10వేల కోట్ల ఎపిసోడ్ లో బుక్ అయ్యిందెవరు?

Update: 2016-10-13 18:00 GMT
రాజకీయాల్లో ఆచితూచి మాట్లాడటం చాలా అవసరం. కేవలం మాటతో పదవి పోగొట్టుకున్నోళ్లు చాలామందే కనిపిస్తారు. పాలనా పరంగా సమర్థులైనప్పటికీ మాట్లాడే మాటలతో లేనిపోని తలనొప్పులు తెచ్చి పెట్టుకునే వారూ కనిపిస్తారు. ప్రత్యర్థిని దెబ్బ తీయటానికి అస్త్రాలు వాడటం మంచిదే కానీ.. ఆ అస్త్రాలు తమనే ముంచేసేలా ఉండకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు. పవర్ లో ఉన్న చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు విపక్ష నేతగా జగన్ తరచూ ఏదో ఒక ప్రయత్నం చేస్తుంటారు. అలా అని అయిన దానికి కాని దానికి జగన్ ను టార్గెట్ చేయాలనుకోవటం తప్పే అవుతుంది. ఎందుకంటే.. జగన్ ను టార్గెట్ చేసే ప్రయత్నంలో తానే లక్ష్యంగా మారకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు.

తాజాగా రూ.10వేల కోట్ల ఆస్తుల్ని హైదరాబాద్ కు చెందిన ఒకరు కేంద్రప్రభుత్వానికి ప్రకటించారన్న వార్త బయటకు వచ్చింది. నల్లధనాన్ని తెలుపు చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన సువర్ణ అవకాశంగా చెప్పొచ్చు. నల్లధనం ఎంతైనా సరే గుట్టుగా ప్రకటించేసి.. కేంద్రం చెప్పిన మొత్తాన్ని అపరాధ రుసుముగా చెల్లించేస్తే.. కేసులు.. వేధింపులు వగైరా వగైరా ఉండవన్న అభయంతో పాటు.. వారి వివరాల్ని గుట్టుగా ఉంచేస్తామన్న వరాన్ని కేంద్రం ఇచ్చింది.

ఈ ఆఫర్ కు దేశ వ్యాప్తంగా చాలామంది స్పందించి.. తమ నల్లధనాన్ని గుట్టుగా వెల్లడించి బతుకు జీవుడా అని బయట పడిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఈ పథకాన్ని ఉపయోగించుకొని హైదరాబాద్ కు చెందిన ఒకరు.. రూ.10వేల కోట్ల మేర తన నల్లఆస్తుల్ని ప్రకటించినట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. దీన్ని అందిపుచ్చుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన అనుచర వర్గం అదంతా ఏపీ విపక్ష నేతకు చెందిందన్న సందేహాలు వ్యక్తం చేస్తూ విమర్శనాస్త్రాల్ని సంధించటం షురూ చేశారు. దీనికి కౌంటర్ అన్నట్లుగా జగన్ వర్గం సైతం రంగంలోకి దిగింది.

ఇక్కడ బాబు చేసిన తప్పేమిటంటే.. రహస్యంగా ఉంచుతామన్న ఒక అంశానికి సంబంధించి ఆరోపణలు చేయటం. మరో తప్పేమిటంటే.. జగన్ ను ప్రత్యేకించి అక్రమ ఆస్తులు ఉన్నాయన్న వాస్తవాన్ని మరోసారి నిరూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆయనపై ఉన్న ఆరోపణలు.. ‘లక్ష కోట్ల’ బ్రాండ్ ఇమేజ్ తెలుగు నేల మీద నిక్కరేసుకున్న చిన్నపిల్లాడికి కూడా తెలుసన్న విషయాన్ని మర్చిపోకూడదు. తాజాగా రూ.10వేల కోట్లు ఆయన ఖాతాలో వేయటం వల్ల బాబు అండ్ కంపెనీకి ప్రత్యేకంగా వచ్చే లాభం ఏమీ ఉండదు. అదే సమయంలో.. ఇలా బురదేసే క్రమంలో ఏ చిన్న తేడా కొట్టినా బాబుకే దెబ్బ. ఆ విషయాన్ని గుర్తించిన జగన్.. తెలివిగా రంగంలోకి రంగంలోకి దిగారు. ఆయన ఆస్థాన విద్వాంసులు చక్కటి వాదనను సిద్ధం చేశారు.

గుట్టుగా ఉండాల్సిన వ్యవహారం బాబుకు ఎలా తెలిసిందన్న ప్రశ్నను ప్రధాని మోడీకి సంధించారు. నల్లధనం వివరాలు చెల్లించిన వారి వివరాల్ని ప్రకటించాలని డిమాండ్ చేయటం ద్వారా తాను సుద్దపూసనన్న భావన కలుగజేయటంతో పాటు.. రూ.10వేల కోట్లు అని పక్కాగా అంకె బాబుకు తెలిసిందంటే.. కచ్ఛితంగా ఆ మొత్తాన్ని బాబు బినామీనే చెల్లించి ఉంటారంటూ సీరియస్ గానే ఎటకారం చేసేసుకున్నారు. జగన్ చేసిన తాజా వ్యాఖ్యల కారణంగా బాబుకు వచ్చిన నష్టం ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం. ఇక్కడే పెద్ద లెక్క ఉంది. కేంద్రం గుట్టుగా ఉంచాల్సిన అంశాలపై బాబు రచ్చ చేయటం ద్వారా.. కేంద్రం మీద ఉండే నమ్మకాన్ని దెబ్బ తీస్తున్నారన్న విషయాన్ని మోడీ దృష్టికి తీసుకెళ్లటం ఒకటైతే.. ఇలాంటి మాటలు మోడీ సర్కారు ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుందన్న భావన కలుగజేయటమే.

అసలే బాబు మీద ప్రదాని మోడీకి అంతంతమాత్రంగా ఉన్న సానుకూలతను ఇలాంటి ఫిర్యాదులతో మరింత తగ్గించే ప్రయత్నం చేయటంతో పాటు.. బాబుకు సన్నిహితంగా ఉండే వెంకయ్య లాంటి వారి మీద కొత్త సందేహాల్ని జగన్ బాబు క్రియేట్ చేసే ప్రయత్నం చేశారని చెప్పాలి. నిజానికి రూ.10వేల కోట్ల ఎపిసోడ్ మీద బాబు అండ్ కో మాట్లాడాక.. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. నల్లధనం వెల్లడి వివరాలు బయటకు పొక్కే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈ అంశం మీద బాబు బ్యాచ్ తన మీద పరోక్షంగా ఆరోపణల దాడి షురూ చేసిన తర్వాత కూడా గమ్మునే ఉన్న జగన్.. ఆ తీవ్రత పెరిగిన తర్వాత.. అదును చూసుకొని తెర మీదకు వచ్చి.. రివర్స్ ఫైర్ కావటం ద్వారా బాబును డిఫెన్స్ లో పడేశారని చెప్పక తప్పదు. సీన్లోకి మోడీని తీసుకురావటం.. కేంద్ర ఇమేజ్ పై సందేహాలు రేకెత్తేలా జగన్ మాట్లాడటం చూసినప్పుడు.. ఆయన వాదనను విన్నప్పుడు ఈ ఎపిసోడ్ లో బాబు అండ్ కో తొందరపడ్డారన్న భావన కలగటం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News