రఘువీరా హెచ్చరిక వెనుక ప్రయోజనం ఏమిటో అర్థం కావడం లేదు. ఏదో ప్రధాని వస్తున్న కార్యక్రమం సందర్భంగా అల్లరి చేయడం, తద్వారా నలుగురి దృష్టిని ఆకర్షించడం తప్ప.. దానివల్ల హోదా వచ్చేస్తుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. నల్లజెండాలతో నిరసన తెలిపేంత సీన్‌ అక్కడి కట్టుదిట్టమయిన భద్రత ఏర్పాట్ల మధ్య కాంగ్రెస్‌ శ్రేణులకు దక్కకపోవచ్చునని అనుకుంటున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తాను మాత్రం బ్లాక్‌ మ్యాజిక్‌ చేయాల్సిందే అని రఘువీరా ఫిక్సయిపోతే గనుక.. ఒక ఆప్షన్‌ ఉంది. ఎటూ రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలనూ ఆహ్వానిస్తాం అని చంద్రబాబునాయుడు అంటున్నారు. అలాగే రఘువీరాకు కూడా ఇన్విటేషన్‌ అందుతుంది. దాన్ని పట్టుకుని.. ఆయన ఎంచక్కా ఓ నల్లని చొక్కా వేసుకుని కార్యక్రమానికి వెళ్తే సరిపోతుంది. పదుగురి దృష్టినీ ఆకర్షించినట్లవుతుంది, ప్రధానికి నిరసన తెలిపినట్లు కూడా ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News