అటల్ జీ ఫోన్ చేసి ఆ మాట చెప్పారట

Update: 2016-03-12 05:40 GMT
ఈ రోజు ఒక ప్రముఖ దిన పత్రికలో ఒక కాలమ్ వచ్చింది. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా బ్యాంకులకు రూ.9వేల కోట్లు బకాయిలు పడటమే కాదు.. వారికి చెల్లించాల్సిన అప్పుల లెక్క చెప్పకుండానే తన దారిన తాను 11 సూట్ కేసుల్లో విదేశాలకు చెక్కేశారు. ఇదే మాటను ఆయన్ను మీడియా సంస్థలు అంటే ఆయనకు మా చెడ్డ చిరాకు వచ్చేసింది. బ్రిటన్ లోని తన ఫాంహౌస్ కంతలో దాక్కున్న ఆయనకు.. మీడియా విమర్శనాత్మక కథనాలు మా చెడ్డ చిరాగ్గా అనిపించాయి. ఈ నేపథ్యంలో ఆయన మీడియా మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ట్వీట్లలో తన నుంచి సాయం పొందిన మీడియా ప్రముఖులు.. ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయారా? అంటూ చెలరేగిపోయారు. ఇది జరిగిన తర్వాతి రోజే తెలుగు దినపత్రిల్లో ప్రముఖమైన వాటిల్లో ఒకటైన ఒక మీడియా సంస్థ ఒక ప్రముఖ జర్నలిస్ట్ రాసిన ఒక వ్యాపాన్ని అచ్చేసింది. అందులో అంతా ప్రముఖులకు బ్యాంకులు ఎంతలా సాగిల పడతాయన్న విషయంతో పాటు.. బ్యాంకులకు ప్రముఖులు పడే బకాయిల పట్ల ఉదాసీనంగా ఉండాలన్న ఒత్తిడితో పాటు.. ప్రముఖులుగా కీర్తించుకునే పెద్ద మనుషులకు సంబంధించిన ప్రస్తావనను తీసుకొచ్చారు.

ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు సంపాదకుడిగా వ్యవహరించిన శేఖర్ గుప్తా రాసిన ఈ వ్యాసంలో బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన అటల్జీ ప్రస్తావన ఉంది. మచ్చలేని ఆయన సైతం పెద్ద మనుషుల మీద విమర్శలు తీవ్రంగా వచ్చినప్పుడు స్పందించటమే కాదు.. నాడు (2004కు ముందు) రూ.35 కోట్ల బకాయిలు పెద్ద మొత్తం కాదన్న మాటను చెప్పటం.. దాన్ని ఆయన తాజాగా ప్రస్తావించటం చూస్తే.. అంత పెద్ద మనిషి కూడా ప్రజాధనం అంత లోకువైందా? అన్న భావన కలగక మానదు.

తాను ఇండియన్ ఎక్స్ ప్రెస్ దినపత్రికకు ఎడిటర్ గా పని చేసిన కాలంలో ‘‘ద గ్రేట్ బ్యాంక్ రాబరీ’’ శీర్షికతో పరిశోధనాత్మక కథనాలు అచ్చేశామని.. 30కి పైగా భాగాలుగా ప్రచురితమైన ఈ కథనాల్లో కనిపించిన పేర్లు నేటికి సుప్రసిద్ధుల జాబితాలోనే ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎన్డీయే హయాంలో వచ్చిన ఈ కథనాలు నాటి ప్రభుత్వానికి ఆందోళన కలిగించాయని చెప్పిన ఆయన.. ఇంకా ఏం చెప్పారన్నది ఆయన మాటల్లోనే చెబితే..

‘‘ మేం మరీ అతిగా చేస్తున్నామని ‘‘బాగా  పైవాళ్ల’’ నుంచి ఫిర్యాదులొచ్చాయి. ఒకరోజు మధ్యాహ్నం పెద్ద మనిషే స్వయంగా నాకు ఫోన్ చేశారు. ‘‘ఇంకా ఎంత సుదీర్ఘంగా నడుపుతారీ వరుస కథనాలను.. మొత్తం ఏడాదంతానా’’ అని అడిగారు. నేను.. ‘లేదు అటల్జీ, మా జాబితాలోకి ఎక్కడానికి కనీసార్హత రూ.500 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ అప్పు చెల్లించకపోవడం. కాబట్టి ఇంకా కొన్ని కథనాలే వస్త్తాయంతే’ అని చెప్పాను. ‘మరైతే మీరు బాలూ జీని ఎందుకు చేర్చారు? అతను బకాయిపడ్డది 35 కోట్లేగా?’ అని ఆయన అడిగారు. ‘ఆయన ఎంపీ.. మంత్రి కాబట్టి ఆయనింకా తక్కువకే అర్హులయ్యారు. ఇలాంటి కేసులలో ఎంపీలకు గీత తక్కువగా ఉండాలి కదా’ అని నేను నా పద్ధతిలో మందలించాను. డీఎంకేకు చెందిన టీఆర్ బాలు ఎన్‌డీఏ కాబినెట్‌లో ఉన్నారు, ఆయన ఖాయిలా పడ్డ వ్యాపారం బ్యాంకులు రూ.35 కోట్లు రుణం తిరిగి చెల్లించలేదు’’ ఈ మాటల్నిచూసినప్పుడు కలిగే భావన ఒక్కటే. పెద్ద పదవుల్లో ఉన్న వారు చేసేది ఏదీ తప్పు కాదని. రూ.35కోట్ల బ్యాంకు సొమ్ము.. చాలా కొద్దిమొత్తంగా కనిపించటం లాంటివి చూస్తే మన దురదృష్టం మన పాలకుల్లోనే ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.
Tags:    

Similar News