న్యాయం అడుగుతోంటే రాష్ట్రం చీల్చడం అంటారా?

Update: 2018-03-13 09:41 GMT
తాము చేస్తే శృంగారం పరులు చేస్తే వ్యభిచారం అనే నీతిని ప్రవచించడంలో తెలుగుదేశం తర్వాతనే ఎవరైనా ఉంటారు. పైగా ఆ పార్టీ తరఫున అర్థం పర్థం లేని - తలాతోకా లేని విమర్శలు చేయడంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముందంజలో ఉంటారని కూడా.. ప్రజలు అనకుంటూ ఉంటారు. అలాంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏ కాలాన  ఉన్నారో గానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్లీ చీలిపోవడం గురించి.. మంచి ముహూర్తం చూసుకుని తన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రాన్ని మళ్లీ విడగొట్టేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తున్నదంటూ.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించడం విశేషం. ఒక ఓటు రెండు రాష్ట్రాల సిద్దాంతాన్ని భాజపా మళ్లీ తెరమీదకు తెస్తున్నదని ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాము చెప్పినట్లు చేయకుండా.. రాష్ట్రాన్ని మళ్లీ ముక్కలుగా విడగొడతాం.. అని మోడీ సర్కారు బెదిరిస్తున్నదట. మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వైకాపా మద్దతు ఇచ్చి సహకరిస్తున్నదట.

... ఇవీ సోమిరెడ్డి గారు చేస్తున్న అర్థం పర్థం లేని ఆరోపణలు. ఇంత తలాతోకా లేకుండా ఎలా మాటలు రువ్వగలుగుతున్నారో.. ప్రజల్లో సెంటిమెంటును రెచ్చగొడుతున్నాం అనే ఆలోచన లేకుండా.. బాధ్యత రహితంగా ఎలా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని పలువురు అంటున్నారు.

రాయలసీమలో రెండో రాజధాని కావాలని - హైకోర్టు కావాలని భారతీయ జనతా పార్టీ డిమాండు చేస్తున్నందుకు గాను.. సోమిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యానం ఇవ్వదలచుకున్నట్లుగా కనిపిస్తోంది. హైదరాబాదులో ఏ రకంగా అయితే.. అభివృద్ధిని కేంద్రీకృతంచేసి.. రాష్ట్రం చీలడానికి చంద్రబాబు కారణం అయ్యారో.. ఇప్పుడు అమరావతిలో అదే మాదిరిగా సీన్ రిపీట్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అందుకే రాయలసీమ భాజపా సమతుల న్యాయం కోసం అక్కడ కూడా హైకోర్టు - రెండో రాజధాని ఉండాలని కోరుతున్నది. ఆ మాత్రానికే భాజపా రాష్ట్రాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తే గనుక.. తెలుగుదేశాన్ని ప్రజలు  ఛీత్కరించుకుంటారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News