భారత్ డ్రెస్సింగ్ రూంలో స్కాట్లాండ్ ఆటగాళ్లు

Update: 2021-11-06 10:30 GMT
టీమిండియా డ్రెస్సింగ్ రూంకు అనుకోని అతిథులు వచ్చారు. స్కాట్లాండ్ ఆటగాళ్లు మనోళ్ల డ్రెస్సింగ్ రూంలో సందడి చేశారు. అందరితో సరదగా మాట్లాడారు. ఆట టెక్నిక్ లను స్టార్ ప్లేయర్ల ద్వారా తెలుసుకున్నారు. మెంటార్ ధోనీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ల నుంచి బ్యాటింగ్, బౌలింగ్ పాఠాలను నేర్చుకున్నారు. మరెన్నో విషయాలను టీమిండియా ప్లేయర్ల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ఇటు బీసీసీఐ, అటు స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించాయి.

క్రికెట్ స్ఫూర్తికి అద్దం పట్టే సంఘటన ఇది. స్కాట్లాండ్ ఆటగాళ్లు టీమిండియా డ్రెస్సింగ్ రూంకు వస్తామంటూ వారి కోరికను చెప్పారు. మనోళ్లు వారి కోరికను మన్నించారు. సొంతింట్లో ఉన్నట్టుగా వారికి ఆతిథ్యం ఇచ్చారు’’ అని పేర్కొంటూ బీసీసీఐ ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇటు క్రికెట్ స్కాట్లాండ్ కూడా స్టార్ ప్లేయర్లతో తమ జట్టు ఆటగాళ్లు మాట్లాడుతున్న ఫొటోలను ట్వీట్ చేసింది. వారి విలువైన సమయాన్ని కేటాయించినందుకు కోహ్లీ అండ్ టీమ్ కు ధన్యవాదాలంటూ పేర్కొంది. ఏప్రిల్ లో అబర్దీన్ లో ఆడేందుకు ఎలా సిద్ధమవుతున్నారంటూ ఓ ఆసక్తికరమైన ప్రశ్నను సంధించింది. అయితే, అది విరాట్ కోహ్లీ అన్నాడా లేకపోతే మరేదైనా ఆంతర్యం ఉందా అనేది మాత్రం క్లారిటీ లేదు.

దుబాయ్ లో స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో అత్యంత ఘనంగా గెలిచారు. స్కాట్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి 17.4 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌట్ కాగా... 86 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 6.3 ఓవర్లలోనూ ఊదిపారేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ విధ్వంసక ఆటతీరుతో స్కాట్లాండ్ బౌలర్లను ఆడుకున్నారు. రాహుల్ 19 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 16 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 30 పరుగులు నమోదు చేశాడు. వీరిద్దరూ అవుటైనా కెప్టెన్ కోహ్లీ (2 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (6 నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు. సూర్యకుమార్ ఓ సిక్స్ తో ఇన్నింగ్స్ కు ముగింపునిచ్చాడు.

ఈ విజయంతో టీమిండియా గ్రూప్-2 పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం గ్రూప్-2లో అన్ని జట్లు నాలుగేసి మ్యాచ్ లు ఆడాయి. పాక్ జట్టు 4 మ్యాచ్ లు ఆడి 4 విజయాలతో అగ్రస్థానంలో ఉండగా, కివీస్ 4 మ్యాచ్ ల్లో 3 విజయాలు.... భారత్ 4 మ్యాచ్ ల్లో 2 విజయాలు నమోదు చేశాయి. పాకిస్థాన్ ఇప్పటికే దాదాపుగా సెమీస్ చేరగా, మరో బెర్తు కోసం న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య సమీకరణాల పరంగా పోటీ నెలకొంది. తన చివరి లీగ్ మ్యాచ్ ను న్యూజిలాండ్ జట్టు నవంబరు 7న ఆఫ్ఘనిస్థాన్ తో ఆడాల్సి ఉండగా, ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓడితే భారత్ కు సెమీస్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. ఒకవేళ ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలిస్తే భారత్ అవకాశాలకు తెరపడినట్టే.


Tags:    

Similar News