ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పకుండా టూరా?

Update: 2015-09-23 05:21 GMT
‘‘నేను మీ నాయకుడ్ని కానేకాదు.. మీ కుటుంబ సభ్యుడ్ని’’ అని ముత్యాల్లాంటి మాటలు చెప్పి రెండు రోజులు గడవక ముందే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశాలకు తుర్రుమన్నారు. చెప్పే మాటలకు.. చేసే పనులకు మధ్య వ్యత్యాసం చెప్పకనే చెప్పేశారు. సూటు..బూటు సర్కారు అంటూ నిత్యం ప్రధాని మోడీపైన విరుచుకుపడుతూ.. ఫారిన్ టూర్లకు వెళుతుంటారని.. స్వదేశంలో కంటే విదేశాల్లోనే మోడీ ఎక్కువగా ఉంటారంటూ ఎటకారం చేసే రాహుల్.. తనకు తాను విదేశాలకు వెళ్లే విషయాన్ని పెద్దగా ప్రస్తావించరు.

ఆ మాటకు వస్తే.. తాను వెళ్లే ఫారిన్ టూర్లను దాదాపుగా రహస్యంగా ఉంచేస్తారు. ఆయన టూర్ల మీద మీడియాలో రచ్చ జరిగితే.. అవును.. ఆయన విదేశాలకు వెళ్లారంటూ పొడి పొడి మాటలు చెబుతారే కానీ.. అసలు విషయాన్ని మాత్రం చెప్పరు.

పార్టీ నేతలంతా తన కుటుంబ సభ్యులుగా భావోద్వేగ వ్యాఖ్యలు చేసిన రాహుల్.. మరి తన తాజా ఫారిన్ టూర్ గురించి మాట వరసకు కూడా ఎందుకు చెప్పనట్లు? దేశ ప్రజలంటే తీసి పక్కన పెడదాం. ఎందుకంటే.. సువిశాల భారతావనిలోని అందరికి తెలిసేలా తాను ఫారిన్ టూర్ వెళుతున్న విషయాన్ని చెప్పుకోవటం కష్ట సాధ్యం కావొచ్చు. కానీ.. కుటుంబ సభ్యులుగా చెప్పుకునే పార్టీ వారికి కూడా తాను ఏ దేశానికి వెళుతున్నది.. ఏ పని మీద వెళుతున్నది కాస్త ఓపెన్ గా వివరించి ఎందుకు చెప్పరు?

గతంతో పోలిస్తే ఈసారి తన విదేశీ టూర్ నకు సంబంధించి కాసిన్ని వివరాలు బయట పెట్టారు. మామూలుగా అయితే..  రాహుల్ ఫారిన్ టూర్ కు వెళ్లారని మాత్రమే చెప్పటం అలవాటే. తాజాగా ఆయన లండన్ కు వెళ్లినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే తిరిగి వస్తారని.. ఆయన విదేశీ పర్యటన ముగించిన తర్వాత బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పుకొచ్చారు.

సిత్రం కాకపోతే.. వీవీఐపీల షెడ్యూల్ చాలా పక్కాగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఉంటారన్నది ముందస్తుగా సిద్ధం చేస్తారు. కానీ.. రాహుల్ ఫారిన్ టూర్ విషయంలో మాత్రం వెళ్లే విషయం మాత్రమే చెప్పే కాంగ్రెస్ నేతలు.. ఆయన ఎప్పుడు తిరిగి వస్తారన్నది మాత్రం కచ్ఛితంగా చెప్పకపోవటం గమనార్హం. ఎంత వ్యక్తిగతమైతే మాత్రం.. ఫ్యామిలీ మెంబర్స్  కూడా చెప్పుకోలేని పర్సనల్ మ్యాటర్స్ ఏముంటాయో..?

ఇక.. కొసమెరుపేమంటే.. రాహుల్ పర్యటనపై తొలుత లండన్ అని పేర్కొన్న వారు.. తర్వాత అమెరికా అని చెప్పటం. ఇంతకీ రాహుల్ ఏ దేశానికి వెళ్లారంటారు?
Tags:    

Similar News