తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో జరిగిన కేబినెట్ సమావేశం - ఇటీవల కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలపై తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ కోసం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు వల్ల 20 వేల కోట్ల అదనపు భారం తెలంగాణ ప్రజలపై పడబోతోందని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు. తెలంగాణా ప్రాజెక్టుల పేరుతో ఆంధ్ర కాంట్రాక్టుల రాష్ట్ర డబ్బులను కేసీఆర్ దోచిపెడుతున్నారని ఆరోపించారు. పెద్ద ప్రాజెక్టుల నిర్మించిన యజమానులు సన్మానించిన సందర్భాలు లేవని, అయితే భక్త రామదాసు ప్రాజెక్టు నిర్మించాడని మెగా ప్రాజెక్టు సంస్థ అధిపతి కృష్ణారెడ్డిని సన్మానించడం దారుణమని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు తెలంగాణ సమాజాన్ని కించపరచడమేనని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణా కోసం ప్రాణ బలిదానాలు చేసుకున్న కుటుంబాలను ఏరోజు కూడా సన్మానించ లేదని ఆయన గుర్తుచేశారు.
తెలంగాణ సాధన కోసం సెంటిమెంట్ ను వాడుకున్న కేసీఆర్ అందులో పాలుపంచుకున్న మేధావులను మాత్రం తొక్కిపెట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ పక్కన ఉన్న గద్దర్ - విమలక్క - మందకృష్ణ - కోదండరాం ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. చిన్న జీయర్ స్వామి - మైహోం రామేశ్వర్ రావు - కేవీపీ రామచంద్రరావు - మెగా కృష్ణారెడ్డిలను ఎందుకు వెనకేసుకొని తిరుగుతున్నారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కమీషన్ల కోసం కాదా అని ఆయనీ సందర్భంగా ప్రశ్నించారు. కొండ పోచంపల్లి రిజర్వాయర్ సామర్ధ్యాన్ని ఎందుకు పెంచారో - అనంతరం ఎందుకు తగ్గించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంట సభ్యులకు మేలు చేసేందుకే ఈ రకమైన మార్పులు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 7300కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ద్వారా 50 టీఎంసీల నీరు విడుదల చేస్తామని చెప్పారని, ఇప్పుడు 30 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని చెప్తున్నారు.. ఇది రైతులను మోసం చేయడం కాదా? అని రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ సంస్కృతిని కాపాడే క్రమంలో ఎన్ని తెలంగాణకు సంబందించిన సినిమాలు వచ్చాయి? ఎంతమంది తెలంగాణ నటులు హీరోలుగా మారారు? ఆంధ్ర హీరోలనే వెంటేసుకొని తిరుగుతున్న కేసీఆర్..నాగార్జున - మహేష్ బాబు తో ఎందుకు సన్నిహిత్యంగా ఉంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కుల రాజకీయాలకు - కులాల ఓట్లకు కేసీఆర్ తెర లేపుతున్నారని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. ప్రగతి భవన్లో కూర్చుని కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ తీరును అంతా గ్రహిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూనే ఉంటామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/