ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ప్రియాంక భ‌ర్త‌

Update: 2022-03-10 01:30 GMT
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబం నుంచి మ‌రో వ్య‌క్తి దేశ రాజ‌కీయాల్లో అడుగుపెట్ట‌బోతున్నారు. ఆమె కూతురు ప్రియాంక గాంధీ భ‌ర్త రాబ‌ర్ట్ వాద్రా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్లు స‌మాచారం. త‌న కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడి త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటాన‌ని స్వ‌యంగా రాబ‌ర్ట్ వాద్రానే వెల్ల‌డించారు. తాను ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మొరాదాబాద్ నుంచి పోటీ చేయాల‌ని కాంగ్రెస్ నేత‌లు ప‌ట్టు బ‌డుతున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ఆ ఆరోప‌ణ‌లు తిప్పికొట్టాల‌ని..
ప్రియాంక గాంధీ భ‌ర్త రాబ‌ర్ట్ వాద్రాపై మ‌నీ లాండ‌రింగ్ ఆరోప‌ణ‌లున్నాయి. గ‌తంలో మ‌నీలాండ‌రింగ్ కేసులో రాబ‌ర్ట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) విచారించింది. ఆ సంద‌ర్భంగా లండ‌న్‌లో ఆస్తుల‌ను కూడ‌బెట్టార‌నే వార్త‌ల‌ను రాబ‌ర్ట్ తోసిపుచ్చారు. లండ‌న్‌లో వాద్రా ఆక్ర‌మంగా 9 ఆస్తులు కూడ‌బెట్టారంటూ ఈడీ ఆరోపిస్తోంది. వీటిలో మూడు విల్లాలు కాగా.. మిగ‌తావి ల‌గ్జ‌రీ ప్లాట్లు అని తెలిసింది. దీంతో రాబ‌ర్ట్‌పై కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

సోనియా గాంధీ కుటుంబ‌పై ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. గ‌తంలో ఓ సారి బీజేపీ కేంద్ర మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఉమాభార‌తి.. దొంగ భార్య ప్రియాంక గాంధీ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే బీజేపీ నేత‌ల ఆరోప‌ణ‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి.  

ఈ ఆరోప‌ణ‌లను రాజ‌కీయాల ద్వారానే తిప్పి కొట్టాల‌ని భావించే వాద్రా ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్‌లో ప్ర‌వేశించాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలిసింది. మ‌రోవైపు ప్రియాంక గాంధీని రాజ్య‌స‌భ‌కు పంపిస్తార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇటీవ‌ల ముగిసిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం కోసం ఆమె ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డా ఎగ్జిట్ పోల్స్ స‌ర్వేల ప్ర‌కారం అక్క‌డ పార్టీకి ఘోర ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ్డ ఆమెను రాజ్య‌స‌భ ఎంపీగా పార్ల‌మెంట్కు పంపించాల‌ని ఆమె మ‌ద్ద‌తుదారులు బ‌లంగా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలిసింది.
Tags:    

Similar News