నిర్భ‌య రాక్ష‌సుల కొత్త మాట విన్నారా?

Update: 2018-05-05 05:39 GMT
చేసింది దారుణ‌మైన ప‌ని. చేసిన ప‌నికి సిగ్గు ప‌డ‌కుండా.. క‌నీస ప‌శ్చాతాపానికి గురి కాకుండా ఇష్టారాజ్యంగా వాదిస్తున్న నిర్బ‌య దోషుల మాట‌లు వింటే ఒళ్లు మండిపోతుంది. త‌మ‌కు విధించిన ఉరిశిక్ష‌ను త‌ప్పించాలంటూ సుప్రీంకోర్టుకు తాజాగా చేసుకున్న విన‌తిని చూస్తే.. అర్జెంట్ గా ఉరిశిక్ష‌ను అమ‌లు చేస్తే మంచిద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

ఏ పాపం ఎరుగ‌ని ఒక అమాయ‌కురాలిని అత్యంత దారుణంగా.. మాట‌ల్లో చెప్ప‌లేనంత కిరాతాకంగా సామూహిక అత్యాచారం చేసిన రాక్ష‌సుల త‌ప్పులు ఇప్ప‌టికే కోర్టులో నిరూపిత‌మై.. శిక్ష‌లు ప‌డిన త‌ర్వాత‌.. తాము చేసిన త‌ప్పున‌కు ఉరిశిక్ష ఎలా వేస్తారంటూ వేస్తున్న ప్ర‌శ్న‌లు చూస్తే.. ఒళ్లు మండిపోయేలా ఉంది. త‌మ‌కు విధించిన మ‌ర‌ణ‌శిక్ష‌పై స‌వాలు చేస్తూ.. త‌మ న్యాయ‌వాది చేత వారు వినిపించిన వాద‌న వింటే.. దారుణ‌మైన త‌ప్పులు చేసినోళ్లు సైతం ఎలా త‌ప్పించుకోవ‌చ్చో ఈ వైనం స్ప‌ష్టం చేస్తుంది.

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన నిర్బ‌య అత్యాచార కేసులో ఉరిశిక్ష ప‌డిన న‌లుగురు దోషుల్లో ఇద్ద‌రు త‌మ‌కు విధించిన ఉరిని త‌ప్పించాల‌ని కోర్టును కోరారు. ఈ సంద‌ర్భంగా క్ష‌మాభిక్ష ప్ర‌సాదించాల‌ని అర్థించారు. మ‌ర‌ణ‌శిక్ష అంటే న్యాయం పేరుతో దారుణంగా చంపేయ‌ట‌మేనంటూ స‌న్నాయి నొక్కులు నొక్కారు.

తామింకా యువ‌కుల‌మ‌ని.. పేద కుటుంబాల నుంచి వ‌చ్చామ‌ని.. నిర్భ‌య ఇచ్చిన మ‌ర‌ణ‌వాంగ్మూలంతో అనేక లోపాలు ఉన్నాయ‌ని.. ఒక్క‌చోట కూడా త‌మ పేర్లు ఆమె చెప్ప‌లేదంటూ స‌రికొత్త వాద‌న‌ను వినిపించారు. ఈ వాద‌న ఒక్క‌టి చాలు.. లాగి పెట్టి ఒక్క‌టివ్వాల‌నిపించ‌టానికి. న్యాయం  కోరే పేరుతో ఇష్టారాజ్యంగా మాట‌లు తిప్పేయ‌టం చూసిన‌ప్పుడు.. ఇలాంటి దారుణాల‌కు పాల్ప‌డిన వారికి అవ‌స‌రానికి మించిన స్వేచ్ఛ‌ను.. హ‌క్కుల్ని ఇచ్చామా? అన్న డౌట్ రాక మాన‌దు.

ఒక అమ్మాయిని అప్ప‌టికి ఏ మాత్రం ప‌రిచ‌యం లేని వ్య‌క్తులు అత్యంత దారుణంగా హింసించి మ‌రీ అత్యాచారం చేస్తే.. వారి పేర్ల‌ను ఎలా చెప్ప గ‌లుగుతుంది? త‌మ పేర్ల‌ను బాధితురాలు ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు కాబ‌ట్టి.. త‌మ‌ను విడిచిపెట్టాలని వాదించ‌టాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

ఇంకా న‌యం.. త‌మ‌ కుటుంబ వివ‌రాలు.. త‌మ వ్య‌క్తిగ‌త వివ‌రాలు..త‌మ వ్య‌క్తిత్వ తీరును  బాధితురాలు చెప్ప‌లేదు కాబ‌ట్టి.. తాము అస‌లు నేరం చేయ‌లేద‌ని భావించాల‌ని వాదించ‌నందుఉ సంతోష‌ప‌డాలేమో?  అవ‌కాశం ఇస్తే ఈ త‌ర‌హా వాద‌న‌లు కూడా వినిపిస్తారేమో?  ఇక‌.. సుప్రీం విధించిన ఉరిపై స‌ద‌రు దోషుల త‌ర‌ఫు న్యాయ‌వాది చేసిన స‌రికొత్త వాద‌న ఏమంటే..  దోషులు త‌ర‌చూ నేరాలు చేసే వారు కాద‌ని.. వారు త‌మ త‌ప్పును దిద్దుకొని సంస్క‌ర‌ణ బాట ప‌ట్టే అవ‌కాశాన్ని క‌ల్పించాల‌ని.. మ‌ర‌ణ‌శిక్ష విధిస్తే నేర‌స్తులు చ‌నిపోతారేమో కానీ నేరం చావ‌ద‌ని.. ఒక మ‌నిషి బ‌త‌కాలా?  చావాలా? అనేది ఒక కోర్టు నిర్ణ‌యించ‌లేద‌ని వాదించారు.

మ‌రి.. ఏ చ‌ట్టంలో దారుణంగా హింసించి అమ్మాయిన రేప్ చేయొచ్చ‌ని ఉంది?  కంటికి క‌నిపించిన అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసి.. ఆమె అత్యంత బాధాక‌ర ప‌రిస్థితుల్లో చ‌నిపోయేలా చేసే ప్ర‌త్యేక హ‌క్కు.. అధికారం దోషుల‌కు ఎవ‌రు ఇచ్చారు?  ఒక అమ్మాయి త‌న జీవితాన్ని దారుణంగా ముగించేలా చేసిన దోషుల‌కే న్యాయం గురించి సుద్దులు చెప్పే అవ‌కాశం ఉంటే.. బాధిత కుటుంబానికి మ‌రెన్ని హ‌క్కులు.. అధికారాలు ఉండాలి?

ఒక అమాయ‌కురాలి ప్రాణాన్ని తీసినందుకు ప‌శ్చాతాపంతో కుమిలిపోతూ.. త‌మ‌కు జీవించే హ‌క్కు లేద‌న్న క‌నీస బాధ లేకుండా.. మాకు డ‌బ్బుల్లేవు కాబ‌ట్టి త‌ప్పులు చేస్తాం.. బాగా చ‌దువులేదు కాబ‌ట్టి అనాగ‌రికంగా వ్య‌వ‌హ‌రిస్తామంటే.. ప్ర‌త్యేక మిన‌హాయింపులు ఇవ్వాలా? అన్న‌ది ప్ర‌శ్న‌.
 
ఇక‌.. ఉరిశిక్ష ప‌డిన మ‌రో రాక్ష‌సుడి వాద‌న ఏమిటంటే.. తాను అరెస్ట్ అయ్యే నాటికి త‌న వ‌య‌సు 18 దాట‌లేద‌ని.. ఆ కార‌ణంగా త‌న‌కు విధించిన ఉరిని మార్చాల‌ని కోరుతున్నాడు. పేరుకు పిల్లాడే కానీ పిశాచిలా చేసిన దానికి వ‌దిలేస్తే.. రేపొద్దున స‌మాజం మీద ప‌డి క‌నిపించిన అమ్మాయి ప‌ట్ల ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించి.. చిన్న‌త‌నంలో అలావాటుగా మారింది.. ఈ జీవితానికి ఇలా వ‌దిలేయండి.. నా ఒక్క‌డికి ఇలా హింసించేందుకు అవ‌కాశం ఇవ్వండి.. పేద కుటుంబంలో పుట్టిన నాకు ఆ మాత్రం మిన‌హాయింపులు ఇవ్వ‌రా? అని అడిగితే ఏం చేయాలి?

అంతేనా.. చాలా దేశాల్లో ఉరి అమ‌లు చేయ‌టం లేదంటూ దోషుల త‌ర‌పు వాదించిన లాయ‌ర్ కొత్త లా పాయింట్ తీసిన వైనం చూస్తే.. మ‌రి.. చాలా దేశాల్లో త‌ప్పు చేసిన వెంట‌నే క‌ఠినంగా శిక్ష‌లు అమ‌లు చేస్తార‌న్న విష‌యాన్ని ఎందుకు గుర్తు పెట్టుకోరు?

ఎంత న్యాయ‌వాద వృత్తిలో ఉంటే మాత్రం తాను ఒక మ‌నిషిన‌ని.. త‌న‌కూ ఒక కుటుంబం ఉంద‌ని.. అందులో త‌ల్లి.. చెల్లి.. భార్య లాంటి వారు ఉంటార‌ని.. అలాంటి వారికి నిర్భ‌య త‌ర‌హాలో ఘ‌ట‌న ఎదైనా ఎదురైతే ఇదే త‌ర‌హాలో వాద‌న‌లు వినిపిస్తారా? అంటూ స‌గ‌టుజీవి సంధించే ప్ర‌శ్న‌కు ఆయ‌న లాంటి ఉద్దండులకు చిరాకు అనిపించొచ్చు.. కానీ.. త‌న వాద‌న కూడా అశేష ప్ర‌జానీకానికి ఇలానే అనిపిస్తుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

ఇలా వాదించిన వాద‌న సుప్రీంకోర్టు జ‌డ్జిల‌కు సైతం కాసింత చిరాకుగా అనిపించిన‌ట్లుంది. దోషుల త‌ర‌ఫు న్యాయ‌వాదిని ఉద్దేశించి న్యాయ‌మూర్తులు చేసిన వ్యాఖ్య ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పాలి. మీరు చెప్పిన‌దాని  ప్ర‌కారం చూసిన‌ప్పుడు నిర్భ‌య అత్యాచారం అతి అరుదైన ఘ‌ట‌న కాదు.. అందుచేత వారికి మ‌ర‌ణ‌శిక్ష స‌రికాదు.. ఓ 20-25 ఏళ్లు జైలుశిక్ష విధిస్తే స‌రిపోతుంది అంతేనా? అంటూ జ‌స్టిస్ మిశ్రా.. జ‌స్టిస్ ఆర్.భానుమ‌తి.. జ‌స్టిస్ అశోక్ భూష‌ణ్ తో కూడిన బెంచ్ ప్ర‌శ్నించటం గ‌మ‌నార్హం. ఇలా వాద‌న‌లు జ‌రిగిన త‌ర్వాత దోషులు దాఖ‌లు చేసుకున్న పిటిష‌న్ పై తదుప‌రి విచార‌ణ‌ను వాయిదా వేసింది.


Tags:    

Similar News