రాష్ట్రపతి రేస్ లోకి బిగ్ బీ ని తెచ్చేసిన షాట్ గన్

Update: 2016-03-17 18:32 GMT
తాను అనుకున్నది చెప్పేందుకు ఏ మాత్రం మొహమాటపడని బీజేపీ నేతల్లో సినీ నటుడు శత్రుఘ్న సిన్హా ఒకరు. ఈ మధ్యకాలంలో మోడీపై యాంటీగా మాట్లాడుతూ తరచూ మీడియాలో దర్శనమిస్తున్న ఆయన.. తాజాగా చేసిన ఒక వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం మరికొద్ది నెలల్లో ముగియనుంది. 2012 జూలై 25న పదమూడవ భారత రాష్ట్రపతిగా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఐదేళ్ల పాటు ఆయన రాష్ట్రపతిగా వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పదవీ కాలం మరో 16 నెలల్లో ముగియనుంది.

ఇదిలా ఉండగా ప్రణబ్ తర్వాత రాష్ట్రపతిగా పలువురు పేర్లు వినిపిస్తున్న వేళ.. షాట్ గన్ శత్రుఘ్నసిన్హా తెరపైకి తీసుకొచ్చిన పేరు ఆసక్తికరంగా మారింది. బిగ్ బీ అమితాబ్ పేరును ప్రస్తావించిన ఆయన.. అమితాబ్ రాష్ట్రపతి అయితే తాను చాలా సంతోషిస్తానని చెప్పారు. ఆయన కాలు మోపిన రంగాల్లో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన అమితాబ్ కానీ రాష్ట్రపతి అయితే.. దేశానికి చాలామంచి పేరు వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.

నిజానికి అమితాబ్.. షాట్ గన్ గా వ్యవహరించే శత్రుఘ్నసిన్హాకు మధ్యన అంత మంచి సంబంధాలు లేవని చెబుతుంటారు. అలాంటి షాట్ గన్ తనకు తాను అమితాబ్ పేరును దేశంలోనే అత్యుత్తమ పదవికి ప్రతిపాదించటం ఒక విశేషమైతే.. కీలకమైన పదవికి గ్లామర్.. మంచితనం ఒక్కటే సరిపోదన్న విషయం మర్చిపోకూడదు. తనకు రాజకీయాలు ఏ మాత్రం సూట్ కావని.. గతంలోనే తేల్చేసిన అమితాబ్.. షాట్ గన్ వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News