క‌రోనా ఎఫెక్ట్‌.. ఈ సారి `హ‌జ్‌` లేన‌ట్టే

Update: 2021-06-13 03:30 GMT
క‌రోనా ప్ర‌భావం.. అన్ని మ‌తాలపైనా ప‌డింది. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో క్రిస్టియ‌న్‌, ముస్లిం మ‌తాల‌కు చెందిన పుణ్య ప్రాంతాల  సంద‌ర్శ‌నం, మందిరాలు, మ‌సీదుల యాత్ర‌ల‌కు ఆయా దేశాల ప్ర‌భుత్వాలు బ్రేకులు వేస్తున్నాయి. ఏటా ఎంతో ఘ‌నంగా జ‌రిగే హ‌జ్ యాత్ర‌పై గ‌త ఏడాది స‌హా ఇప్పుడు కూడా క‌రోనా ప్ర‌భావం ప‌డింది. దీంతో ముస్లిం సోద‌రులు ఎంతో ప‌విత్ర యాత్ర‌గా భావించే హ‌జ్ యాత్ర వరుస‌గా ఈ ఏడాది కూడా స్థానికుల‌కే ప‌రిమిత‌మైంది.

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది హజ్‌ యాత్రను కేవలం 60 వేల మందికే పరిమితం చేయనున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. వారు కూడా సౌదీ అరేబియాకు చెందిన వారేనని స్పష్టం చేసింది. ఈ మేరకు సౌదీ ప్రెస్‌ ఏజెన్సీ వెల్లడించింది. ఇత‌ర దేశాల వారు ఎవ‌రూ కూడా రావొద్ద‌ని తెలిపింది. సాధారణం గా హజ్‌ యాత్రలో పాల్గొనేందుకు ప్రతి ఏటా 160 దేశాల నుంచి ముస్లింలు సౌదీ అరేబియా విచ్ఛేస్తారు.

హజ్‌ యాత్రలో పాల్గొనే వారిలో మూడింట రెండొంతుల మంది విదేశీయులే ఉంటారు. ఒక వంతు మాత్రమే సౌదీ అరేబియాకు చెందిన వారు ఉంటారు. కరోనా నేపథ్యంలో విదేశీయులకు ఈసారి కూడా అవకాశం లేకుండా పోయింది. గత ఏడాది హజ్‌ యాత్రకు సౌదీ అరేబియాలో నివసిస్తున్న వెయ్యి మందికి అవకాశం కల్పించారు. జులైలో హజ్‌ యాత్ర ప్రారంభంకానుంది.

అయితే.. హ‌జ్ యాత్ర ద్వారా అన్ని దేశాల‌కు ర‌వాణా చార్జీల రూపంలో కోట్ల రూపాయ‌ల ఆదాయం వ‌స్తుంది. అదేవిధంగా అనేక వ్యాపార వ‌ర్గాల‌కు కూడా ఈ యాత్రద్వారా ల‌బ్ధి చేకూరుతుంది. అయితే.. క‌రోనా నేప‌థ్యంలో ఈ యాత్ర‌కు బ్రేకులు ప‌డ‌డంతో అంద‌రూ దిగాలు ప‌డ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ముస్లిం వ‌ర్గాలు మాత్రం క‌రోనా నేప‌థ్యంలో వాయిదా ప‌డ‌డం మంచిదేన‌ని అంటున్నారు.
Tags:    

Similar News