పవన్ ఎంట్రీ జగన్ కు చెక్ పెట్టడానికేనా?

Update: 2015-08-24 10:46 GMT
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన అమరావతిలోకి సినీ నటుడు పవన్ కల్యాణ్ ఎంట్రీ వైసీపీ అధినేత జగన్ కు చెక్ పెట్టడానికేనా? జగన్ పార్టీ ప్రాబల్యం ఉన్న ఆ ప్రాంతంలో పవన్ ప్రాబల్యాన్ని పెంచడానికే భూ సేకరణ ఎత్తులు వేస్తున్నారా? ఈ ప్రశ్నలకు ఔను అనే అంటున్నాయి రాజకీయ వర్గాలు.

వాస్తవానికి రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాక, బేతపూడి గ్రామాల్లో మాత్రమే రైతులు రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వలేదు. మిగిలిన గ్రామాల రైతులు అంతా ఇచ్చారు. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు. ఈ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించే నాటికి మిగిలిన గ్రామాల్లో ఎకరా పది లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటే ఈ గ్రామాల్లో మాత్రమే మూడు నాలుగు కోట్ల రూపాయలు పలుకుతోంది. రాజధాని ప్రకటన తర్వాత అది ఆరేడు కోట్లు అయింది. ఆ తర్వాత ఇప్పుడు గణనీయంగా పడిపోయింది. రెండు.. ఈ గ్రామాలు వైసీపీ ప్రాబల్య ప్రాంతాలు. రెడ్డి సామాజిక వర్గానిదే ఆధిపత్యం. తమ భూములు ఇప్పటికే బంగారమని, వీటిని రాజధానికి ఇస్తే తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. దాంతో రాజధానికి భూములు ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు. దాంతో వైసీపీ నేతలంతా భూ సమీకరణకు వ్యతిరేకమనే ప్రచారం చేశారు. దానికితోడు జగన్ కూడా ఇక్కడ పర్యటించి భూములు ఇవ్వవద్దని చెప్పారు. దాంతో రైతులు మరింత బీష్మించారు.

ఈ భూములను సేకరించకుండా వదిలేస్తే ఆ క్రెడిట్ జగన్ కు పోతుంది. జగన్ అడ్డుకున్నాడు కనక తమ భూములు మిగిలాయంటూ ఆ గ్రామాల్లోని రైతులు వైసీపీకి మరింత అభిమానులవుతారు. వాస్తవానికి ఈ మూడు గ్రామాలూ కూడా జనాభా ఎక్కువ. ప్రాబల్య ప్రాంతాలు కూడా. దానితో పవన్ కల్యాణ్ను రంగంలోకి దించారని, ఇక్కడ భూ సేకరణను నిలిపి వేసినా ఆ క్రెడిట్ జగన్ కు దక్కకూడదన్నదే దీని పరమార్థమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Tags:    

Similar News