సుమలత పయనమెటు?

Update: 2019-06-09 06:56 GMT
సార్వత్రిక ఎన్నికల్లో యావత్‌ భారతీయుల దృష్టిని ఆకర్షించిన మండ్య పార్లమెంటు స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించిన నటి సుమలత ఏ పార్టీలో చేరుతారనే దానిపై సస్పెన్స్‌ నెలకొంది. తన భర్త రెబల్‌స్టార్‌ అంబరీశ్‌ కొనసాగిన కాంగ్రెస్‌లోకి చేరుతారా? లేక మండ్య ఎన్నికల్లో తనకు సంపూర్ణ మద్దతు ఇచ్చిన భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారా? అనేది ఇంకా తెలియరాలేదు. అయితే ఎన్నికల్లో తనకు సహకరించిన బీజేపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు బీజేపీ నేతల నివాసాల వద్దకు వెళ్లి వచ్చారు. ఇందులో భాగంగా మాజీ సీఎంలు బీఎస్‌ యడ్డూరప్ప, ఎస్‌ఎం కృష్ణ ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు చెప్పి వచ్చారు. అంతేకాకుండా ఢిల్లీ, బెంగళూరులోని బీజేపీ కార్యాలయాలకు కూడా వెళ్లి ఆ పార్టీ నేతలతో మాట్లాడారు. కానీ తాను ఏ పార్టీలో చేరాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆమె తెలిపారు. తనను గెలిపించిన మండ్య ప్రజలతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చిన బీజేపీ నేతలకు కేవలం కృతజ్ఞతలు తెలిపేందుకే వెళ్లినట్లు ఆమె స్పష్టం చేశారు.

కన్నడ రెబల్‌స్టార్‌గా పేరుగాంచిన అంబరీశ్‌ తుదిశ్వాస వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగారు. మండ్య నుంచి 1998, 1999, 2004లో వరుసాగా మూడుసార్లు ఎంపీగా గెలిచారు. ఈక్రమంలో 2006 – 2008 వరకు కేంద్రమంత్రిగా కూడా సేవలు అందించారు. 1994లో రాజకీయ అరంగేట్రం కాంగ్రెస్‌తో చేసినా.. రెండేళ్లకే జనతాదళ్‌లో చేరారు. ఈక్రమంలో 1998లో జనతాదళ్‌ నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం 1999 ఎన్నికల్లో కాంగ్రెస్‌లో చేరి పోటీ చేసి విజయం సాధించారు. కాగా సిద్ధరామయ్య ప్రభుత్వంలో రాష్ట్రమంత్రిగా పని చేశారు. అయితే ఉన్నఫలంగా కేబినెట్‌ నుంచి తొలగించడంతో కాంగ్రెస్‌కు దూరమయ్యారు. ఇందులో భాగంగా 2018 ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్‌ ఇచ్చినా.. నిరాకరించారు. త్వరలోనే జేడీఎస్‌లో చేరుతారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో 2018 నవంబర్‌ 24న గుండెపోటుతో మరణించారు.

విధానసభ ఎన్నికల్లో హంగ్‌ రావడంతో కాంగ్రెస్‌ – జేడీఎస్‌ జత కట్టి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. రాష్ట్రంలోని 28 పార్లమెంటు స్థానాలకు గానూ కాంగ్రెస్‌ 21, జేడీఎస్‌ 7 సీట్లలో పోటీ చేశాయి. మైత్రి ఒప్పందంలో భాగంగా మండ్య సీటు జేడీఎస్‌కు అప్పగించారు. దీంతో కాంగ్రెస్‌ తరఫున టికెట్‌ ఆశించిన అంబరీశ్‌ సతీమణి సుమలతకు నిరాశ ఎదురైంది. అయితే అభిమానులు, సినీప్రముఖుల మద్దతుతో ఆమె స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగారు. అంతేకాకుండా సుమలతకు మద్దతు ప్రకటించిన బీజేపీ మండ్యలో పోటీ నుంచి తప్పుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ – జేడీఎస్‌ కూటమి తరఫున పోటీ చేసిన సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్‌పై స్వతంత్య్ర అభ్యర్థి విజయం సాధించారు. అయితే ఆమె ప్రస్తుతం ఏ పార్టీలో చేరుతారనే దానిపై సస్పెన్స్‌ నెలకొంది.

మండ్య నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన నటి సుమలత బీజేపీలో చేరితే సాదరంగా ఆహ్వానిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్‌ యడ్డూరప్ప స్పష్టం చేశారు. అయితే ఆమె ఏ నిర్ణయం తీసుకుంటుందో తమకు తెలియదన్నారు. పార్టీలో చేరే విషయమై సుమలతతో చర్చించలేదని చెప్పారు. కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం కొనసాగిన తన భర్త తరహాలో ఆమె కూడా అదే పార్టీలో చేరుతారనే ప్రచారం కూడా సాగుతోంది. అంతేకాకుండా మండ్య ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకులు పరోక్షంగా మద్దతు ఇవ్వడంతోనే గెలిచానని సుమలత తన అనుచరుల వద్ద చెప్పినట్లు తెలిసింది.
Tags:    

Similar News