ప‌వ‌న్ పోరాటయాత్ర ఎందుకు ఆగిందంటే...

Update: 2018-06-20 12:44 GMT
జ‌న‌సేన పార్టీని అన్నీ తానై న‌డిపిస్తున్న సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్  విష‌యంలో కీల‌క స‌మాచారం తెర‌మీద‌కు వ‌చ్చింది. తాను క్రియాశీల రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన ప‌వ‌న్ అందుకు త‌గిన‌ట్లుగానే ఉత్త‌రాంధ్ర నుంచి పోరాటయాత్ర మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. అభిమానుల సందడితో సాగిన ఆ యాత్ర రంజాన్ కార‌ణంగా బ్రేక్ ప‌డింది. అయితే, రంజాన్ పూర్తి అయిన‌ప్ప‌టికీ ప‌వ‌న్ పోరాటయాత్ర‌ తిరిగి ప్రారంభం కాక‌పోవ‌డంతో..అంద‌రి దృష్టి జ‌న‌సేనాని పైనే ప‌డింది. ఎందుకు యాత్ర తిరిగి ప్రారంభం కాలేదు? అస‌లు ప‌వ‌న్‌ కు ఏమైంది? అనే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో కొత్త అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది.

అదే ప‌వ‌న్‌ కు ఆప‌రేష‌న్ నిర్వ‌హించ‌డం. ఔను. జ‌న‌సేనానికి శ‌స్త్రచికిత్స వ‌ల్ల పోరాటయాత్ర‌లో జాప్యం జ‌రుగుతోంద‌ట‌. అయితే ఈ చికిత్స జ‌ర‌గ‌లేదు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నుంది! ఈ విష‌యాన్నిజ‌న‌సేన పార్టీ స్వ‌యంగా వెల్ల‌డించింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను గ‌త మూడునెలలుగా కంటి సమస్య బాధిస్తున్నద‌ని జ‌న‌సేన తెలిపింది. తన వెంట ఉండే సిబ్బందిలోని ముస్లిం సోదరుల కోసం రంజాన్ పండుగ సందర్భంగా విశాఖ జిల్లా యాత్రకు  పవన్ విరామం ఇచ్చిన సంగతి విదితమే. ఈ విరామ కాలంలో చిన్నపాటి శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం తిరిగి యాత్రను పవన్ కళ్యాణ్ ప్రారంభించాల‌ని భావించార‌ట‌. అయితే, త‌న ఆరోగ్య స్థితి గురించి వైద్యుల‌ను ఆశ్ర‌యించగా...తాజాగా జరిగిన వైద్య పరీక్షలను  పరిశీలించిన డాక్టర్లు శస్త్ర  చికిత్సకు ఇంకొంత కాలం ఆగాలని సూచించార‌ని జ‌న‌సేన‌ పేర్కొంది. ఈ నెల 24 న శస్త్ర చికిత్స చేయాలని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి డాక్టర్లు నిర్ణయించారని వివ‌రించింది.

దీంతో విశాఖపట్నం జిల్లాలో జనసేన పోరాట యాత్రను ఈ నెల 26  నుంచి తిరిగి ప్రారంభిస్తున్నారని జ‌న‌సేన తెలిపింది. ఈ నెల 26  నుంచి ప్రారంభమయ్యే ఈ మలివిడత యాత్ర విశాఖ జిల్లాలో మూడు నుంచి నాలుగు రోజులపాటు కొనసాగుతుంది.జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించడంతోపాటు ఉత్తరాంధ్ర మేధావులతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యే అవకాశం ఉంద‌ని తెలిపింది. విశాఖ జిల్లా అనంతరం పోరాట యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభం అవుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో పోరాట యాత్ర సన్నాహాలలో ఆ జిల్లా జనసేన నేతలు నిమగ్నమై ఉన్నార‌ని తెలిపింది. రంజాన్ ముగిసి రెండ్రోజులు దాటిపోయిన‌ప్ప‌టికీ...ప‌వ‌న్ యాత్ర‌పై ఇటు మీడియాకు కానీ, అటు ప‌వ‌న్ పార్టీ నేత‌ల‌కు కానీ స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోవ‌గా తాజాగా వ‌చ్చిన క్లారిటీతో జ‌న‌సేన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.
Tags:    

Similar News