అరెస్టులు మొదలయ్యాయా ?

Update: 2022-10-16 05:30 GMT
మంత్రుల కార్లమీద దాడులుచేసిన జనసైనికులు అనవసరంగా కేసుల్లో ఇరుక్కోబోతున్నారు. విశాఖపట్నంలో అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా ప్రజాగర్జన జరిగిన విషయం తెలిసిందే. భారీ ర్యాలీ, బహిరంగసభలో పాల్గొన్న మంత్రులు, మాజీమంత్రులు వైజాగ్ నుండి విజయవాడకు తిరుగుప్రయాణమయ్యారు. వీళ్ళంతా ఎయిర్ పోర్టుకు చేరుకోగానే మంత్రులు రోజా, జోగిరమేష్, టీటీడీ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్లపైన సడెన్ గా దాడి జరిగింది.

తమ అధినేత పవన్ కల్యాణ్ ను రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్ పోర్టుకు చేరుకున్న జనసైనికుల్లో కొందరు మంత్రుల కార్లపైన కర్రలు, రాళ్ళు, చీపుళ్ళతో దాడిచేయటంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. సరే గొడవను పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారు తర్వాత మంత్రులు వైజాగ్ నుండి వచ్చేశారు. ఆ తర్వాత దాడిపైన ఇటు మంత్రులు, అటు జనసేన అగ్రనేతలు ఒకరిపై మరొకరు మాటల యుద్ధం ప్రారంభించారు.

ఇటు మంత్రులు బాగానే ఉన్నారు అటు పవనూ బాగానే ఉన్నారు. మధ్యలో దాడులు చేసిన కార్యకర్తలు, వీరమహిళలే దెబ్బతినబోతున్నారు. మంత్రుల కార్లపైన దాడులు చేశామని హీరోల్లాగ ఫీలైపోవచ్చు కానీ రెండురోజుల తర్వాత మొదలవుతుంది అసలైన సినిమా. దాడి జరిగింది ఎయిర్ పోర్టులో కాబట్టి కచ్చితంగా సీసీ కెమెరాల్లో దాడుల ఘటనలు మొత్తం రికార్డయ్యుంటాయి. రికార్డయిన మేరకు దాడులుచేసిన వాళ్ళని గుర్తించి పోలీసేలు కేసులు నమోదు చేస్తున్నారు. అరెస్టులు కూడా మొదలయ్యాయి. ఇంకా కొంతమంది కోసం వెతుకుతున్నారు. కాబట్టి ఇక్కడి నుండి వీళ్ళ కష్టాలు మొదలవుతాయి.

ఒక్కసారి కోనసీమ జిల్లాలో జరిగిన గొడవలను గుర్తు తెచ్చుకోవాలి. అల్లర్లకు పాల్పడిన వారిలో చాలామందిని పోలీసులు గుర్తించి కేసులు పెట్టి జైళ్ళకు పంపారు. ఇప్పటికీ బెయిల్ దొరక్క చాలామంది జైళ్ళల్లోనే మగ్గుతున్నారు. సో ఇపుడు దాడులు జరిగింది ఎయిర్ పోర్టులోనే కాబట్టి సెంట్రల్ పోలీసులే కేసులు నమోదు చేస్తారు. ఎందుకంటే విమానాశ్రయం భద్రతంతా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలోనే ఉంటుంది. కాబట్టి ఈ కేసుల్లో ఇరుక్కుంటే ఇక అంతే సంగతులు.
Tags:    

Similar News