కేసీఆర్‌ పై కేంద్రానికి రేవంత్ ఫిర్యాదు

Update: 2017-01-16 15:28 GMT
తనకు రాజకీయంగా గుర్తింపునిచ్చిన టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ పట్ల తనకు ఉన్న విశ్వాసాన్ని చాటుకోవడానికి సీఎం కేసీఆర్ ఎన్టీ రామారావు వర్థంతిని అధికారికంగా నిర్వహించాలని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహాల పట్ల ప్రభుత్వం సంకుచిత స్వభావంతో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ నెల 18న ఎన్టీఆర్ వర్ధంతి జరుగనున్న నేపథ్యంలో నిజామాబాద్ హైవేలో కొంపల్లి సమీపాన ఉన్న‌  ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్టీ కార్యకర్తలు - నాయకులతో కలిసి రేవంత్ స్వయంగా శుభ్రం చేశారు. విగ్రహం చుట్టూ ఉన్న చెత్తను స్థానిక నేతలతో కలిసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగానే రేవంత్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ కు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఎన్టీఆరేనని గుర్తుపెట్టుకోవాలని అన్నారు.

ఎన్టీఆర్ తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాధించిన గొప్ప నాయకుడిగా భావించిన కారణంగానే కేసీఆర్ తన కుమారుడికి కూడా ఆయన పేరే పెట్టుకున్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పటికి కూడా కేసీఆర్ ఎన్టీఆర్ ను గౌరవిస్తారనడానికి నిదర్శనంగానే గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ సమయంలో కేసీఆర్ ఎన్టీఆర్‌ ను వేనోళ్ల పొగిడారని రేవంత్ చెప్పారు. అయితే ఎన్టీఆర్‌ మహానాయకుడని కేసీఆర్ పొగుడుతున్నప్పటికీ రాష్ట్రంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహాలు మసకబారిపోతే టీడీపీ కూడా కనుమరుగవుతుందని టీఆర్ ఎస్ కలలు కంటోందని విమర్శించారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్టీఆర్ను మరిపించడం, టీడీపీని లేకుండా చేయడం సాధ్యం కాదని రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ తనకు రాజకీయ బిక్షపెట్టిన ఎన్టీఆర్ పట్ల తనకున్న విశ్వాసాన్ని చాటుకోవాలని దీనికోసం ఎన్టీఆర్ వర్థంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఎన్టీఆర్ విగ్రహాలను స్థానిక సంస్థలే శుభ్రం చేసేలా సంబంధిత శాఖలకు ఆదేశాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.

గతంలో బేగంపేట విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు ఉండేదని ఆ విమానాశ్రయాన్ని శంషాబాద్ కు తరలించే సమయంలో దేశీయ టర్మినల్‌కు  ఎన్టీఆర్ పేరు, అంతర్జాతీయ టర్మినల్‌కు రాజీవ్ గాంధీ పేరు పెట్టాలని నిర్ణయించడం జరిగిందని రేవంత్ గుర్తు చేశారు. అయితే విమానాశ్రయాన్ని శంషాబాద్ కు తరలించిన తరువాత ఎన్టీఆర్ పేరును పూర్తిగా తొలగించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా దేశీయ టర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును పెట్టడానికి అంగీకరించిందని అయితే ఇప్పటి వరకు కూడా దేశీయ టర్మినల్‌ కు ఎన్టీఆర్ పేరు పెట్టలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోకపోతే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News