తెలంగాణ‌పై సంఘ్ ఫోక‌స్‌..మూడ్రోజుల పాటు..

Update: 2019-12-25 15:13 GMT
తెలంగాణ‌లో బ‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న బీజేపీ...ఇందుకు అవ‌స‌ర‌మైన అన్ని అంశాల‌ను అన్వేషిస్తోంది. ఈ క్ర‌మంలోనే బీజేపీ మాతృక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణాలో బలమైన శక్తిగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అన్ని ప్రాంతాలకు సంఘం చేరుకోవాలనే లక్ష్యంతో ఈ నెల 24 -25 - 26 తేదీలలో విజయ్ సంకల్ప దివస్ పేరుతో శిబిరాన్ని ఏర్పాటు చేసింది. 2024 వరకు ప్రతి బస్తీకి చేరుకునేందుకు లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే, తెలంగాణలో 20 ఏళ్ల  తరువాత విజయ సంకల్ప శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశాలకి ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్‌ భగవత్ విచ్చేశారు.

హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన శిబిరాలకు ఆరెస్సెస్ తో పాటు వీహెచ్పీ - బజరంగ్ దళ్ - ప్రజ్ఞా భారతి - ఏబీవీపీ - బీఎంఎస్ - వికాస్ మంచ్ - సేవా భారతి - స్వదేశీ జాగరణ్ మంచ్ - వికాస భారతి - వనవాసీ సమితి - హిందూవాహిని - బీజేపీ - యువ మోర్చా - కిసాన్ మోర్చా వంటి 34 హిందూ సంస్థల ప్రతినిధులు దాదాపు పది వేల మంది వరకు హాజరయ్యారు. సేవ చేసేందుకు స్వచ్ఛందంగా సుమారు వెయ్యి మంది వాలంటీర్లు పని చేస్తున్నారు. సరూర్నగర్ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు జరగనున్న సభలో ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రధానోపన్యాసం చేశారు. దాదాపు 25 వేల మంది కరసేవకులు మన్సూరాబాద్ - హస్తినాపురం - వనస్థలిపురం నుంచి మార్చ్ చేస్తూ వచ్చి ఎల్బీనగర్ క్రాస్ రోడ్డు దగ్గర కలిశారు.

ఆర్ ఎస్ ఎస్ దక్షిణాదిపై దృష్టి పెట్టింది. తాజాగా జరుగుతున్న విజయ్ సంకల్ప్ సమావేశాలు అందుకు బీజం వేసే అవకాశం ఉంది. సాధారణంగా ఇలాంటి శిబిరాల్లో మీడియాకు అనుమతినివ్వరు. కానీ ఈసారి మాత్రం కొద్దిసేపు లోపలికి అనుమతించారు. ఆర్ ఎస్ ఎస్ డ్రెస్ కోడ్ గా నిక్కరుకు బదులు పాంట్ తీసుకువచ్చిన తర్వాత నిర్వహిస్తున్న భారీ శిబిరం ఇదే కావడంతో సంఘ్ సేవకుల యునిఫామ్ కొత్తగా కనిపించింది. శిబిరానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు - పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ - పార్టీ ఎంపీలు బండి సంజయ్ - ధర్మపురి అర్వింద్ - సోయం బాపూరావు - గరికపాటి మోహన్ రావు - ఎమ్మెల్యే రాజాసింగ్‌ తో పాటు  రాష్ట్ర - జిల్లా బీజేపీ నేతలంతా తలపై నల్ల టోపీ - ఖాకీ పాయింట్ - తెల్ల అంగీ - చేతిలో కర్రతో హాజరయ్యారు.
Tags:    

Similar News