మోడీపై సోనియ‌మ్మ షాకింగ్ కామెంట్స్‌

Update: 2017-11-21 05:13 GMT
ప్ర‌ధాని కుర్చీలో కూర్చ‌న్న త‌ర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సీరియ‌స్ కామెంట్స్ చేసింది చాలా త‌క్కువ‌. ఆచితూచి అన్న‌ట్లుగానే ఆమె మాట్లాడారు. మూడున్న‌రేళ్ల కాలంలో మోడీ పాల‌న‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డింది లేనే లేదు. అలాంటిది తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. మోడీ స‌ర్కారుపై నిప్పులు చెరిగిన సోనియ‌మ్మ మాట‌ల్లో కొన్ని చూసిన‌ప్పుడు అవును.. నిజ‌మే క‌దా అన్న భావ‌న క‌లిగేలా ఉండ‌టం గ‌మ‌నార్హం.

తాజాగా నిర్వ‌హించిన కాంగ్రెస్ సీడ‌బ్ల్యూసీ స‌మావేశంలో మాట్లాడిన ఆమె మోడీ స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్యానించారు. మోడీ ప్ర‌భుత్వం దుర‌హంకారంతో వ్య‌వ‌హ‌రిస్తోందంటూ విరుచుకుప‌డిన ఆమె.. ప్ర‌జాస్వామ్య దేవాల‌యానికి తాళం వేస్తున్నార‌ని ఆరోపించారు.

నోట్ల ర‌ద్దు.. జీఎస్టీతో స‌గ‌టు జీవికి క‌ష్టాలు తెచ్చి పెట్టిన మోడీ స‌ర్కార్‌.. పార్ల‌మెంటును ఎదుర్కొనే ధైర్యం లేక శీతాకాల స‌మావేశాల్ని వాయిదా వేసింద‌న్నారు. శీతాకాల స‌మావేశాల్ని మొద‌లు పెట్ట‌కుండా మోడీ స‌ర్కారు త‌న దుర‌హంకారం ప్ర‌ద‌ర్శించార‌న్నారు. పార్ల‌మెంట‌రీ ప్ర‌జాస్వామ్యంపై చీక‌ట్లు చిమ్మేలా చేస్తుంద‌న్నారు.

ఎన్నిక‌ల పేరు చెప్పి పార్ల‌మెంటుకు తాళాలు వేయ‌టం ద్వారా రాజ్యాంగ జ‌వాబుదారీత‌నాన్ని త‌ప్పించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఆరోపించారు. అలా చేయ‌టం పొర‌పాట‌న్న ఆమె.. జీఎస్టీ అమ‌లు కోసం అర్థ‌రాత్రి పార్ల‌మెంటు వేడుక‌లు జ‌రిపే సాహ‌సం చేశార‌ని.. ఇప్పుడు  మాత్రం పార్ల‌మెంటును ఎదుర్కొనే ధైర్యం మోడీకి చాల‌టం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు.

పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం తీసుకొని ఏడాది త‌ర్వాత కూడా సామాన్య ప్ర‌జ‌ల‌కు ఎలాంటి లాభం లేద‌ని తేలింద‌ని.. రైతులు.. చిన్న వ్యాపారులు.. కూలీలు.. గృహిణుల‌కు పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లుగా మారింద‌న్నారు. ఇందిరా గాంధీ శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను ప్ర‌భుత్వం విస్మ‌రించింద‌న్న సోనియా.. పార్ల‌మెంటు స‌మావేశాలను నిర్వ‌హించ‌కుండా ఉండ‌టంపై నిప్పులు చెరిగేలా వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌ప్పుడు పార్ల‌మెంటు స‌మావేశాల్ని వాయిదా వేయ‌టం స‌హ‌జ‌మేన‌ని కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హ‌యాంలో కూడా ఇలానే చేశారంటూ గుర్తు చేశారు.

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల‌పై ప్ర‌తిప‌క్షాల నుంచి ఎదుర‌వుతున్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో వాటికి చెక్ చెప్పాల‌ని మోడీ స‌ర్కారు ఆలోచిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. డిసెంబ‌రు రెండో వారంలో స‌మావేశాల్ని ప్రారంభించాల‌ని భావిస్తున్నారు. శీతాకాల స‌మావేశాల్ని ప‌ది రోజుల‌కు ప‌రిమితం చేయాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News