రెడ్డెమ్మ.. ఎన్నాళ్లకెన్నాళ్లకు...!

Update: 2015-07-18 04:15 GMT
సబితా ఇంద్రారెడ్డి... కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయాకా అరుదుగా మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు. కనీసం ఎమ్మెల్యే హోదా కూడా లేకపోవడంతో తరచూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా.. మీడియా ముందుకు వచ్చినా.. బాగుండదన్నట్టుగా ఉంది ఆమె తీరు. ఏడాది కాలంలో నాలుగైదు అంశాల గురించి కూడా సబితమ్మ మీడియా ముందుకు రాలేదు. వైఎస్సార్ కాలంలో ఒక వెలుగు వెలిగి.. ఆ తర్వాత కూడా తన ప్రాధాన్యతను నిలుపుకొన్న రాజకీయ నేత సబితా ఇంద్రారెడ్డి. అయితే ప్రత్యేక తెలంగాణలో జరిగిన తొలి ఎన్నికల్లోనే ఆమె కుటుంబానికి రాజకీయంగా ఎదురుదెబ్బలు తగిలాయి.

అలా కాస్త వెనుకబడిపోయారు. అయితే అప్పుడప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు. తాజాగా ఈ మాజీ మంత్రిగారు ప్రాణహిత ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ఈ ప్రాజెక్టు డిజైన్ ను మారిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆమె విరుచుకుపడ్డారు. గతంలో డిజైన్ చేసినట్టుగా ఈ ప్రాజెక్టును యథాతథంగా నిర్మించాలని ఆమె కోరారు. తేడాలు వస్తే ఊరుకొనేది లేదని వ్యాఖ్యానించారు. ఈ విధంగా ఆమె తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాల విషయంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మాట్లాడారు.

గమనించదగ్గ విషయం ఏమిటంటే.. సబితమ్మ వెంట రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు అంతా ఉండటం. మొన్నటి ఎన్నికల్లో విజయాలు నమోదు చేయలేకపోయిన రంగారెడ్డి జిల్లా నేతలతందరినీ కలుపుకొని సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ విధంగా ఈ మహిళానేత జిల్లా లెవల్లో నేతలందరితోనూ తనకున్న రాజకీయ ఆధిపత్యాన్న ప్రదర్శించారనుకోవాలి. వారు సబిత నాయకత్వాన్ని సమర్థిస్తున్నట్టే అనుకోవాలి. మరి తెలంగాణ కాంగ్రెస్ లో ని ప్రతి జిల్లా విభాగంలోనూ ఈ మాత్రం ఐక్యమత్యం ఉంటే చాలేమో!
Tags:    

Similar News