దీక్షితులు స్వామీ... ట్వీట్ వేసిందీ తీసిందీ ఎందుకో చెప్పరాదే ...?

Update: 2022-09-29 07:59 GMT
ఆయన శ్రీవారి సేవలో దశాబ్దాల  పునీతులైన అర్చకులు. అయితే నాటి టీడీపీ  సర్కార్ మీద అవినీతి ఆరోపణలు చేయడంతో ఆయన పదవి ఊడింది. అప్పట్లో ఆయన శ్రీవారి ఆలయానికి ప్రధాన అర్చకులుగా ఉండేవారు. ఆయనే రమణ దీక్షితులు. ఇక నాటి నుంచి వైసీపీ వైపుగా మొగ్గి జగన్ చలవతో 2021 ఏప్రిల్ 2న తిరిగి ఆయన శ్రీవారి కొలువులో ప్రవేశించారు. అయితే ఈసారి గౌరవ ప్రధాన అర్చకుని హోదాలో.

మరి ఆయన ప్రధాన అర్చకుడు అయ్యేదెపుడు. పూర్వపు దర్జా హోదా దక్కేదెపుడు. ఇదే రమణ దీక్షితుల నిరంతర చింత. ఇదే ఆయన ఆవేదన, ఆందోళన. అయితే రమణ దీక్షితులుని నిబంధలను సవరించి  2018లో బలవంతంగా రిటైర్డ్ చేయించి ఆయన స్థానంలో ప్రధాన అర్చకుడుగా వేణుగోపాల దీక్షితులుని నియమించేశారు. మూడేళ్ళ తరువాత రమణ దీక్షితులు వస్తే ఆయన నియామకం ఏం కావాలి.

అందుకే ఆయన కోర్టుకు వెళ్లారు. అక్కడ ఈ అంశాన్ని పరిశీలించేందుకు న్యాయస్థానం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. అలా కొన్ని నెలల క్రితం కమిషన్ తన నివేదికను సమర్పించింది. మరి దాని మీద చర్యలు తీసుకోవాల్సింది ఏపీ సర్కార్. ఇప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసలు ఏక సభ్య కమిషన్ ఏమి చెప్పింది అన్నది కూడా ఎవరికీ తెలియదు.

అందుకే ఇక్కడే రమణ దీక్షితులకు ఆగ్రహం వచ్చింది. ఆయన జగన్ తిరుమల తాజా పర్యటనలో ఇదే విషయం మీద గుస్సా అవుతూ ట్వీట్ చేశారు. జగన్ పర్యటనలో ఏక సభ్య కమిషన్ నివేదిక  మీద ఏదీ చెప్పకపొవ‌డం పట్ల  తాను తీవ్ర అసంతృప్తికి గురి అయ్యాయని నేరుగా జగన్ మీదనే కామెంట్స్ చేశారు. ఏక సభ్య కమిషన్ నివేదిక ఏమైంది అని కూడా ఆ ట్వీట్ లో ఆయన నిలదీశారు.

అయితే ఇది జరిగిన తరువాత  సోషల్ మీడియాలో ఆయన మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ముఖ్యమంత్రి జగన్ తో పాటు, టీటీడీపై ఇలాంటి నీచమైన వ్యాఖ్య చేసినందుకు తిరుమలకు చెందిన కొందరు అర్చకులు దీక్షితులును తప్పుబట్టారు. కొందరు అర్చకులు అయితే నేరుగా మీడియా సమావేశం పెట్టి దీక్షితులుని కడిగేశారు.

మరి ఈ పరిణామాలతో ఏమనుకున్నారో ఏమో కానీ దీక్షితులు తాను సీఎం జగన్ మీద పెట్టిన ట్వీట్ ని తన ట్విట్టర్ ఖాతా నుంచి తొలగించేశారు. అయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కానీ దీక్షితులు పెట్టిన ట్వీట్‌ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో ఆయన వ్యతిరేక వర్గం  విస్తృతంగా ప్రసారం చేయడంతో దీక్షితులు ఇబ్బందిలో పడ్డారని అంటున్నారు.

ఇదిలా ఉండగా పేరుకు మాత్రం గౌరవ ప్రధాన  అర్చకులు కానీ శ్రీవారి  ఆలయంలో పూజల  ఇతర నిత్యసేవలు నిర్వహించేందుకు అనుమతించడం లేదని దీక్షితులు జగన్ దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. సరే ఆయన బాధ ఆయనకు ఉన్నా మధ్యలో టీటీడీని, అర్చకులను ఇబ్బందిపెట్టే విధంగా విమర్శలు చేయడమేంటి అన్నదే చర్చగా ఉంది.

మొత్తానికి రమణ దీక్షితులు తాను ఏం సాధించాలని అనుకుంటున్నారో తెలియదు కానీ టీటీడీకే కాదు, శ్రీవారి ఆలయ అర్చకులకు కూడా ఆయన చెడ్డ అయిపోయారు అని తాజా పరిణామాలు బట్టి తెలుస్తోంది. ఆయన చేస్తున్న ఆరోపణలు . టీటీడీలో బ్రాహ్మణ వ్యతిరేక శక్తులు అర్చక, ఆలయ వ్యవస్థలను నాశనం చేస్తున్నాయని విమర్శించడం వంటివి దీక్షితులను ఇరకాటంలో పడేశాయి అంటున్నారు.

ఇక తాజా ట్వీట్ తో ముఖ్యమంత్రి జగన్ కి ఆయన తీవ్ర ఆగ్రహం తెప్పించారు అని ప్రచారం సాగుతోంది. దీంతో దీక్షితుల మీద తీవ్ర వత్తిడి రావడంతోనే ఆయన ట్వీట్ ని తొలగించారు అని అంటున్నారు. మొత్తానికి దీక్షితులు ఎందుకు ట్వీట్ చేశారు, ఎందుకు తీసేశారో ఆయనకే తెలియాలీ స్వామీ అని అంటున్నారు అంతా.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News